ఈ దీపావళికి చైనాకు రూ.1.25 లక్షల కోట్ల నష్టం

ఈ దీపావళికి చైనాకు రూ.1.25 లక్షల కోట్ల నష్టం

భారత్ మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా చైనా వస్తువుల వినియోగం గత కొన్నేళ్లుగా అధికం అవుతోంది. అయితే గత కొన్నేళ్లుగా విదేశీ వస్తువులు, మరీ ముఖ్యంగా చైనా వస్తువులను వినియోగించకుండా దేశీయంగా తయారైన స్వదేశీ వస్తువులను ఉపయోగించాలంటూ `వోకల్ ఫర్ లోకల్’ ప్రచారం జరుగుతోంది. మరీ ముఖ్యంగా 2014లో ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ బాధ్యతలు తీసుకున్న తర్వాత ఈ స్వదేశీ వస్తువులను వినియోగించాలనే ప్రచారం ముమ్మరం అయింది.

అందుకు తగ్గట్టే మేడిన్ ఇండియా వస్తువులు భారీగా మార్కెట్లలోకి వచ్చాయి. దీంతో క్రమ క్రమంగా జనాలు స్వదేశీ వస్తువుల వినియోగించడం పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా దంతేరాస్,  దీపావళి  పండగల సీజన్‌లో చైనాకు భారీగా నష్టం వాటిల్లినట్లు పలు నివేదికలు పేర్కొంటున్నాయి. ఈ క్రమంలోనే చైనా వస్తువుల విక్రయాలు తగ్గడంతో ఆ దేశానికి దాదాపు రూ.1.25 లక్షల కోట్ల నష్టం వచ్చినట్లు తెలుస్తోంది.

గత కొన్ని సంవత్సరాలుగా దీపావళి, దంతేరాస్‌ పండగల వేళ భారతీయ మార్కెట్లలో చైనా ఉత్పత్తులకు డిమాండ్ భారీగా తగ్గుతోంది. మరీముఖ్యంగా డెకరేషన్ వస్తువులు, ఇతర విక్రయాలు గతంతో పోలిస్తే ఈ ఏడాది గణనీయంగా తగ్గాయి. చైనా వస్తువులకు డిమాండ్ తక్కువ కావడంతో ఆ దేశం నుంచి దిగుమతులు కూడా భారీగా తగ్గుతున్నాయి.
అదే సమయంలో దేశీయంగా తయారైన వస్తువుల అమ్మకాలు భారీగా పెరుగుతున్నాయి.

దీంతో ప్రధాని నరేంద్ర మోదీ చేపట్టిన వోకల్ ఫర్ లోకల్ ప్రచారానికి సంబంధించిన ప్రభావం ఇప్పుడు దేశంలో కనిపిస్తోందని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఈ ఏడాది దీపావళి పండగ సందర్భంగా మేడ్ ఇన్ ఇండియా చూసిన తర్వాతే ఎలక్ట్రానిక్స్, డెకరేషన్ వస్తువులను ప్రజలు కొనుగోలు చేస్తున్నట్లు చెబుతున్నారు. దీపావళి, దంతేరాస్ పండగలకు చైనా ఉత్పత్తుల అమ్మకాలు భారీగా క్షీణించడంతో దాదాపు రూ.1. 25 లక్షల కోట్ల మేర నష్టాన్ని డ్రాగన్ కంట్రీ చవిచూస్తోందని తెలుస్తోంది.

గతంలో చైనా వస్తువులకు భారత మార్కెట్లో భారీగా డిమాండ్ ఉండేదన, కానీ ప్రస్తుతం వాటిని కొనేవారు చాలా వరకు తగ్గిపోయినట్లు అర్థం అవుతోంది.  మట్టి దీపాలను కుమ్మరుల నుంచి కొనుగోలు చేస్తున్న ప్రజలు డెకరేషన్ వస్తువులు కూడా దేశీయంగా చేతివృత్తులు వారు తయారు చేసినవే కొంటున్నారు. దీపావళి వస్తువులు కొనుగోలు చేసేవారు తమ ప్రాంతంలోని మహిళలు, కుమ్మరులు, చేతివృత్తులు, ఇతరులు తయారు చేసినవి కొనుగోలు చేసి పండగల వేళ వారికి సహాయం చేయాలని దేశవ్యాప్తంగా వ్యాపార సంస్థలను కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ – సీఏఐటీ కోరింది.

దీంతో ప్రజల్లో కూడా అవగాహన పెరిగి ఇప్పుడు దేశీయ ఉత్పత్తులకే ప్రాధాన్యం ఇస్తున్నారు. దీనివల్ల ఇతర దేశాల దిగుమతులు తగ్గడమే కాకుండా ఇక్కడ ఉండే వారికి కూడా పండగ వేళ పని దొరుకుతోంది.  కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ ప్రకారం ఈ ఏడాది దంతేరాస్ పండగ వేళ దాదాపు రూ.60 వేల కోట్ల వ్యాపారం జరుగుతుందని అంచనా వేసింది.

దీపావళి పూర్తయ్యే నాటికి ఈ సంఖ్య రూ.లక్ష కోట్లు దాటుతుందని అంచనా. ఈ పండగ సీజన్‌లో బంగారం, వెండితో పాటు ఇత్తడితో చేసిన పాత్రలను జనం భారీగా కొనుగోలు చేస్తూ ఉంటారు. ఈసారి దాదాపు రూ.2500 కోట్ల విలువైన వెండిని కొనుగోలు చేయగా, ఒక్కరోజులోనే రూ.20 వేల కోట్ల విలువైన బంగారం అమ్ముడుపోయింది.