లద్దాఖ్‌ నుంచి వెనక్కి వస్తున్న భారత్‌, చైనా బలగాలు

లద్దాఖ్‌ నుంచి వెనక్కి వస్తున్న భారత్‌, చైనా బలగాలు

భారత్‌, చైనా మధ్య వాస్తవాధీన రేఖ వెంబడి గత నాలుగేళ్లుగా కొనసాగుతున్న ఉద్రిక్తతలకు ముగింపు పలికేలా ఇటీవల ఇరు దేశాల మధ్య కీలక ఒప్పందం జరగ్గా, సరిహద్దుల్లో బలగాల ఉపసంహరణ ప్రక్రియ మొదలైంది. తూర్పు లద్దాఖ్‌ సెక్టార్‌లోని రెండు కీలక ప్రాంతాలు అయిన డెమ్చోక్‌, డెస్పాంగ్‌ నుంచి రెండు దేశాల బలగాలు వెనక్కి మరలుతున్నాయి. ఈ మేరకు భారత రక్షణశాఖ అధికారులు శుక్రవారం ఉదయం వెల్లడించారు.

ఒప్పందం ప్రకారం సరిహద్దు ప్రాంతంలోని సైనిక సామగ్రి, ఇతర పరికరాలను భారత బలగాలు వెనక్కి తీసుకొస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఇక్కడి టెంట్లు, తాత్కాలిక నిర్మాణాలను కూడా ఇరు దేశాల బలగాలు తొలగిస్తున్నట్లు వెల్లడించారు. చార్దింగ్‌ లా పాస్‌కు సమీపంలోని నదీకి పశ్చిమ దిశగా భారత బలగాలు, తూర్పు దిశగా చైనా బలగాలు వెనక్కి వెళ్తున్నట్లు తెలిపారు. 

సరిహద్దులకు ఇరు వైపులా దాదాపు 10-12 తాత్కాలిక నిర్మాణాలు, 12 టెంట్లు ఉన్నట్లు తెలుస్తోంది. బలగాల ఉపసంహరణ ప్రక్రియంతా పూర్తయిన తర్వాత మరో 4-5 రోజుల్లో డెస్పాంగ్‌, డెమ్చోక్‌ ప్రాంతాల్లో పెట్రోలింగ్‌ను పునరుద్ధరించనున్నట్లు సమాచారం. 2020 జూన్‌ 15న తూర్పు లద్దాఖ్‌లోని గల్వాన్‌ లోయలో భారత్‌-చైనా సైనికుల మధ్య జరిగిన తీవ్ర ఘర్షణ ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది. 

ఘర్షణలో తెలంగాణకు చెందిన కర్నల్‌ సంతోష్‌ బాబు సహా 20 మంది భారత సైనికులు వీరమరణం పొందారు. చైనా కూడా భారీగా సైనికులను కోల్పోయింది. కానీ ఆ సంఖ్యను వెల్లడించలేదు. చాలా నెలల తర్వాత ఐదుగురు చనిపోయినట్లు అధికారికంగా అంగీకరించింది. ఘర్షణల నేపథ్యంలో ఇరు దేశాలు ఎల్‌ఏసీ వెంబడి భారీ స్థాయిలో బలగాలను మోహరించాయి.

అప్పటి నుంచి రెండు దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆ తర్వాత ప్రతిష్టంభనను తొలగించేందుకు ఇరు దేశాల మధ్య పలుమార్లు దౌత్య, కమాండర్‌ స్థాయి చర్చలు జరిగాయి. వాటి ఫలితంగా ఇప్పటికే కొన్ని ప్రాంతాల నుంచి బలగాలను ఉపసంహరించగా ఘర్షణల కేంద్రమైన డెమ్చోక్‌, డెస్పాంగ్‌ వద్ద మాత్రం బలగాలు కొనసాగుతూ వచ్చాయి. 

ఇటీవల వాస్తవాధీన రేఖ వెంబడి గస్తీ పునఃప్రారంభంపై ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం 2020 గల్వాన్‌ ఘర్షణలకు ముందు నాటి యథాస్థితి ఎల్‌ఏసీ వెంబడి కొనసాగనుంది. ఇరు దేశాల సైనికులు గస్తీ నిర్వహించిన పెట్రోలింగ్‌ పాయింట్లకు స్వేచ్ఛగా వెళ్లొచ్చు. ఇటీవల జరిగిన బ్రిక్స్‌ సదస్సులో ఈ ఒప్పందాన్ని ఇరు దేశాల నేతలు మోదీ, జిన్‌పింగ్‌ ధ్రువీకరించారు.