హెజ్‌బొల్లా ర‌హ‌స్య బంక‌ర్‌లో భారీగా బంగారం, నోట్ల గుట్టలు

హెజ్‌బొల్లా ర‌హ‌స్య బంక‌ర్‌లో భారీగా బంగారం, నోట్ల గుట్టలు

హెజ్‌బొల్లా ర‌హస్య బంక‌ర్‌ను ఇజ్రాయెల్ ల‌క్ష్యంగా చేసుకుంది. ఓ ఆస్ప‌త్రి కింద ఉన్న బంక‌ర్‌లో భారీగా బంగారం, నోట్ల గుట్ట‌లు ఉన్న‌ట్లు ఇజ్రాయెల్ ధృవీకరిస్తూ ఓ వీడియోను విడుద‌ల చేసింది. హ‌మాస్ అధినేత యాహ్వా సిన్వ‌ర్‌ను హ‌త‌మార్చిన నేప‌త్యంలో ఇజ్రాయెల్‌పై ప్ర‌తీకార దాడుల‌కు దిగుతామ‌ని లెబ‌నాన్‌లోని హెజ్‌బొల్లా ఇటీవ‌ల హెచ్చ‌రించిన విష‌యం తెలిసిందే. 

ఈ క్ర‌మంలో ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ హెజ్‌బొల్లా ఆర్థిక మూలాల‌ను ల‌క్ష్యంగా చేసుకుంది. ఓ ఆస్ప‌త్రి కింద ఉన్న ర‌హ‌స్య సొరంగంలో మిలిటెంట్ గ్రూప్‌న‌కు సంబంధించి భారీగా బంగారం, నోట్ల గుట్ట‌లు ఉన్న‌ట్లు త‌మ‌కు స‌మాచారం ఉంద‌ని ఐడీఎఫ్ సంచ‌ల‌న వీడియో విడుద‌ల చేసింది.

ఈ మేర‌కు ఐడీఎఫ్ అధికార ప్ర‌తినిధి డేనియ‌ల్ హ‌గారీ మాట్లాడుతూ హెజ్‌బొల్లా ఆర్థిక వ‌న‌రుల‌పై వ‌రుస‌గా దాడుల‌కు పాల్ప‌డుతున్నాం. ఆదివారం రాత్రి జ‌రిపిన దాడుల్లో ఓ బంక‌ర్‌ను ధ్వంసం చేశాం. ఆ ర‌హ‌స్య బంక‌ర్‌లో భారీగా బంగారం, వేల డాల‌ర్ల న‌గ‌దును గుర్తించాం. ఇజ్రాయెల్‌పై దాడుల‌కు ఈ న‌గ‌దునే వినియోగిస్తున్న‌ట్లు స‌మాచారం ఉందని తెలిపింది. 

ఈ మిలిటెంట్ గ్రూప్‌న‌కు బీరుట్ న‌డిబొడ్డున మ‌రో ర‌హ‌స్య బంక‌ర్ ఉంది. అల్ – సాహెల్ ఆస్ప‌త్రి కింద ఉన్న ఆ ర‌హ‌స్య బంక‌ర్‌లో వంద‌ల మిలియ‌న్ల కొద్దీ డాల‌ర్లు, బంగారం గుట్ట‌లు ఉన్న‌ట్లు తెలిసింది. ఆ బంక‌ర్‌పై ఇంకా తాము దాడుల‌కు పాల్ప‌డ‌లేదు. ఆ బంక‌ర్‌లో 500 బిలియ‌న్ డాల‌ర్ల న‌గ‌దు(రూ. 4,200 కోట్ల‌కు పైగా) ఉంటుంద‌ని అంచ‌నా వేస్తున్నాం అని హ‌గారీ పేర్కొన్నారు.

బంక‌ర్ ఉన్న ప్రాంతంలోని ఆస్ప‌త్రిపై దాడుల‌కు పాల్ప‌డ‌మ‌ని, త‌మ యుద్ధం కేవ‌లం హెజ్‌బొల్లాతో మాత్ర‌మే అని హ‌గారీ స్ప‌ష్టం చేశారు. లెబ‌నీస్ పౌరుల‌కు ఎలాంటి హానీ క‌లిగించ‌మ‌ని పేర్కొన్నారు. మొత్తానికి ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో ఆస్ప‌త్రిని అధికారులు ఖాళీ చేయిస్తున్న‌ట్లు స‌మాచారం.