మణిపూర్‌కు మరో 50 సీఆర్‌పీఎఫ్ కంపెనీలు

మణిపూర్‌కు మరో 50 సీఆర్‌పీఎఫ్ కంపెనీలు
మణిపూర్‌‌కు అదనంగా 50 కంపెనీల సీఆర్‌పీఎఫ్ బలగాలను పంపించాలని కేంద్రం నిర్ణయించింది. ప్రస్తుతం 20 కంపెనీల సీఆర్‌పీఎఫ్ బలగాలు రాష్ట్రంలో మోహరించగా, తాజా నిర్ణయంతో 70 కంపెనీల సీఆర్‌పీఎఫ్ బలగాలు రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణ బాధ్యతను తీసుకుంటాయి. 35 కంపెనీల సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్‌), 15 కంపెనీల సరిహద్దు భద్రతా దళం (బీఎస్‌ఎఫ్‌) బలగాలను పంపనున్నారు.
 
మణిపూర్‌లోని జిరిబామ్ జిల్లాలో చెలరేగిన హింసాకాండ ఇతర ప్రాంతాలకు విస్తరించింది. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంలో కేంద్ర బలగాలను మోహరించడం ఇది రెండోసారి. నవంబర్ 12న కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ మరో 20 సీఏపీఎఫ్‌ (15 సీఆర్పీఎఫ్‌, 5 బీఎస్‌ఎఫ్‌) యూనిట్లను మణిపూర్‌కు పంపింది. దీంతో ఆ రాష్ట్రంలో ఇప్పుడు 218 కంపెనీల బలగాలున్నాయి.
 
మణిపూర్‌లో మళ్లీ హింసాకాండ ప్రజ్వరిల్లడంతో అక్కడి పరిస్థితిపై కేంద్ర హోం మంత్రి అమిత్‌షా రెండో రోజైన సోమవారంనాడు కూడా అత్యున్నత స్థాయి భద్రతా సమావేశంలో సమీక్షించారు. ఈశాన్య రాష్ట్రంలో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుతుండంతో రాష్ట్రంలో భద్రతను మరింత పటిష్టం చేయాలని హోం శాఖ నిర్ణయించింది.
 
మరోవైపు మహిళలు, పిల్లలను కుకీ మిలిటెంట్లు హత్య చేయడంపై మణిపూర్‌లో నిరసనలు, హింసాత్మక సంఘటనలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో స్కూళ్లు, కాలేజీలకు రెండు రోజులు సెలవు ప్రకటించారు. ఇంఫాల్ పశ్చిమ, తూర్పు జిల్లాల్లోని యూనివర్సిటీలు, కాలేజీలతో సహా అన్ని ప్రభుత్వ విద్యా సంస్థలను మంగళవారం వరకు మూసివేస్తున్నట్లు ప్రభుత్వం సోమవారం ప్రకటించింది.
 
ప్రస్తుతం ఉన్న భద్రతా పరిస్థితిని అమిత్‌షా సమీక్షించడంతో పాటు, ఎలాంటి పరిస్థితుల్లోనూ శాంతి భద్రతల పరిరక్షణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సీఆర్‌పీఎఫ్, రాష్ట్ర పోలీసు అధికారులకు ఆదేశాలిచ్చారు. గత ఏడాది మణిపూర్‌లో చెలరేగిన జాతుల ఘర్షణలో 200 మందికి పైగా ప్రాణాలు కోల్పాగా, వేలాది మంది నిరాశ్రయులయ్యారు. 
 
పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉన్న తరుణంలో గత శనివారంనాడు తిరిగి హింసాకాండ చెలరేగింది. సాయుధ మిలిటెంట్లు ఆరుగురు గ్రామస్థులను కిడ్నాప్ చేసి ఊచకోత కోసి చంపడంతో ఒక్కసారిగా ఆందోళనలు పెల్లుబికాయి. నిరసనకారులు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్లపై దాడులు చేసి, వాహనాలను తగులబెట్టారు. సీఎం బీరేంద్ర సింగ్ ఇంటిపై కూడా దాడికి విఫలయత్నం చేశారు. 
 
నిరసనలు, ఆందోళనలను అదుపు చేసే క్రమంలో భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో జిరిబాం జిల్లాకు చెందిన 20 ఏళ్ల యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఆందోళనకారులు స్థానిక బీజేపీ, కాంగ్రెస్ కార్యాలయాల్లోకి చొరబడి ఆస్తుల విధ్వంసానికి పాల్పడ్డారు. ఫర్నిచర్‌ను దగ్ధం చేశారు. మణిపూర్‌లో సంక్షోభం ముదురుతుండటంతో శాంతిభద్రత వైఫల్యానికి నిరసగా బీజేపీ సారథ్యంలోని బీరేంద్ర సింగ్ ప్రభుత్వానికి నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్‌పీపీ) మద్దతును ఉపసంహరించుకుంది.కేంద్ర హోం శాఖ ఆదేశాల మేరకు ఇటీవల మణిపూర్‌లో చెలరేగిన హింసాకాండకు సంబంధించిన మూడు కేసుల దర్యాప్తు బాధ్యతను నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) చేపట్టింది. వీటిలో కుకీ ఉగ్రవాదులకు, సీఆర్‌పీఎఫ్‌కు మధ్య ఇటీవల జరిగిన కాల్పులకు సంబంధించిన కేసు కూడా ఉంది. ఈ ఎన్‌కౌంటర్‌లో 11 మంది కుకీ ఉగ్రవాదులను బలగాలు మట్టుబెట్టాయి.