అణు విన్యాసాలను ప్రారంభించిన రష్యా

అణు విన్యాసాలను ప్రారంభించిన రష్యా
* మూడో ప్రపంచ యుద్ధం తప్పదా?
ఉక్రెయిన్‌-రష్యా యుద్ధం కొనసాగుతున్న వేళ మాస్కో భీకర అణు విన్యాసాలను ప్రారంభించింది. ఉపరితల, సముద్ర, గగనతల అణుదాడుల్ని తిప్పికొట్టేలా అణుబలగాల సన్నద్ధత పరీక్ష నిర్వహించింది. లాంచ్‌ ప్యాడ్స్‌, సబ్‌మెరైన్స్, బాంబర్ల నుంచి ఖండాంతర బాలిస్టిక్‌ క్షిపణులను విజయవంతంగా పరీక్షించింది. మాస్కో పరీక్షించిన అణు క్షిపణులకు అమెరికా భూభాగంలోని ప్రతీమూలకూ వెళ్లే సామర్థ్యం ఉంది.
అమెరికా, నాటోను దృష్టిలో పెట్టుకునే రష్యా అధ్యక్షుడు పుతిన్‌ అణు విన్యాసాలను నిర్వహించినట్లు సమాచారం.  రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధం అత్యంత క్లిష్ట దశలో ఉన్న వేళ మాస్కో భారీ అణు బలగాల సన్నద్ధత విన్యాసాలను ప్రారంభించింది. కీవ్‌పై యుద్ధంలో పశ్చిమ దేశాలతో ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ ఆదేశాలతో అణు విన్యాసాలు ప్రారంభించినట్లు క్రెమ్లిన్‌ ప్రకటించింది.
శత్రువు అణుదాడి చేస్తే సమర్థంగా ప్రతిస్పందించడంలో బలగాల సన్నద్ధతను పరీక్షించడమే ఈ విన్యాసాల ఉద్దేశమని రష్యా రక్షణమంత్రి ఆండ్రీ బెలౌసోవ్‌ తెలిపారు. డ్రిల్స్‌లో భాగంగా ప్లెసెట్స్‌ లాంఛ్‌ ప్యాడ్‌ నుంచి ఖమ్‌చట్కా ద్వీపకల్పంపై యార్స్‌ ఖండాంతర బాలిస్టిక్‌ క్షిపణులను మాస్కో ప్రయోగించింది.
సముద్రం నుంచి గగనతల దాడుల్ని తిప్పికొట్టేలా బారెంట్స్‌, ఓఖోత్స్‌ సముద్రాల్లోని అణు జలాంతర్గాముల నుంచి ఖండాంతర బాలిస్టిక్‌ క్షిపణులను పరీక్షించింది. టియు-95అణు బాంబర్లలోని దీర్ఘశ్రేణి క్రూయిజ్‌ మిస్సైల్స్‌ విజయవంతంగా లక్ష్యాలను ఛేదించాయి. భూ, సముద్ర, గగనతలాల గుండా రష్యా పరీక్షించిన అన్ని అణు సామర్థ్య క్షిపణులు. అమెరికా భూభాగంలోని ప్రతీమూలనూ తాకగల సత్తా కలిగి ఉండటం గమనార్హం.

అమెరికా, పశ్చిమ దేశాలు ఉక్రెయిన్‌కు ఇచ్చే లాంగ్‌రేంజ్‌ మిస్సైల్స్‌ తమ భూభాగంపైకి ప్రయోగిస్తే అది నాటో తమతో నేరుగా యుద్ధాన్ని ప్రకటించినట్లే అని రష్యా అధ్యక్షడు పుతిన్‌ ఇప్పటికే హెచ్చరికలు చేశారు. ఏదైనా అణ్వాయుధ దేశ మద్దతుతో అణురహిత దేశం తమపై చేసే దాడినీ సంయుక్త దాడిగానే చూస్తామన్న హెచ్చరికను తాజా అణు విన్యాసాలతో పుతిన్‌ బలపర్చారు. తమపై ఏదైనా భారీ వైమానిక దాడి జరిగినా అణ్వాయుధ పోరుకు తలుపు తెరిచినట్లేనని స్పష్టం చేశారు.

రష్యా చేపట్టిన విన్యాసాల నేపథ్యంలో అణు యుద్ధం తప్పదా? అన్న ఆందోళనలు రేకెత్తుతున్నాయి. ప్రపంచంలోని మొత్తం అణ్వాయుధాల్లో 88 శాతం కేవలం రష్యా, అమెరికా అమ్ముల పొదిలలో పోగుపడి ఉన్నాయి. ఉక్రెయిన్‌పై యుద్ధం వేళ నాటో, రష్యాపై దాడి చేస్తే అది మూడో ప్రపంచ యుద్ధంగా మారుతుందన్న భయాలు వ్యక్తమవుతున్నాయి.

ప్రపంచానికి అణు యుద్ధం ముప్పు పొంచి ఉందని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కూడా ఇటీవల వ్యాఖ్యానించారు. మరోవైపు ఉక్రెయిన్‌తో యుద్ధంలో 12వేల మంది ఉత్తరకొరియా సైనికులను రష్యా మోహరిస్తోందని అమెరికా నిఘా వర్గాలు గుర్తించాయి. ఉత్తరకొరియా యుద్ధంలో పాల్గొంటే ఉక్రెయిన్‌ లాంగ్‌రేంజ్‌ మిస్సైల్స్‌ ప్రయోగించ వద్దన్న ఆంక్షలను తాము ఉపసంహరిస్తామని అమెరికా హెచ్చరించింది.