మహా కుంభమేళాలో భక్తులకు ఏడంచెల భద్రత

మహా కుంభమేళాలో భక్తులకు ఏడంచెల భద్రత
జనవరి 13న మహా కుంభమేళా మొదలై, ఫిబ్రవరి 26 వరకు సాగనున్నది. ప్రపంచం నలుమూలల నుంచి హిందువులు మహా కుంభమేళాకు తరలిరానున్నారు. యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ స్వయంగా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. మహా కుంభమేళాకు అంతర్జాతీయ స్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు భారీ భద్రతా చర్యలు చేపడుతున్నారు. 
 
ఈ సారి ఉత్సవాల సందర్భంగా భక్తులకు ఏడు అంచెల్లో భద్రత కల్పించనున్నారు. ఇందులో 37వేల మందికిపైగా పోలీసులను మోహరించనున్నారు. జాతర సమయంలో 10 రకాల భద్రతా కార్యకలాపాలను సైతం నిర్వహించనున్నారు. భక్తుల భద్రతపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నారు.  ఇటీవల, సీఎం యోగి స్వయంగా ప్రయాగ్‌రాజ్‌ను సందర్శించి మహా కుంభానికి సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించారు. 
 
భద్రతకు సంబంధించి అధికారులతో ముఖ్యమైన సమావేశం నిర్వహించి సన్నాహాలను సమీక్షించారు. ప్రతి స్థాయిలో భక్తుల భద్రతకు సంబంధించి కచ్చితమైన మార్గదర్శకాలు జారీ చేశారు. సీఎం యోగి ఆదేశాల మేరకు అధికారులు మహాకుంభానికి ఏడు అంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేయడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా తక్షణమే కాకుండా సకాలంలో స్పందించేలా ఏర్పాట్లుండాలని ఆదేశించారు.తొలి రౌండ్‌లో ఆరిజిన్‌ పాయింట్‌ వద్ద తనిఖీలు చేపడుతారు. రెండోరౌండ్‌లో రైళ్లు, బస్సులు, ప్రైవేటు వాహనాలను తనిఖీ చేస్తారు. మూడోరౌండ్‌ రాష్ట్ర సరిహద్దుల వద్ద సమగ్రంగా తనిఖీలు జరుగుతాయి. నాల్గో రౌండ్‌లో జోన్ సరిహద్దులు, టోల్ ప్లాజాల వద్ద సోదాలు సాగుతాయి. ఐదోరౌండ్‌లో ప్రయాగ్‌రాజ్ కమిషనరేట్ సరిహద్దులో తనిఖీలు చేస్తారు. 

ఆరవ అంచెలో ఔటర్ ఫెయిర్ ఏరియాలో తనిఖీలు, ఏడో రౌండ్‌లో ఇంటీరియర్‌, ఐసోలేషన్‌ కార్డెన్‌ సెర్చ్‌లు కొనసాగుతాయి. 2025 మహా కుంభానికి హాజరయ్యే భక్తుల భద్రత కోసం మొత్తం 37,611 మంది పోలీసులు విధులు నిర్వర్తించనున్నారు. వీరిలో మహా కుంభమేళా ప్రాంతానికి 22,953 మంది పోలీసులు, కమిషనరేట్‌కు 6,887 మంది, జీఆర్‌పీకి చెందిన 7,771 మంది పోలీసులను నియమించనున్నారు.

అదే సమయంలో మహిళా భక్తుల భద్రత కోసం 1,378 మంది మహిళా పోలీసులను నియమించనున్నారు. గత కుంభమేళా కంటే ఈ సారి భారీ సంఖ్యలో పోలీసులను మోహరిస్తున్నారు. 2013 మహాకుంభమేళాలో 22,998 మంది పోలీసులను మోహరించగా, గతంలో పోలిస్తే 14,713 మందిని అదనంగా నియమించనున్నారు. 

2019 అర్ధ కుంభ్‌మేళాలో 27,550 మంది పోలీసులతో పోలిస్తే 10,061 మంది పోలీసులను అదనంగా వినియోగిస్తున్నారు. ఇందులో సివిల్ పోలీసులు 18479 మంది, మహిళా సిబ్బంది 1,378 మంది, ట్రాఫిక్ పోలీస్‌ సిబ్బంది 1,405 మందిని వినియోగించనున్నారు. ఇక సాయుధ పోలీసులు 1158, మౌంటెడ్ పోలీస్ 146 మంది, రవాణా శాఖ నుంచి 230 మంది, ఎల్‌ఐయుకు 510 మంది, వాటర్ పోలీస్ 340 మంది, హోంగార్డులు 13,965 మందిని మోహరిస్తారు. ఇంటెలిజెన్స్‌ యూనిట్‌ నిమిషానికో నివేదిక అందించనున్నది.

మహాకుంభ్ 2025 భద్రత పరంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, నిర్భయంగా యాత్రను పూర్తి చేసుకొని తిరిగి వెళ్లేలా ఏర్పాట్లు చేశారు. క్రౌడ్ మేనేజ్‌మెంట్‌తో పాటు, ప్రయాగ్‌రాజ్‌కు చేరుకునే ప్రతి వ్యక్తి కార్యకలాపాలకు సంబంధించి భద్రతా సిబ్బంది పూర్తి నిఘా వేసి ఉంచనున్నారు. వివిధ విభాగాల పోలీసులు స్థానిక నిఘా విభాగాలతో నిరంతరం టచ్‌లో ఉంటూ పర్యవేక్షిస్తారు. 

కుంభమేళ సమయంలో 10 రకాల బందోబస్తును కూడా నిర్వహిస్తారు. దీంతో భక్తులు అడుగడుగునా రక్షణ లభించనున్నది. ఇంటెలిజెన్స్ ఆధారిత ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ అండ్ కమాండ్ సెంటర్ (ఐసిసిసి ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఎఐ)తో కూడిన సీసీటీవీ కెమెరాల ద్వారా ఫొటోలు, గుర్తింపు, టీఎస్‌పీ (టెక్నికల్ సర్వీస్ ప్రొవైడర్) ద్వారా పర్యవేక్షణ జరుగనున్నది.