
దీపావళి నుంచి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం అమలకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన బుధవారం జరిగిన సమావేశంలో లబ్దిదారులు ముందుగా నగదు చెల్లించి సిలిండర్ కొనుగోలు చేస్తే 48 గంటల్లో వారి ఖాతాల్లో నగదు జమ చేసేలా ఈ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించింది.
అలాగే ఒకేసారి 3 ఉచిత సిలెండర్లు తీసుకోకుండా ప్రతి నాలుగు నెలలకు ఒక సిలిండర్ చొప్పున ఇవ్వాలని నిర్ణయించారు. ఉచిత సిలిండర్ల పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వంపై ఏడాదికి రూ.2700 కోట్ల భారం పడుతుందని మంత్రివర్గం తెలిపింది.
కాగా, విశాఖ శారదాపీఠానికి వైసీపీ ప్రభుత్వం అప్పగించిన 15 ఎకరాల భూమిని వెనక్కి తీసుకోవాలనే ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. వైసీపీ హయాంలో శారదా పీఠానికి భీమిలికి సమీపంలో కొత్తవలస గ్రామంలో సముద్ర తీరానికి దగ్గర్లో రూ.కోట్ల విలువ చేసే భూమిని ఎకరం రూ.లక్ష చొప్పున అప్పగించింది. గత ప్రభుత్వంలో జరిగిన ఈ భూ కేటాయింపులపై సమీక్ష నిర్వహించింది. కోట్ల విలువైన భూమిని అక్రమంగా కేటాయించారన్న ఆరోపణలతో శారదాపీఠానికి భూముల కేటాయింపును రద్దు చేయాలని కేబినెట్ నిర్ణయించింది.
ఉచిత ఇసుక విధానంలో సీనరేజి, జీఎస్టీ ఛార్జీల రద్దుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. సీనరేజి ఛార్జీల రద్దుతో రాష్ట్ర ప్రభుత్వంపై రూ.264 కోట్ల మేర భారంపడుతుందని అధికారులు అంచనా వేశారు. ఉచిత ఇసుక విధానాన్ని తీసుకొచ్చిన లక్ష్యం నెరవేర్చేందుకు ఈ నష్టం భరిద్దామని సీఎం చంద్రబాబు సమావేశంలో అన్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు పట్టా భూముల్లో యజమానులు ఎవరి ఇసుక వారు తవ్వుకునేందుకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఉచిత ఇసుక విధానం సరిగ్గా అమలు అయ్యేలా చూడాలని మంత్రులు, జిల్లా ఇన్‌ఛార్జి మంత్రులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఇసుక లేని జిల్లాల్లో డీలర్లను నియమించి ధరల నియంత్రణ చేపట్టాలని చెప్పారు.
దేవాలయాల కమిటీల్లో బ్రాహ్మణులు, నాయీ బ్రాహ్మణులకు చోటు కల్పించి, సభ్యుల సంఖ్య పెంచేందుకు చట్ట సవరణ చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. చెత్తపన్ను రద్దు నిర్ణయానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దేవాలయాల పాలకమండలి సభ్యుల సంఖ్యను 15 నుంచి 17 వరకు పెంచాలని, ఇద్దరు బ్రాహ్మణులు పాలకమండలిలో ఉండాలని మంత్రివర్గం నిర్ణయించింది.
More Stories
పోలవరం నిర్వాసితులకు పునరావాస హామీలు నెరవేర్చాలి
టిడిపిలో చేరిన ముగ్గురు వైసీపీ ఎమ్యెల్సీలు
జీఎస్టీ 2.0 సంస్కరణలు స్వాగతించిన ఏపీ అసెంబ్లీ