భద్రత లేదంటున్న 50 శాతం వైద్యారోగ్య సిబ్బంది

భద్రత లేదంటున్న 50 శాతం వైద్యారోగ్య సిబ్బంది
పశ్చిమ బెంగాల్‌ రాజధాని కోల్‌కతాలోని ఆర్జీ కర్‌ ఆస్పత్రిలో ట్రైనీ డాక్టర్‌పై జరిగిన హత్యాచార ఘటన దేశాన్ని కుదిపేస్తున్నది. ఇప్పటికీ అక్కడ వైద్యులు నిరాహార దీక్ష కొనసాగిస్తున్నారు. పని చేసే చోట తమకు భద్రత లేదని వారు పేర్కొంటున్నారు. బెంగాల్‌ వైద్యుల ఆందోళనకు దేశవ్యాప్తంగా మద్దతు లభిస్తున్నది. 
 
ఈ నేపథ్యంలోనే వైద్యారోగ్య సిబ్బందికి వారు పని చేసే చోట భద్రత ఎలా ఉన్నది? అనే విషయాలను తెలుసుకోవడానికి నిర్వహించిన ఓ అధ్యయనంలో
50 శాతానికి మించి వైద్యారోగ్య సిబ్బంది తాము పని చేసే చోట సురక్షితంగా ఉన్నట్టు భావించడం లేదని స్పష్టం చేశారు.  వర్ధమాన్‌ మహావీర్‌ మెడికల్‌ కాలేజీ, సఫ్దర్‌జంగ్‌ హాస్పిటల్‌, ఢిల్లీ ఎయిమ్స్‌లు సంయుక్తంగా నిర్వహించిన ఈ అధ్యయనంలో వైద్యారోగ్య వ్యవస్థలో సిబ్బందికి కల్పించే భద్రతలోని లోపాలు బయటపడ్డాయి. 
 
దేశవ్యాప్తంగా విభిన్న మెడికల్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ నుంచి మొత్తం 1,566 మంది హెల్త్‌ కేర్‌ సిబ్బంది (869 మంది మహిళా, 697 పురుష వర్కర్లు) నుంచి శాంపిల్స్‌ తీసుకుని ఈ సర్వే రూపొందించారు. ఇందులో ఫ్యాకల్టీ సిబ్బంది, నర్సింగ్‌ స్టాఫ్‌, మెడికల్‌ ఆఫీసర్స్‌, సపోర్టింగ్‌ స్టాఫ్‌, మెడికల్‌ స్టూడెంట్స్‌, ఇంటర్న్‌లు అందరి నుంచీ వివరాలను తీసుకున్నారు.
 
దాదాపు సగం మంది వర్కర్లకు ప్రత్యేకంగా డ్యూటీ రూమ్‌లు లేవు. సుదీర్ఘమైన గంటలు డ్యూటీలోనే ఉండాల్సి వస్తున్నది. కొన్నిసార్లు రాత్రిపూట కూడా ఉండాల్సి వస్తున్నది. ఇది వరకు అందుబాటులో ఉన్న డ్యూటీ రూమ్‌లలో సరిపడా స్పేస్‌, వెంటలేషన్‌ లేక, చెదలు పట్టి, శుభ్రత లేకుండా ఉన్నాయి. 70 శాతం మంది వర్కర్లు తమకు అసమర్థ సెక్యూరిటీ సిబ్బంది ఉన్నదని భావిస్తున్నారు. 
 
62 శాతం మంది ఎమర్జెన్సీ అలారమ్‌ సిస్టమ్‌ తగిన విధంగా లేదని చెప్పారు. సర్వెలెన్స్‌, హైరిస్క్‌ ప్రాంతాలైన ఐసీయూ, సైకియాట్రిక్‌ వార్డుల్లో పటిష్టమైన సెక్యూరిటీ లేదని, కంట్రోల్‌ యాక్సెస్‌ కూడా తమకు లేదని వివరించారు. ఆయుధాలు, ప్రమాదకర ఆయుధాలను లోనికి రాకుండా అడ్డుకునే పరిస్థితులూ 90 శాతం సంస్థల్లో లేవని చెప్పారు. 
 
ప్రభుత్వ వైద్య సంస్థల్లో కంటే ప్రయివేటు వాటిలో మంచి భద్రత ఉన్నదని భావిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ సంస్థల కంటే రాష్ట్ర ప్రభుత్వ సంస్థల్లో పరిస్థితులు ఇంకా దారుణంగా ఉన్నాయని పేర్కొన్నారు. 70 శాతం మంది ఎమర్జెన్సీ అలారమ్‌ సమర్థవంతంగా లేవని రిపోర్ట్‌ చేశారు. 81.3 శాతం మంది హెల్త్‌ కేర్‌ వర్కర్లు తాము హింసను ఎదుర్కొన్నట్టు తెలిపారు. 
 
హింస ఎదుర్కొన్న వారిలో 44.1 శాతం మంది ఆ ఘటనలను సరిగ్గా హ్యాండిల్‌ చేయలేకపోయారని భావిస్తున్నారు. ఎమర్జెన్సీ పరిస్థితుల్లో ఎవరిని కాంటాక్ట్‌ చేయాలో కూడా 80 శాతం మందికి తెలియదని ఈ సర్వే తేల్చింది. సెక్యూరిటీకి సంబంధించి ఆందోళనకర విషయాలను రిపోర్ట్‌ చేసే రహస్య పద్ధతి 70 శాతం మందికి అందుబాటులో లేదు. 
 
ఈ సమస్యలను పరిగణనలోకి తీసుకోవాలని ఈ అధ్యయన కమిటీ సూచించింది. హై రిస్క్‌ ఏరియాల్లో సెక్యూరిటీ పెంచాలని, సెక్యూరిటీ సిబ్బంది పెంచాలని, డ్యూటీ రూమ్‌ పరిస్థితులు మెరుగుపరచాలని, హింసను ఎలా ఎదుర్కోవాలో సూచించే స్పష్టమైన ప్రొటోకాల్స్‌ను రూపొందించి అమలు చేయాలని సిఫారసులు చేసింది.