
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు సమన్లు జారీ చేసింది. నవంబర్ 22న వ్యక్తిగతంగా కోర్టుకు హాజరుకావాలని ఆదేశించింది. జనవరిలో అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవం సమయంలో తిరుమల నుంచి పంపించిన లడ్డూల్లో జంతువుల కొవ్వు కలిసిన నెయ్యిని వాడారని పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై న్యాయవాది ఇమ్మనేని రామారావు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
పవన్ కల్యాణ్ చేసిన ఈ ఆరోపణలతో హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని తన పిటిషన్లో పేర్కొన్నారు. అలాగే తిరుమల లడ్డూ కల్తీపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలను సోషల్ మీడియా, యూట్యూబ్ నుంచి తొలగించేలా ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా గ్యాగ్ ఆర్డర్ ఇవ్వాలని కోరారు. ఈ పిటిషన్ పై విచారించిన కోర్టు పవన్ కల్యాణ్ కు నోటీసులు జారీ చేసింది.
న్యాయవాది ఇమ్మనేని రామారావు వేసిన పిటిషన్‌పై హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు సోమవారం నాడు విచారణ చేపట్టింది. పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ చేసింది. ఇందుకోసం నవంబర్ 22న వ్యక్తిగతంగా కోర్టుకు హాజరుకావాలని ఆదేశించింది. పవన్ కల్యాణ్‌తో పాటు తెలంగాణ సీఎస్ శాంతి కుమారికి కూడా హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు సమన్లు జారీ చేసినట్లు తెలుస్తోంది
తిరుపతి లడ్డు కల్తీ వ్యవహారం ఇటీవల కలకలం రేపింది ఏపీ సీఎం చంద్రబాబు తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి కలిపారని ఆరోపించారు. ఈ విషయం సుప్రీంకోర్టు వరకు వెళ్లింది. ఈ విషయంపై స్వతంత్ర విచారణకు సుప్రీం ఆదేశించింది. ఈ వ్యవహారంపై సీబీఐ, ఏపీ పోలీసులు, ఎఫ్ఎస్ఎస్ఏఐ అధికారులతో సిట్ ఏర్పాటు చేసి విచారించనున్నారు.
అయితే లడ్డూ తయారీకి కల్తీ నెయ్యి వినియోగంపై పవన్ కల్యాణ్ తీవ్రంగా స్పందించారు. తిరుపతిలో వారాహి డిక్లరేషన్ సభలో లడ్డూ వివాదం, సనాతన ధర్మంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.
More Stories
అభ్యర్థుల ఎంపికకై ముగ్గురు సభ్యులతో బిజెపి కమిటీలు
హైదరాబాద్ సిటీ బస్సుల్లో ఛార్జీల పెంపు
ఆమెరికాలో కాల్పులు.. హైదరాబాద్‌కి చెందిన విద్యార్థి మృతి