సుప్రీంకోర్టు కేసులన్నీ త్వరలో ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి. అత్యున్నత న్యాయస్థానంలో విచారణ జరుపుతున్న అన్ని కేసులను ప్రత్యక్ష ప్రసారం చేయాలని సుప్రీంకోర్టు భావిస్తోంది. అన్ని కేసులను లైవ్ స్ట్రీమింగ్ చేయడానికి వీలుగా యాప్ బీటా వెర్షన్ ను పరీక్షిస్తున్నట్లు బార్ అండ్ బెంచ్ నివేదిక తెలిపింది.
సాధారణ ప్రజానీకానికి సైతం విచారణ అందుబాటులోకి తెచ్చేందుకు న్యాయవిచారణ లైవ్ స్ట్రీమింగ్ ను తన అధికారిక వెబ్ సైట్ లో సుప్రీంకోర్టు ప్రారంభించింది. ఆ వెబ్సైట్ లింక్: https://appstreaming.sci.gov.in 2022 నుంచి రాజ్యాంగ ధర్మాసనం కేసులను ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నారు.
అయతే, ఇతర రోజువారీ విచారణలను కూడా రెగ్యులర్ లైవ్ స్ట్రీమింగ్ కోసం పరిగణనలోకి తీసుకోవడం ఇదే మొదటిసారి. అన్ని కేసుల విచారణను ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు రూపొందించిన యాప్ బీటా వర్షన్ ను ప్రస్తుతం పరీక్షిస్తున్నారని సమాచారం.లోటుపాట్లను సవరించి త్వరలోనే లైవ్ స్ట్రీమింగ్‌ను అమలులోకి తీసుకురానున్నారు.
ఆ యాప్ బీటా వర్షన్ కు సానుకూల ఫీడ్ బ్యాక్ వస్తే, సుప్రీంకోర్టులోని అన్ని కేసుల లైవ్ స్ట్రీమింగ్ ప్రారంభమవుతుంది. అన్ని కేసులను తన అధికారిక యూట్యూబ్ ఛానెల్లో కాకుండా సుప్రీంకోర్టు సొంత యాప్ లో ప్రత్యక్ష ప్రసారం చేయాలని భావిస్తోంది. ఇప్పటి వరకు రాజ్యాంగ ధర్మాసనం కేసులు, ప్రజా ప్రాధాన్యమున్న విచారణలు మాత్రమే ప్రత్యక్ష ప్రసారం అయ్యాయి.
వాటిలో నీట్-యూజీ కేసు, ఆర్జీ కర్ కేసులు ఉన్నాయి. వాటి విచారణను ప్రజాప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని త్రిసభ్య ధర్మాసనం ప్రత్యక్ష ప్రసారం చేసింది. ముఖ్యమైన కేసుల విచారణను లైవ్ స్ట్రీమింగ్ లో పెట్టాలని సుప్రీంకోర్టు తన స్వప్నిల్ త్రిపాఠి(2018) కేసు తీర్పులో పేర్కొంది. ఆ తర్వాత దేశంలోని నలుమూలల ముఖ్యమైన కేసుల విచారణను లైవ్ స్ట్రీమింగ్ ద్వారా అందించాలని నిర్ణయించింది.
దేశంలోని కింది కోర్టుల విచారణలను చూడడానికి, వీడియో కాన్ఫరెన్సింగ్ కు సుప్రీంకోర్టు తనదైన క్లౌడ్ సాఫ్ట్ వేర్ ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. ఈకోర్టుల మూడో దశలో వీడియో కాన్ఫరెన్సింగ్ కోసం తమ స్వంత క్లౌడ్ సాఫ్ట్ వేర్ ను ఏర్పాటు చేయబోతున్నట్లు భారత ప్రధాన న్యాయమూర్తి డివై. చంద్రచూడ్ తెలిపారు.
కరోనా కాలంలో దేశవ్యాప్తంగా కోర్టులు దాదాపు 43 మిలియన్ విచారణలను వర్చువల్ మోడ్ లోనే నిర్వహించినట్లు కూడా తెలిపారు. వలసవాదం కాలం నాటి విధానాలను కూడా కోర్టుల్లో తొలగించబోతున్నారు.
భారత మాజీ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వీ రమణ పదవీ విరమణ చేసిన రోజు ఆయన నేతృత్వంలోని ధర్మాసనం నాటి కార్యకలాపాలను దేశ ప్రజలంతా వీక్షించేలా ఏర్పాట్లు చేయించింది. సుప్రీంకోర్టు కార్యకలాపాలను ప్రత్యక్ష ప్రసారం చేయడం అదే తొలిసారి. ఆ తర్వాత రాజ్యాంగ ధర్మాసనం విచారణలను ప్రత్యక్ష ప్రసారం చేయాలని రెండేళ్ల క్రితం నిర్ణయం తీసుకున్నారు.
ఇప్పుడు సుప్రీంకోర్టులో జరిగే అన్ని కేసుల విచారణలను ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు కసరత్తు జరుగుతోంది. స్వప్నిల్ త్రిపాఠి వర్సెస్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా కేసులో చారిత్రాత్మక తీర్పు సందర్భంగా కోర్టు కార్యకలాపాలకు వర్చువల్ యాక్సెస్ కోసం సుప్రీంకోర్టు తలుపులు తెరిచింది. మైనర్లు, వైవాహిక సమస్యలు, లైంగిక దాడుల కేసులు మినహా రాజ్యాంగ, జాతీయ ప్రాముఖ్యత ఉన్న కేసులను ప్రత్యక్ష ప్రసారం చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
More Stories
వందేమాతరంపై రేపే చర్చను ప్రారంభింపనున్న ప్రధాని మోదీ
మోదీ- పుతిన్ భేటీతో కొత్త స్థాయికి భారత్- రష్యా బంధం
‘నేషన్ ఫస్ట్ పాలసీ’కి అనుగుణంగానే సంస్కరణలు