అమిత్‌ షాపై కెనడా ఆరోపణలపై భారత్ అసంతృప్తి

అమిత్‌ షాపై కెనడా ఆరోపణలపై భారత్ అసంతృప్తి

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షాపై కెనడా మంత్రి చేసిన వ్యాఖ్యలపై భారత్‌ అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ వ్యాఖ్యలపై కెనడా హైకమిషన్‌ ప్రతినిధిని పిలిపించామని విదేశాంగ మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి రణధీర్‌ జైస్వాల్‌ తెలిపారు. కమిటీ ముందు హోంశాఖ మంత్రి షా గురించి కెనడా మంత్రి డేవిడ్‌ మారిసన్‌ చేసిన నిరాధారమైన ఆరోపణలను భారత ప్రభుత్వం తీవ్రంగా నిరసిస్తోందని చెప్పారు.

భారత్‌ను అప్రతిష్టపాలు చేసేందుకు, ఇతర దేశాలను ప్రభావితం చేసే వ్యూహంలో భాగంగా కెనడా ఉన్నతాధికారులు ఉద్దేశపూర్వకంగానే అంతర్జాతీయ మీడియాకు లీక్ ఇస్తున్నారంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యతారహిత చర్యలు ద్వైపాక్షిక సంబంధాలపై తీవ్ర పరిణామాలను కలిగిస్తాయని హెచ్చరించారు. ఇటీవల కెనడా ఖలిస్తానీ ఉగ్రవాది హత్యకుట్రలో భారత కేంద్ర మంత్రి అమిత్ షా పేరును ప్రస్తావించింది.

ఆ దేశ విదేశాంగ వ్యవహారాల డిప్యూటీ మినిస్టర్ డేవిడ్ మారిసన్ లీకుల ఆధారంగా ది వాషింగ్టన్ పోస్ట్ పత్రిక కథనం ప్రచురించింది. లీకులను తాను చేసినట్లుగా మారిసన్‌ అంగీకరించారు.  ఈ కుట్ర వెనుక అమిత్ షా హస్తమున్నదని తానే వాషింగ్టన్‌ పోస్టుకు చెప్పానని కెనడా పార్లమెంటరీ ప్యానెల్ ఎదుట డేవిడ్ మారిసన్ అంగీకరించారు. ఆ పత్రిక జర్నలిస్టు తనకు కాల్ చేసి ఆ కుట్ర వెనుక ఉన్నది ఆయనే (అమిత్ షా) నా? అని అడిగారన, ఔనని చెప్పినట్లు వివరించారు.

భారత అధికారులు, అమిత్ షా ప్రమేయం ఉన్నదని కెనడా అధికారులు చెప్పారంటూ ఇటీవల వాషింగ్టన్ పోస్ట్ పత్రిక ఇటీవల ఓ కథనం ప్రచురించింది. అయితే, కెనడా అధికారులు మాత్రం ఇందుకు ఆధారాలు చూపడంలో విఫలమయ్యారు. ఈ వ్యవహారంపై భారత్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.