ఖలిస్తానీ ఉగ్రవాది అర్ష్‌ దల్లాను భారత్‌ రప్పిస్తారా?

ఖలిస్తానీ ఉగ్రవాది అర్ష్‌ దల్లాను భారత్‌ రప్పిస్తారా?
అరెస్టయిన ఖలిస్తానీ ఉగ్రవాది అర్ష్‌ దల్లా భారత్‌కు అప్పగించాలని కోరుతామని కేంద్రం ప్రకటించింది. అయితే, ఉగ్రవాదిని భారత్‌కు అప్పగిస్తారా? అని కెనడా విదేశాంగ మంత్రిని మెలోనీ జాలీని ప్రశ్నించగా ఈ విషయం తనకు ఎలాంటి సమాచారం లేదని తెలిపారు. ఖలిస్తానీ ఉగ్రవాది అర్ష్‌ దల్లా భారత్‌లో మోస్ట్‌ వాంటెడ్‌ జాబితాలో ఉన్నాడు. ఇటీవల అతన్ని కెనడా పోలీసులు అరెస్టు చేశారు. 
 
అయితే, దల్లాను భారత్‌కు అప్పగించాలని కోరుతామని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. మెలోనీ జాలీని భారత్‌ డిమాండ్‌పై ప్రశ్నించగా ఈ విషయం ఇంకా విచరణలోనే ఉందని, దానిపై ఇప్పుడు ఏమీ చెప్పలేనని ఆమె పేర్కొన్నారు. భారత దౌత్యవేత్తల నుంచి ఏదైనా సమాచారం కోరితే వారితో మాట్లాడుతామని చెబుతూ అప్పగింత విజ్ఞప్తిపై నిర్దిష్ట సమాచారం లేదని చెప్పారు.
 
విదేశాంగ మంత్రిత్వ శాఖ స్థాయిలో చర్చలు కొనసాగిస్తామని ఆమె తెలిపారు. కెనడాలో కాల్పుల కేసులో అర్ష్ దల్లా అక్టోబర్‌ 28న అరెస్టయ్యాడు. అర్ష్ దల్లా భారత్‌ నుంచి పరారై కెనడాలో ఆశ్రయం పొందుతున్నాడు. అతనిపై హత్య, హత్యాయత్నం, దోపిడీ, ఉగ్రవాద చర్యలకు పాల్పడడం తదితర 50కిపైగా కేసులు నమోదయ్యాయి. మే 2022లో దల్లాపై రెడ్ కార్నర్ నోటీసు జారీ అయ్యింది. 
 
2023 సంవత్సరంలో అర్ష్‌ దల్లాను భారత్‌ ఉగ్రవాదిగా ప్రకటించింది. అతన్ని అప్పగించాలని గతంలో కెనడా ప్రభుత్వాన్ని కేంద్రం కోరింది. భారత్, కెనడా మధ్య సంబంధాలు దెబ్బతిన్న తరుణంలో అర్ష్ దల్లా ఉదంతం మరోసారి వెలుగులోకి వచ్చింది. ఇటీవల, కెనడాలోని హిందూ దేవాలయంపై ఖలిస్తాన్ తీవ్రవాదులు దాడి చేయగా.. ప్రధాని నరేంద్ర మోదీ సైతం ఘటనపై విమర్శలు గుప్పించారు.