
ప్రజల తిరుగుబాటుతో ఉద్వాసనకు గురైన ప్రధాని షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్‌పై నిషేధం విధించాలని మితవాద లిబరల్ డెమొక్రాటిక్ పార్టీ అధ్యక్షుడు కల్నల్ (రిటైర్డు) ఓలి అహ్మద్ డిమాండ్ చేశారు. తాత్కాలిక ప్రభుత్వంలో చీఫ్ అడ్వయిజర్ ప్రొఫెసర్ మహ్మద్ యూనస్‌ను ప్రభుత్వ అతిథి గృహంలో కలిసి ఈ మేరకు ఒత్తిడి తెచ్చారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, జులై, ఆగస్టు మాసాల్లో తలెత్తిన విద్యార్థి ఉద్యమంపై అవామీలీగ్ ప్రభుత్వం పోలీసు నిర్బంధాన్ని ప్రయోగించి 1500 మందిని పొట్టనబెట్టుకుందని, దేశాన్ని అవినీతి కూపంలోకి నెట్టిందని విమర్శించారు. 1971 బంగ్లా విమోచనా యుద్ధం తర్వాత జమాతేపై నిషేధం విధించారు. దానికి కారణమేమిటి? అదే కారణంతో అవామీ లీగ్‌పై నిషేధం ఎందుకు విధించరు? అని ఆయన ప్రశ్నించారు.
హసీనాకు గట్టి మద్దతుదారులను పనిచేసిన అధికారులపై కేసులు పెట్టాలని కూడా ఎల్‌డిపి నాయకుడు డిమాండ్ చేశారు. కాగా, బంగ్లాదేశ్‌లో ఎన్నికలు ఎప్పుడు నిర్వహించేది చీఫ్ అడ్వయిజర్ యూనస్ ఖాన్ నిర్ణయిస్తారని న్యాయ శాఖ సలహాదారు అసిఫ్ నజ్రుల్ వివరణ ఇచ్చారు.
2025లో బంగ్లా పార్లమెంటు ఎన్నికలు ఉంటాయని, ఇందుకు సంబంధించి కొత్త ఎన్నికల కమిషన్, సెర్చ్ కమిటీల ఏర్పాటు చేయాల్సి ఉందని, అంతకు ముందు ఓ టివి చానెల్‌కిచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించిన నజ్రుల్ ఆ తర్వాత వెనక్కి తగ్గారు. ఎన్నికల నిర్వహణ అనేది విధాన పరమైన అంశమని, దీనిపై నిర్ణయం తీసుకునే అధికారం చీప్ అడ్వయిజర్కే ఉందని ఆయన శనివారం తెలిపారు.
More Stories
ఆఫ్ఘన్ విదేశాంగ మంత్రి వచ్చే వారం భారత్ లో పర్యటన
అక్టోబర్ 26 నుంచి భారత్- చైనాల మధ్య విమాన సర్వీసులు
విదేశీ విద్యార్థులపై ట్రంప్ కొత్త మెలిక