దేశంలో భారతీయ జనతా పార్టీ ఉనికిలో ఉన్నంత కాలం మతపరమైన రిజర్వేషన్లు ఉండవని బీజేపీ అగ్రనేత, కేంద్ర మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. ఓబీసీలు, దళితులు, గిరిజనుల రిజర్వేషన్ పరిమితిని తగ్గించి ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించాలని కాంగ్రెస్ భావిస్తోందని ఆరోపించారు. భారత రాజ్యాంగంలో ఎక్కడా మతం ఆధారంగా రిజర్వేషన్లు కల్పించే నిబంధనలు లేవని ఆయన తేల్చి చెప్పారు.
కాంగ్రెస్‌ను ఓబీసీ వ్యతిరేక పార్టీగా పేర్కొంటూ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఝార్ఖండ్‌లోని పాలములో నిర్వహించిన ర్యాలీలో కాంగ్రెస్‌పై అమిత్ షా తీవ్ర విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నకిలీ రాజ్యాంగ ప్రతిని చూపిస్తూ దాన్ని అపహాస్యం చేశారని అమిత్ షా దుయ్యబట్టారు. మోదీ నాయకత్వంలోని బీజేపీ సర్కార్ మత ఆధారిత రిజర్వేషన్లను ఎప్పటికీ అనుమతించదని పేర్కొన్నారు.
“రాహుల్ గాంధీ ఓ ఎన్నికల ర్యాలీలో రెండు రోజుల క్రితం రాజ్యాంగం కాపీని చూపించారు. అది నకిలీది. అందులో ఎలాంటి కంటెంట్ లేదు. కాపీ కవర్‌పై మాత్రమే భారత రాజ్యాంగం అని రాసి ఉంది. రాహుల్ రాజ్యాంగాన్ని అపహాస్యం చేశారు. నకిలీ రాజ్యాంగ ప్రతి చూపి రాహుల్ బీఆర్ అంబేద్కర్, రాజ్యాంగ పరిషత్‌ను అవమానించారు” అంటూ మండిపడ్డారు.
మోదీ సర్కార్ రాజ్యాంగాన్ని గౌరవిస్తూ ఏటా నవంబర్ 26వ తేదీని రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకుంటోందని గుర్తు చేశారు. జమ్ముకశ్మీర్ ఎప్పటికీ భారత్‌లో అంతర్భాగమే అని స్పష్టం చేస్తూ గాంధీల నాలుగో తరం వచ్చి అడిగినా ఆర్టికల్ 370ని పునరుద్ధరించే అవకాశం లేదని అమిత్ షా తేల్చి చెప్పారు.
ఓబీసీలు, గిరిజనులు, దళితుల నుంచి రిజర్వేషన్లు లాక్కొని, మైనారిటీలకు ఇవ్వాలని కాంగ్రెస్ యోచిస్తోందని అమిత్ షా ఆరోపించారు. ఓబీసీ కోటాకు వ్యతిరేకంగా కాంగ్రెస్ మహారాష్ట్రలోని కొన్ని వర్గాలకు 10శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చిందని, అయితే మత ప్రాతిపదికన రిజర్వేషన్లకు మోదీ నాయకత్వంలోని బీజేపీ వ్యతిరేకమని తెలిపారు.
ఝార్ఖండ్ ముక్తి మోర్చా(జేఎంఎం) సంకీర్ణ ప్రభుత్వం దేశంలోనే అత్యంత అవినీతిమయ సర్కారుగా మారిందని ఆయన దుయ్యబట్టారు. రాష్ట్రంలో పెరుగుతున్న అక్రమ చొరబాటుదారుల గురించి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అది తమ పొలిటికల్ అజెండా అని సీఎం హేమంత్ సోరెన్ విమర్శిస్తున్నారని ఎద్దేవా చేశారు. సోరెన్ వారిని కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే వాడుకుంటున్నారని విమర్శించారు. అవినీతిపరులను తలకిందులుగా వేలాడదీస్తామని అమిత్ షా హెచ్చరించారు.
More Stories
వక్ఫ్ జెపిసి భేటీలో ఒవైసీతో సహా 10 మంది ఎంపీల సస్పెన్షన్
భారతదేశం శక్తివంతంగా ఉండటం అంటే విధ్వంసకారిగా కాదు
మహాకుంభమేళాలో ‘సనాతన బోర్డు’ ముసాయిదా