మహారాష్ట్ర  ఎన్నికల్లో గ్యారంటీలకు కాంగ్రెస్ దూరం

మహారాష్ట్ర  ఎన్నికల్లో గ్యారంటీలకు కాంగ్రెస్ దూరం
కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్, తెలంగాణాలలో ఎన్నికల ముందు గ్యారంటీలు అంటూ అలవికాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక వాటిని అమలు చేయలేక తీవ్ర ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటుండడంతో కాంగ్రెస్ పార్టీ మహారాష్ట్ర ఎన్నికలలో జాగ్రత్త పడుతున్నట్లు కనిపిస్తున్నది. పైగా, ఇటీవల జరిగిన హర్యానా ఎన్నికలలో ఈ గ్యారంటీల మంత్రం ఆ పార్టీకి పనిచేయలేదు.
మహారాష్ట్ర  అసెంబ్లీ ఎన్నికల్లో ఆరు, ఏడు అంటూ ఎలాంటి గ్యారంటీలూ ప్రకటించడం లేదని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పష్టం చేశారు. పైగా, బడ్జెట్‌ ఆధారంగా హామీలు ప్రకటించాలని, లేదంటే రాష్ట్రం దివాలా పరిస్థితికి చేరుతుందని అంటూ ఆయన పార్టీ నేతలను హెచ్చరించారు.
విలేకరులతో ఖర్గే మాట్లాడుతూ ‘త్వరలో జరగబోయే మహారాష్ట్ర ఎన్నికల్లో 5, 6, 10, 20 ఇలా ఏ ఒక్క హామీలను ప్రకటించడం లేదు. బడ్జెట్‌ ఆధారంగా హామీలు ప్రకటించాలి. లేదంటే రాష్ట్రం దివాలా పరిస్థితికి చేరుతుంది. ప్రణాళికా రహిత విధానం ఆర్థిక ఇబ్బందులకు దారి తీస్తుంది. ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే భవిష్యత్తు తరాలపై ప్రతికూల ప్రభావం పడుతుంది’ అంటూ తేల్చి చెప్పారు.

రోడ్లు వేసేందుకు కూడా డబ్బు లేకపోతే ప్రభుత్వంపై ప్రజలు తిరగబడతారని అంటూ ఆయన ఇతర రాష్ట్రాలలోని అనుభవాలను పరోక్షంగా ప్రస్తావిస్తూ చెప్పారు. ప్రభుత్వం విఫలమైతే భవిష్యత్తు తరానికి చెడ్డపేరు తప్ప మరొకటి మిగలదు అంటూ ఎన్నికల హామీలపై ఖర్గే ఒకింత అసహనం వ్యక్తం చేశారు.  ఎన్నికల సమయంలో ప్రజలు ఆకట్టుకునేందుకు కాంగ్రెస్‌ పార్టీ ప్రజలకు పలు హామీలను ఇస్తున్న విషయం తెలిసిందే. కర్ణాటకలో ఐదు గ్యాంరటీలతో, తెలంగాణలో ఆరు గ్యారంటీలతో అధికారంలోకి వచ్చింది. అయితే, గ్యారెంటీల పేరుతో ఆకర్షించి ఓట్లు వేయించుకున్న ఆ పార్టీ ఇప్పుడు ఉచిత పథకాలను అమలు చేయలేక చేతులెత్తేస్తున్నది.

కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన నెల రోజులకే ఆడంబరంగా ప్రారంభించిన ఉచిత బస్సు పథకానికి ఏడాదిన్నరకే మంగళం పాడేందుకు సిద్ధమైంది. ఈ పథకాన్ని నిలిపేసేందుకు ఇప్పటికే కసరత్తు మొదలు పెట్టినట్లు సమాచారం. తెలంగాణలో సైతం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో హస్తం పార్టీ విఫలమవుతోందని విపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. ఈ పరిణామాల దృష్ట్యా రాబోయే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఈ హామీలపై కాంగ్రెస్‌ పార్టీ వెనకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది.