రాజధాని అమరావతిలో 500 పడకల ఈఎస్ఐ సెకండరీ కేర్ ఆసుపత్రితోపాటు 150 పడకల సూపర్ స్పెషాలిటీ పడకలతో మెడికల్ కాలేజీ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా అనుమతి తెలిపింది. ఆంధ్రప్రదేశ్ విభజన సమయంల ఈఎస్ఐ సూపర్స్పెషాలిటీ ఆసుపత్రి విభజన అనంతరం తెలంగాణకు వెళ్లిపోయింది. ఏపీలో ఆ స్థాయిలో ఆస్పత్రి లేకపోవడంతో అమరావతిలో కొత్తది ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
హైదరాబాద్లో నిర్మించినట్లే అమరావతిలోనూ ఈఎస్ఐ ఆస్పత్రి ఏర్పాటుకు అంగీకారం తెలిపింది. ఈఎస్ఐ కార్పొరేషన్ అమరావతిలో ఆస్పత్రి, మెడికల్ కాలేజీ ఏర్పాటుకు సంబంధించి నివేదికను సమర్పించేందుకు ప్రత్యేకంగా కమిటీని ఏర్పాటు చేసింది. అయితే ఎంసీఐ నిబంధనల ప్రకారం మెడికల్ కాలేజీ ఏర్పాటుకు 25 ఎకరాలు, ఈఎస్ఐసీ నిబంధనల ప్రకారం 500 పడకల ఆసుపత్రి నిర్మాణానికి 10 ఎకరాలు ఉండాలి.
ఈ మేరకు ఆ భూముల్ని ఏపీ ప్రభుత్వం కేటాయించనుంది. ఒకవేళ ఈ ఆస్పత్రి నిర్మాణం, నిర్వహణను ఈఎస్ఐ కార్పొరేషన్కే అప్పగిస్తే రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి వ్యయం చేయాల్సిన అవసరం ఉండదు. ఒకవేళ రాష్ట్రమే ఈ ఆస్పత్రిని నిర్వహించాలనుకుంటే మాత్రం ఒప్పందం వ్యయంలో 1/8 వంతు భరించాల్సి ఉంటుందని చెబుతున్నారు.
అమరావతిలో అభివృద్ధి పనులు వేగవంతం అయ్యాయి. రాజధానిని ఇప్పటికే నేషనల్ హైవేలు, రైలు మార్గాలు వస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఐటీ కంపెనీలు, హోటళ్లు, విద్యా సంస్థలు, పరిశ్రమలు వస్తున్నాయి. ఇలా రాజధానిలో వచ్చే ఆయా సంస్థల్లో ఉపాధి పొందే ఉద్యోగులు ఈఎస్ఐ పరిధిలోకి వస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 14,55,987 మంది ఈఎస్ఐ ఉద్యోగులు ఉంటే విజయవాడ, గుంటూరు నగరాల పరిధిలో 4 లక్షలకుపైగా ఉన్నారు.
ఈ ఉద్యోగుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. అందుకే వీరిని దృష్టిలో ఉంచుకొని ఈ ఆస్పత్రిని అమరావతిలో ఏర్పాటు చేస్తున్నారు. అంతేకాదు రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో ఆస్పత్రులకు సంబంధించిన పనుల్ని వేగవంతం చేశారు.

More Stories
ఏపీలో కొత్తగా మార్కాపురం, మదనపల్లె, పోలవరం జిల్లాలు
1500 ఏళ్ల భావన్నారాయణ స్వామి రథం వేలం
28న అమరావతిలో 12 బ్యాంకుల భవనాలకు శంకుస్థాపన