వైసిపి ఎమేల్యేలకన్నా ఎక్కువ మంది ప్రభుత్వ విప్ లు

వైసిపి ఎమేల్యేలకన్నా ఎక్కువ మంది ప్రభుత్వ విప్ లు

* డిప్యూటీ స్పీకర్‌గా రఘురామకృష్ణరాజు

గతంలో జంబో క్యాబినెట్ లు ఉండేవి. వీటిని అరికట్టేందుకు లోక్ సభతో పాటు ఏ రాష్ట్ర అసెంబ్లీలో అయినా కూడా సభ్యుల సంఖ్యలో క్యాబినెట్ మంత్రులు 15 శాతం మించటానికి లేదని నిబంధనలు రూపొందించారు. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గతంలో ఎన్నడూ లేని రీతిలో విప్ లను నియమించారు. ఒక్క మాటలో చెప్పాలంటే వైసీపీ ఎమ్మెల్యేల కంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో విప్ లే ఎక్కువ అని చెప్పొచ్చు. 
 
కూటమి పార్టీలు అయిన జనసేన, బీజేపీ లతో పాటు టీడీపీ సభ్యులకు చోటు కల్పిస్తూ ఏకంగా 15 మంది విప్ లను నియమించారు. వాస్తవానికి ఎప్పుడో జరగాల్సిన ఈ నియామకాలు ఇప్పటికి ఒక కొలిక్కి వచ్చాయి.  ఏపీ శాసనసభ ఉపసభాపతిగాగా ఉండి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణరాజు పేరును సీఎం చంద్రబాబు ఖరారు చేశారు. రఘురామ కృష్ణరాజు అధికార కూటమి ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఎన్నుకోనున్నారు.
 
ఏపీ అసెంబ్లీలో చీఫ్ విప్‍గా వినుకొండ ఎమ్యెల్యే జీవీ ఆంజనేయులు ను, ఏపీ శాసనమండలిలో చీఫ్ విప్‍గా పంచుమర్తి అనురాధ ని నియమించారు. ఏపీ అసెంబ్లీలో విప్‍లుగా ఏకంగా 15 మంది కి చోటు కల్పిస్తే వారిలో టీడీపీ నుంచి బెందాళం అశోక్, యనమల దివ్య, బోండా ఉమ, దాట్ల సుబ్బరాజు, డా.థామస్, జగదీశ్వరి, కాల్వ శ్రీనివాసులు, మాధవి రెడ్డప్ప, గణబాబు, పిజివిఆర్ నాయుడు, తంగిరాల సౌమ్య, యార్లగడ్డ వెంకట్రావులు ఉన్నారు.
 
జనసేన నుంచి విప్‍లుగా బొలిశెట్టి శ్రీనివాస్, బొమ్మిడి నాయకర్, అరవ శ్రీధర్ బీజేపీ నుంచి విప్‍గా ఆదినారాయణరెడ్డి నియామకం చేపట్టారు. అయితే అసెంబ్లీ చీఫ్ విప్ పదవి విషయానికి వస్తే అకస్మాత్తుగా ఎక్కడా ప్రచారం లో లేని పేరు జీ వి ఆంజనేయులు తెరమీదకు రావటం టీడీపీ వర్గాలను కూడా షాక్ కు గురి చేసింది. అయితే ఈ విషయంలో తెర వెనక చాలా వ్యవహారాలు జరిగినట్లు పార్టీ నాయకులు చెపుతున్నారు. తొలిసారి ఎమ్మెల్యేలుగా ఎన్నికైన 8 మందికి శాసనసభలో విప్‌లుగా పదవులు దక్కాయి. శాసనమండలిలో చీఫ్‌ విప్, విప్‌లు నలుగురూ తొలిసారి ఎన్నికైనవారు కావడం విశేషం.