తెలంగాణాలో డోనాల్డ్ ట్రంప్ గుడి

తెలంగాణాలో డోనాల్డ్ ట్రంప్ గుడి
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్‌కు తెలంగాణలో డైహార్ట్ ఫ్యాన్స్ ఉన్నారు. ఆయన కోసం ఏకంగా గుడి కట్టారు. ట్రంప్‌ను కలవాలని ప్రయత్నించారు. కానీ ఆ ఆశ తీరకుండానే ట్రంప్ అభిమాని చనిపోయారు.

జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం కొన్నె గ్రామానికి చెందిన బుస్స రాములు, సావిత్రి దంపతుల కుమారుడు కృష్ణ డొనాల్డ్ ట్రంప్‌కు వీరాభిమాని. ఆయనపై అభిమానంతో 2020లో  ట్రంప్ కోసం గుడి కట్టి విగ్రహం నెలకొల్పాడు. ఉపవాస దీక్షలు చేశాడు. ట్రంప్‌ రెండోసారి ఎన్నికల్లో ఓడిపోవడంతో మనోవేదనకు గురైన కృష్ణ 2020 అక్టోబరు 11న మృతి చెందాడు.

2019లో `మీరంటే ఇష్టం.. మిమ్మల్ని కలవాలని ఉంది…’అని కృష్ణ ఎక్స్‌లో పోస్ట్‌ పెట్టాడు. ఆ పోస్టుకు డొనాల్డ్ ట్రంప్ స్పందించి ఓకే చెప్పారు. తన మెసేజ్‌కు రిప్లై ఇవ్వడంతో కృష్ణ ఆనందానికి అవధులు లేవు. కృష్ణ.. తన ఇంటి నిండా అమెరికా అధ్యక్షుడి పోస్టర్లు, స్టిక్కర్లు అతికించి, గోడలపై ట్రంప్‌ను కీర్తిస్తూ గ్రాఫిటీ రాశారు. అతను ట్రంప్ పేరు ఉన్న టీ షర్టులను ధరించేవాడు.

కృష్ణను కొన్నె గ్రామస్తులు అందరూ ట్రంప్ కృష్ణ అని పిలిచేవారు. చదువు మానేసిన కృష్ణ గ్రామంలోని తనకున్న రెండెకరాల భూమిలో వ్యవసాయం చేసేవారు. అతని తల్లిదండ్రులు కొన్నేళ్ల కిందట్ తూప్రాన్‌కు వెళ్లారు. వారి వద్దకు వెళ్లిన కృష్ణ గుండెపోటుతో మరణించాడు. టీ తాగుతుండగా కృష్ణ కుప్పకూలిపోయాడు. అతడిని తూప్రాన్‌లోని స్థానిక ఆసుపత్రికి తరలించగా, అక్కడికి చేరుకునేలోపే చనిపోయినట్లు  వైద్యులు ప్రకటించారు.

కృష్ణ భార్య కూడా అంతకుముందు మగబిడ్డను ప్రసవిస్తూ మరణించింది. తాజాగా ట్రంప్‌ రెండోసారి గెలవడంతో కృష్ణ బతికి ఉంటే ఎంతో సంతోషించేవాడని గ్రామస్థులు చెబుతున్నారు. బుధవారం కృష్ణ మిత్రులు ట్రంప్‌ విగ్రహం వద్ద పూలమాల వేసి సంబరాలు నిర్వహించారు.