సీఎం చంద్రబాబును కలిసిన బాబా రామ్‌దేవ్

సీఎం చంద్రబాబును కలిసిన బాబా రామ్‌దేవ్

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ప్రముఖ యోగా గురువు రామ్‌దేవ్ బాబా కలిశారు. అమరావతిలోని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో చంద్రబాబును కలిసిన రామ్‌దేవ్ బాబా పలు విషయాలపై చర్చించారు. ఈ విషయాన్ని స్వయంగా సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయం, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్, విద్యా రంగాల్లో పెట్టుబడులకు సంబంధించి చంద్రబాబు, రామ్‌దేవ్ బాబా మధ్య చర్చ జరిగింది.

రాష్ట్రవ్యాప్తంగా వెల్‌నెస్ సెంటర్ల ఏర్పాటుతోపాటు వ్యవసాయం, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్, విద్యా రంగాల్లో పెట్టుబడులపై చర్చించినట్లు చంద్రబాబు వెల్లడించారు. అయితే గతంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉన్న సమయంలో 2018లో కూడా రామ్‌దేవ్ బాబా స‌చివాల‌యంలో భేటీ అయ్యారు. విజయనగరం జిల్లా చిన్నరావుపల్లిలో పతంజలి సంస్థ ఏర్పాటు చేసే మెగా ఫుడ్‌ పార్క్‌పై ముఖ్యమంత్రితో రామ్‌దేవ్ బాబా చర్చించారు.

ఆ మెగాఫుడ్‌ పార్క్‌ గురించి రామ్‌దేవ్‌ బాబా చంద్రబాబుకు అప్పట్లో వివరించారు. రూ.634 కోట్ల వ్యయంతో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్‌తో పాటు అనుబంధ యూనిట్లు ఏర్పాటు చేస్తామని చంద్రబాబుకు రామ్‌దేవ్ బాబా వెల్లడించారు. ఈ పార్క్‌తో 33400 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు వస్తాయని పేర్కొన్నారు. దీంతో ఈ మెగాఫుడ్‌ పార్క్‌కు 172.84 ఎకరాల భూమిని అప్పటి టీడీపీ ప్రభుత్వం కేటాయించింది.