
* ఉచితాలపై కర్ణాటక కాంగ్రెస్ ఎమ్యెల్యే హెచ్చరిక
అధికారం చేపట్టిన రెండేండ్లలోనే కాంగ్రెస్ పార్టీ హిమాచల్ ప్రదేశ్ రాష్ర్టాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టేసింది. 10 గ్యారెంటీల పేరుతో అలవికాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన ఆ పార్టీ ఇప్పుడు దివాలా దిశగా రాష్ర్టాన్ని నడిపిస్తున్నది. ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు సైతం సరిగ్గా ఇవ్వలేని స్థితికి ప్రభుత్వం చేరుకున్నది. దీంతో సీఎం సుఖ్విందర్ సింగ్ సుఖు పాలనపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సొంత పార్టీ ఎమ్మెల్యేలు సైతం ఆయన పాలనపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ఎన్నికల ముందు పాత పింఛన్ విధానాన్ని తిరిగి తీసుకొస్తామని, ఉచిత విద్యుత్తు, మహిళలకు నెలకు రూ.1,500 ఇస్తామనే అనేక హామీలను కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. అయితే, ఈ హామీల్లో చాలావరకు అమలుకు నోచుకోలేదు. అరకొరగా అమలు చేస్తున్న గ్యారెంటీలతో రాష్ట్రంపై ఆర్థిక భారం పడుతున్నది. దీంతో కొన్ని నెలలుగా వేతనాలు, పింఛన్లను ప్రభుత్వం సమయానికి ఇవ్వడం లేదు.
రెండేండ్లుగా ఖాళీగా ఉన్న పోస్టులను పూర్తిగా తొలగించాలని ఇటీవల నిర్ణయం తీసుకొని, పెద్ద ఎత్తున వ్యతిరేకత రావడంతో వెనక్కు తగ్గింది. ఇదేవిధంగా టాయిలెట్ ట్యాక్స్ విధించాలని నిర్ణయం తీసుకొని, విమర్శలు రావడంతో విరమించుకుంది. గత ప్రభుత్వంలో ఉన్న పలు పథకాలను తొలగించడంతో పాటు కొత్తగా గ్రామీణ ప్రాంతాల్లో నీటి బిల్లులను అమలులోకి తేవడం పట్ల ప్రజలు అసంతృప్తితో ఉన్నారు. ‘అధికారంలోకి వచ్చిన మొదట్లో గత ప్రభుత్వాన్ని సాకుగా చూపిస్తే చెల్లింది. ఈ రెండేండ్లలో ప్రజలు విసిగిపోయారు’ అని కాంగ్రా జిల్లాకు చెందిన ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే వ్యాఖ్యానించడం దీనికి అద్దం పడుతున్నది.
మరోవంక, మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని సమీక్షిస్తామని ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ చేసిన వ్యాఖ్యలకు కర్ణాటక కాంగ్రెస్ పార్టీ సీనియర్ ఎమ్మెల్యే ఆర్వీ దేశ్‌పాండే మద్దతు తెలిపారు. ‘డీకే శివకుమార్ మంచి ఉద్దేశంతోనే చెప్పారు. గ్యారెంటీ పథకాల కోసం ఏటా రూ.65 వేల కోట్లు అవసరం. కొన్ని మంచి పథకాలు ఉన్నాయి. అయితే, కొన్ని ప్రాంతాల్లో ఈ పథకాలను దుర్వినియోగం చేస్తున్నారు’ అంటూ చెప్పుకొచ్చారు.
`ఉదాహరణకు శక్తి పథకం వల్ల కొందరు మహిళలు పదేపదే వెళ్లిన ప్రాంతాలకే మళ్లీ ప్రయాణిస్తున్నారు. ఉచితంగా ఇవ్వడం ఎంత మంచిదో అంత ప్రమాదకరం. మనకు పారదర్శకత ఉండాలి. అర్హులైన మేరకే ప్రమోజనాలు అందాలి. ఈ దిశగా ఆదేశాలు తప్పు కాదు.’ అంటూ వ్యాఖ్యానించారు. కాగా, డీకే శివకుమార్ వ్యాఖ్యలను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వ్యతిరేకించినప్పటికీ దేశ్‌పాండే ఈ వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది.
More Stories
చిప్స్ ఐనా, ఓడలైనా స్వావలంబన తప్ప మార్గం లేదు
టీ20లో వేగంగా 100 వికెట్ల తీసిన బౌలర్గా అర్షదీప్
సామ్ పిట్రోడా పాకిస్థాన్ వ్యాఖ్యలపై రాజకీయ చిచ్చు