బీమా ప్రీమియంలపై జిఎస్‌టి తొలగింపు!

బీమా ప్రీమియంలపై  జిఎస్‌టి తొలగింపు!

పలు ఉత్పత్తులపై వస్తు సేవల పన్ను (జిఎస్‌టి)ల్లో మార్పులు చేస్తూ మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది. కొంతకాలంగా ఆందోళన వ్యక్తం అవుతున్న బీమా ప్రీమియంలపై జీఎస్టీని తొలగించాలని మంత్రుల బృందం (జీఓఎం) కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. ఇది అమల్లోకి వస్తే, సామన్యుడిపై భారం తగ్గుతుంది. ప్రజలకు ప్రయోజనం చేకూర్చేందుకు కొన్ని భీమా ప్రీమియంలపై జీఎస్టీని తొలగించాలని, ప్యాకేజ్డ్ వాటర్, సైకిళ్లు వంటి వస్తువులపై పన్నులను తగ్గించాలని శనివారం జరిగిన మంత్రుల బృందం సిఫారసు చేసింది. ఇదే విషయంపై ఆదివారం కూడా సమావేశం జరగనుంది.

సీనియర్ సిటిజన్లకు టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంలను జీఎస్టీ నుంచి మినహాయించాలని జీఓఎం ప్రతిపాదించింది. అదనంగా, రూ .5 లక్షల వరకు ఆరోగ్య కవరేజీ ఉన్న వ్యక్తులకు కూడా ట్యాక్స్​ నుంచి ఉపశమం లభించే అవకాశం ఉంది. అయితే రూ.5 లక్షలకు పైగా కవరేజీ ఉన్న హెల్త్ పాలసీలపై 18 శాతం జీఎస్టీ వర్తిస్తుంది.

20 లీటర్ల ప్యాకేజ్డ్‌ నీటి బాటిళ్లు, సైకిళ్లు, నోట్‌బుక్స్‌ తదితర ఉత్పత్తులపై ఎట్టకేలకు జిఎస్‌టిని తగ్గించాలని ప్రతిపాదించింది. బీహార్‌ డిప్యూటీ సిఎం సామ్రాట్‌ చౌదరి నేతృత్వంలో జరిగిన మంత్రివర్గ ఉపసంఘం భేటీలో పలు నిర్ణయాలు తీసుకుంది.  ఈ రేట్ల మార్పు నిర్ణయం వల్ల రూ. 22 వేల కోట్ల మేరకు రెవెన్యూ పెరుగుతుందని అధికారులు తెలియజేశారు.
 
శనివారం జరిగిన మంత్రివర్గ ఉపసంఘం చేసిన ప్రతిపాదిత వివరాల ప్రకారం  ప్రస్తుతం 20 లీటర్ల నీటి బాటిల్‌పై 18 శాతం జిఎస్‌టిని వసూలు చేస్తుండగా, దీన్ని 5 శాతానికి తగ్గించాలని, అదేవిధంగా రూ.10,000లోపు ధర కలిగిన సైకిళ్లపై 12 శాతంగా ఉన్న పన్నును కూడా 5 శాతానికి తగ్గించాలని ప్రతిపాదించింది. అలాగే నోట్‌ బుక్స్‌పైనా 12 నుంచి ఐదు శాతానికి తగ్గించాలని సూచించింది. 
 
మరోవైపు ఖరీదైన బూట్లు, చేతి వాచీలపై పన్ను రేట్లు సవరించాలని, రూ.15,000 కంటే అధిక విలువ కలిగిన బూట్లు, రూ.25 వేల కంటే ఎక్కువ ధర ఉన్న చేతి వాచ్‌లపై జిఎస్‌టిని 18 నుంచి 28 శాతానికి పెంచాలని ప్రతిపాదించింది. 18 శాతం శ్లాబులో ఉన్న హెయిర్‌ డ్రైయర్లు, హెయిర్‌ కర్టర్లు, బ్యూటీ, మేకప్‌ సామగ్రిపై ఉన్న జిఎస్‌టిని మళ్లీ 28 శాతం శ్లాబులోకి చేర్చాలని పేర్కొంది. 
 
ఈ పన్ను రేట్లపై జిఎస్‌టి కౌన్సిల్‌ భేటీలో తుది నిర్ణయం చేయాల్సివుంది. అలాగే బీమాపై వసూలు చేస్తోన్న 18 శాతం జిఎస్‌టి పన్ను భారంపై తీవ్ర విమర్శలు వస్తున్న నేపథ్యంలో జిఎస్‌టి నుంచి ఆరోగ్య బీమా, జీవిత పాలసీలను మినహాయించాలని ఉపసంఘం ప్రతిపాదించింది. టర్మ్‌ ఇన్సూరెన్స్‌తో పాటు రూ.5 లక్షల వరకు తీసుకునే ఆరోగ్య బీమాపై జిఎస్‌టి నుంచి మినహాయించాలని సూచించింది.
ఆరుగురు సభ్యుల జిఒఎంలో ఉత్తర ప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి సురేష్ కుమార్ ఖన్నా, రాజస్థాన్ ఆరోగ్య సేవల శాఖ మంత్రి గజేంద్ర సింగ్, కర్నాటక రెవెన్యూ శాఖ మంత్రి బైరె గౌడ, కేరళ ఆర్థిక శాఖ మంత్ర కెఎన్ బాలగోపాల్ కూడా ఉన్నారు.