
లోకాయుక్త పోలీసులు సమన్లు పంపడంపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పందించారు. ”నిజమే. ముడా కేసుకు సంబంధించి మైసూరు లోకాయుక్త పోలీసులు నోటీసులు పంపారు. నవంబర్ 6న మైసూర్ లోకాయుక్త ముందు హాజరవుతా” అని చెప్పారు.
ముడా కేసు విచారణలో భాగంగా సిద్ధరామయ్య భార్య పార్వతిని గత అక్టోబర్ 25న లోకాయుక్త పోలీసులు ప్రశ్నించారు. ఆమె సోదరుడు మల్లికార్జున స్వామి, దేవరాజు స్వామి కొంత భూమి కొనుగోలు చేసి ఆమెకు బహుమతిగా ఇచ్చారు. ఈ భూమి వివాదంలో ఉండటంతో లోకాయుక్త పోలీసులు సెప్టెంబర్ 27న ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
2021లో ముడా అభివృద్ధి కోసం మైసూరులోని కేసరే గ్రామంలో సీఎం సిద్ధరామయ్య భార్య పార్వతి నుంచి 3 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకుంది. ప్రతిఫలంగా ఆమెకు దక్షిణ మైసూర్‌లోని విజయనగర్‌లో భూమిని కేటాయించారు. విజయనగరంలో భూమి ధర కేసరెలో భూమి కంటే చాలా ఎక్కువని, ముడా ద్వారా ఈ భూముల కేటాయింపుల్లో అక్రమాలు జరిగాయని ఆర్టీఐ కార్యకర్త ఇబ్రహీం ఫిర్యాదు చేశారు.
ఈ క్రమంలో సీఎంపై వచ్చిన ఆరోపణలపై విచారణకు గవర్నర్ ఇటీవల ఆదేశించగా, దీనిని హైకోర్టులో సిద్ధరామయ్య సవాలు చేసినప్పటికీ ఊరట దక్కలేదు. తొలుత ఎలాంటి అవకతవకలు జరగలేదని చెప్పిన సిద్ధరామయ్య ఆ తర్వాత తన భార్యకు కేటాయించిన ప్లాట్లను ముడాకు తిరిగి అప్పగించారు. అయినప్పటికీ చిక్కుల నుంచి ఆయన బయట పడలేదు. విచారణకు హాజరుకావాలంటూ లోకాయుక్త పోలీసులు సీఎంకు తాజాగా నోటీసులు పంపడంతో మరింత ఉత్కంఠ నెలకొంది.
More Stories
అమెరికా సుంకాలతో ప్రపంచ మార్కెట్లు కోల్పోకుండా వ్యూహం!
బెట్టింగ్ యాప్ ప్రమోషన్.. ఊర్వశి, మిమి చక్రవర్తిలకు నోటీసులు
ప్రజల రోజువారీ జీవితంలో స్పష్టంగా జీఎస్టీ ప్రభావం