
దేశ వ్యాప్తంగా వివిధ కేంద్ర ప్రభుత్వ శాఖల్లోని మొత్తం 12 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి చెప్పారు. ఉపాధి కల్పనకు, ఆర్థిక వృద్ధికి ఊతమిచ్చేందుకు విద్య, వైద్యం, రక్షణ, పరిశోధన వంటి కీలక రంగాల్లో పెట్టుబడులను భారత ప్రభుత్వం పెద్దఎత్తున ఆహ్వానిస్తోందని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ శాఖల్లోని ఒక్క ప్రభుత్వ ఉద్యోగాన్ని కూడా ఖాళీగా ఉంచకుండా భర్తీ చేయాలనేదే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లక్ష్యమని తెలిపారు.
రోజ్ గార్ మేళా ద్వారా ఇప్పటి వరకు 8.50 లక్షల ఉద్యోగాలను భర్తీ చేశామని ఆయన వెల్లడించారు. మంగళవా బషీర్‌బాగ్‌లోని భారతీయ విద్యా భవన్‌లో తెలంగాణ తపాలా శాఖ ఆధ్వర్యంలో జరిగిన రోజ్‌గార్ మేళా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి హాజరయ్యారు. ఈ మేళాలో భారత ఆహార సంస్థ, సీబీఐటీ, ఆదాయపు పన్ను శాఖ, తపాలా శాఖ, హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం, మౌలానా ఆజాద్ జాతీయ ఉర్దూ విశ్వవిద్యాలయం, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, ఎయిమ్స్, రైల్వే తదితర శాఖలలో ఉద్యోగాలకు ఎంపికైన 154 మందికి కేంద్ర మంత్రి నియామక పత్రాలను అందజేశారు.
ఈ సందర్భంగా కిషన్ రెడ్డిమాట్లాడుతూ దేశ వ్యాప్తంగా ఒక్కరోజే 51 వేల మంది కేంద్ర ఉద్యోగాలు పొందుతున్నారని ప్రకటించారు. వచ్చిన ఉద్యోగం ఏదైనా దృష్టి పెట్టి, ఆత్మవిశ్వాసంతో యువత పని చేయాలని సూచించారు. ప్రపంచాన్ని శాసించే దిశగా ప్రధాని మోదీ అడుగులు వేస్తున్నారని, ప్రపంచం భారత్ వైపు చూస్తోందని, వికసిత భారత్ లక్ష్యంతో దేశం అభివృద్ధి చెందిన దేశంగా చూడాలన్నదే మోదీ లక్ష్యమని చెప్పారు.
దేశానికి స్వాతంత్య్రం వచ్చి వంద సంవత్సరాలు పూర్తయ్యే 2047 నాటికి వికసిత్ భారత్- అభివృద్ధి చెందిన భారతదేశం లక్ష్యాన్ని సాధించడంలో కీలక పాత్ర పోషిస్తుందని ఆయన తెలిపారు. దేశ అభివృద్ధిలో మహిళల భాగస్వామ్యం కీలకంగా ఉండాలన్నదే మోదీ ప్రధాన ఎజెండా అని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.
More Stories
ఓ ఉగ్రవాది అరెస్టుతో ఉలిక్కిపడ్డ బోధన్
జూబ్లీ హిల్స్ లో బిఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత
కాళేశ్వరం రూ. లక్ష కోట్ల అవినీతిపై సిబిఐ విచారించాలి