ఇస్లామిక్‌ దేశం దిశగా బంగ్లాదేశ్‌?

ఇస్లామిక్‌ దేశం దిశగా బంగ్లాదేశ్‌?
 
* రాజ్యాంగంలో `సెక్కులర్’ పదం తొలగించాలన్న అటార్నీ జనరల్
 
బంగ్లాదేశ్‌ ఇస్లామిక్‌ దేశం దిశగా అడుగులు వేస్తున్నది. ఆ దేశ రాజ్యాంగం నుంచి ‘సెక్యులర్‌’ పదం తొలగింపునకు ప్రయత్నం జరుగుతున్నది. ఈ మేరకు ఆ దేశ అటార్నీ జనరల్‌ మహమ్మద్‌ అసదుజ్జామన్‌ సుప్రీంకోర్టులో ఇటీవల వాదనలు వినిపించారు. దేశంలో 90 శాతం మంది ముస్లింలు ఉన్న నేపథ్యంలో సెక్యులర్‌ అనే పదానికి అర్థం లేదని స్పష్టం చేశారు. 
 
రాజ్యాంగేతర మార్గాల ద్వారా పాలనలో మార్పునకు మరణశిక్షను సూచించే నిబంధనతో పాటు రాజ్యాంగం నుంచి ‘సెక్యులరిజం’, ‘సోషలిజం’ అనే పదాలను తొలగించాలని ఆయన ప్రతిపాదించారు. 15వ రాజ్యాంగ సవరణపై దాఖలైన పిటిషన్‌పై వాదనల సందర్భంగా ద్విసభ్య ధర్మాసనం ముందు ఈ మేరకు అభిప్రాయం వ్యక్తంచేశారు. 
“ఇంతకుముందు, అల్లాపై స్థిరమైన విశ్వాసం ఉండేది. ఇది మునుపటిలానే నాకు కావాలి. అన్ని మతాల ఆచారంలో ప్రభుత్వం సమాన హక్కులు, సమానత్వాన్ని నిర్ధారించాలని ఆర్టికల్ 2ఏ చెబుతుంది. ఆర్టికల్ 9 ‘బెంగాలీ జాతీయవాదం గురించి మాట్లాడుతుంది. ‘ఇది విరుద్ధమైనది,” అని ఆయన వాదించారు. 
 
ఆ దేశ తొలి ప్రధాని షేక్‌ ముజిబుర్‌ రెహ్మాన్‌ను జాతిపితగా పిలవడం పట్ల కూడా అభ్యంతరం తెలిపారు. స్వాతంత్య్ర పోరాటంలో ఆయన కృషిని కాదనలేమని, కానీ జాతిపితగా కీర్తించడం విషయంలో భిన్న వాదనలు ఉన్నాయని పేర్కొన్నారు. ప్రజాస్వామిక విలువలను ప్రతిబింబించేలా రాజ్యాంగం ఉండాలని కోరారు.
‘షేక్ ముజిబుర్ రెహమాన్ బంగ్లాదేశ్‌లో తిరుగులేని నాయకుడు.. అయితే రాజకీయ ప్రయోజనాల కోసం అవామీ లీగ్ ఆయన పేరును వాడుకుంటోంది’ అని ఆయన విమర్శించారు. బంగ్లాదేశ్ వ్యవస్థాపక నాయకుడైన ఆయనను `బంగాబంధు’ అని కొనియాడారు. 
 
దేశ బహిష్కరణకు గురైన బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా నాయకత్వంలోని అవామీ లీగ్ హయాంలో చేసిన 15వ రాజ్యాంగం సవరణ చెల్లుబాటును సవాల్ చేస్తూ రిట్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే, హైకోర్టు ధర్మాసనంలోని ఇద్దరు న్యాయమూర్తులు ఈ విషయంలో మధ్యంతర ప్రభుత్వం తన వైఖరితో ముందుకు రావాలని నోటీసులు జారీచేసింది.
 
కోర్టు వెలుపల అటార్నీ జనరల్ తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుత  ‘మొత్తంగా ఆ (హైకోర్టు) నిబంధనను రద్దు చేయాలని మేము కోరుకోవడం లేదు’ అని రిట్ పిటిషన్‌పై ప్రభుత్వ వైఖరిని స్పష్టం చేశారు. కోర్టు విచారణ సమయంలో 15వ సవరణ ద్వారా రాజ్యాంగంలో చేర్చిన ఆర్టికల్ 7ఏను అటార్నీ జనరల్ తీవ్రంగా విమర్శించారు. 
 
ఇక, చాలా మంది మంది లాయర్లు ఈ రిట్ పిటిషన్‌లో భాగస్వాములుగా ఉన్నారు. అయితే, కొందరు ఈ అభ్యర్ధనను సమర్థించగా, ఇంకొందరు వ్యతిరేకించారు.  రాజ్యాంగంలోని అనేక నిబంధనలు పునరుద్ధరణ, రద్దు, కొత్తవి నిబంధనలు చేర్చడానికి నాటి అవామీ లీగ్ ప్రభుత్వం 15వ సవరణను పూర్తి మెజార్టీతో పార్లమెంటు ఆమోదించింది. 
 
ఈ సవరణలలో లౌకికవాదాన్ని రాజ్య సూత్రంగా పునరుద్ధరణ, ఎన్నికల పర్యవేక్షణ కోసం ఆపద్ధర్మ ప్రభుత్వ వ్యవస్థను రద్దు, రాజ్యాంగేతర మార్గాల ద్వారా రాజ్యాధికారాన్ని చేపట్టడం, షేక్ ముజిబుర్ రెహమాన్‌ను జాతిపితగా పేర్కొనడం వంటివి ఉన్నాయి. ముఖ్యంగా ఆపద్ధర్మ ప్రభుత్వ వ్యవస్థను పునరుద్ధరించాలని, రాజ్యాంగంలో ప్రజాభిప్రాయ సేకరణను ఏర్పాటు చేయాలని తాజాగా డిమాండ్ చేశారు.
 
రిజర్వేషన్లకు వ్యతిరేకంగా చేపట్టిన ఉద్యమం బంగ్లాదేశ్‌లో తిరుగుబాటుకు దారితీసి  అల్లర్లతో దేశం అట్టుడికిపోయింది. దీంతో షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేసి, కట్టుబట్టలతో భారత్‌కు వచ్చి తలదాచుకుంటున్నారు. ఆగష్టు 5న అవామీ లీగ్ ప్రభుత్వం కూలిపోగా, అనంతరం మూడు రోజుల తర్వాత నోబెల్ గ్రహీత ముహమ్మద్ నాయకత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటయ్యింది. ఆయన ప్రధాన సలహాదారుగా బాధ్యతలు స్వీకరించారు.