అమరావతి మాజీ ఎంపీ నవనీత్‌ రాణాపై దాడికి యత్నం

అమరావతి మాజీ ఎంపీ నవనీత్‌ రాణాపై దాడికి యత్నం
అమరావతి మాజీ ఎంపీ, నటి నవనీత్ రాణాపై పలువురు దాడికి యత్నించారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా అమరావతి జిల్లా దరియాపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రచారంలో పాల్గొన్నారు. ఈ క్రమంలో అల్లరి మూకలు దాడికి యత్నించడంతో పాటు కుర్చీలను విరగొట్టారు. ఈ ఘటనపై ఖల్లార్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. 
 
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారం చివరి దశకు చేరుకుంది. ప్రచార కార్యక్రమం ఈ నెల 18తో ముగియనున్నది. దాంతో ఆమె దరియాపూర్‌ నియోజకవర్గ పరిధిలోని ఖల్లార్‌పూర్‌ గ్రామంలో యువ స్వాభిమాన్‌ అభ్యర్థి రమేశ్‌ బండిలే మద్దతుగా ప్రచారం నిర్వహించారు. నవనీత్‌ రాణా ప్రసంగిస్తున్న సమయంలో ఆమెకు వ్యతిరేకంగా పలువురు నినదించారు. 
 
అయితే, ప్రచారసభలో ప్రసంగించిన అనంతరం వేదికపై నుంచి కిందకు రాగానే తనపై కుర్చీలు విసిరేందుకు కొందరు యత్నించారని నవనీత్‌ రాణా ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రసంగానికి అడ్డు తగులుతూ గందరగోళం సృష్టించారని ఆరోపించారు. అయితే, వారంతా ఓ వర్గానికి చెందిన వారని.. తనను దూషిస్తూ దాడికి యత్నించారని.. ఉమ్మివేశారని ఆమె ఫిర్యాదు చేశారు. తనను గన్స్‌మెన్స్‌ కాపాడి తీసుకువచ్చారని ఆమె పేర్కొన్నారు. ఈ క్రమంలో గన్‌మెన్‌లలో ఒకరికి గాయాలైనట్లు సమాచారం. కుర్చీ విసిరడంతో గాయమైనట్లు తెలుస్తున్నది.