బాంబు బెదిరింపులతో విమానాల్లో స్కై మార్షల్స్‌ని రెట్టింపు

బాంబు బెదిరింపులతో విమానాల్లో స్కై మార్షల్స్‌ని రెట్టింపు

* స్నేహితుడిని ఇరికించేందుకు ఓ వ్యాపారవేత్త కుమారుడు!

దేశంలోని పలు విమానాలు, విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు భారీగా పెరిగాయి. ఈ బెదిరింపులు కేంద్ర ప్రభుత్వానికి సవాల్‌గా మారాయి. దేశవ్యాప్తంగా ఉన్న విమానాశ్రయాల నుంచి వచ్చే విమానాల్లో స్కై మార్షల్స్‌ని రెట్టింపు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. విమానాలు, విమానాశ్రయాలకు పెరుగుతున్న ముప్పును అంచనా వేసి, నిఘా సంస్థల నుంచి వచ్చిన ఇన్‌పుట్స్‌ అందిన తర్వాత స్కై మార్షల్‌ సంఖ్యను రెట్టింపు చేయాలని నిర్ణయించినట్లు హోంమంత్రిత్వ శాఖ సీనియర్‌ అధికారి తెలిపారు.

గడిచిన మూడురోజుల్లో 19 విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. వీటిలో గడిచిన 24 గంటల్లోనే 9 విమానాలకు ఈ తరహా ఘటనలు జరిగాయి. ఈ క్రమంలో భద్రతా ఏజెన్సీలు తనిఖీలు నిర్వహించి.. ఫేక్‌ బెదిరింపులుగా తేల్చారు. కాగా, ముంబయి నుంచి బయలుదేరిన విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చిన ఘటనల్లో నిందితుడు ఓ యువకుడు తేలింది. అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

విమానాలకు భద్రతా ముప్పు ఉందంటూ పోస్టులు పెట్టిన ఘటనలో కేసు నమోదు చేసిన పోలీసులు వాటి మూలాలు ఛత్తీస్‌గఢ్‌ నుంచి ఉన్నట్లు గుర్తించారు. ఓ వ్యాపారవేత్త కుమారుడు (17) సోషల్‌ మీడియాలో ఈ పోస్టులు పెట్టినట్లు కనుగొన్నారు. ఈ కేసులో ఆ వ్యాపారవేత్తకు సమన్లు పంపించిన పోలీసులు మైనర్‌ను అదుపులోకి తీసుకొని ముంబయి తరలించారు. నగదు విషయంలో గొడవ పడిన ఓ స్నేహితుడిని ఇరికించేందుకు ఆ బాలుడు ఇదంతా చేసినట్లు తెలుస్తోంది.

విమానాల బెదిరింపు ఘటనలను ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తోందని పౌర విమానయానశాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌ నాయుడు పేర్కొన్నారు. సంబంధిత దర్యాప్తు సంస్థలు ఆయా కేసులపై ముమ్మర దర్యాప్తు చేస్తున్నాయని తెలిపారు. మూడు విమానాలకు ఈ విధమైన బెదిరింపులకు పాల్పడిన ఓ మైనర్‌ను ముంబయి పోలీసులు అరెస్టు చేశారని ధ్రువీకరించారు.

నిరంతరం పెరుగుతున్న బెదిరింపుల మధ్య బ్యూరో ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ సెక్యూరిటీ (బిసిఏఎస్), పౌర విమానయాన మంత్రిత్వ శాఖతో చర్చించింది.  ఈ చర్చల్లో బెదిరింపులను గుర్తించడానికి, నో ఫ్లై జాబితాలో చేర్చేందుకు ఏజెన్సీలు కలిసి పని చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తున్నది. దాంతో పాటు ఎఫ్‌ఐఏ నివేదిక ఆధారంగా సెన్సిటివ్‌ కేటగిరిలో చేర్చిన కొత్త అంతర్జాతీయ మార్గాల్లో కొత్త బ్యాచ్‌ ఎయిర్‌ మార్షల్స్‌ని మోహరించనున్నట్లు అధికారి చెప్పారు. భద్రతా సంస్థలతో పలు సమావేశాల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే, పార్లమెంటరీ కమిటీ ముందు ఈ అంశాన్ని లేవనెత్తారు.విమానాశ్రయాలు, విమానాలకు వస్తున్న బెదిరింపుల అంశం బుధవారం పార్లమెంటరీ కమిటీలో వేడెక్కింది.

ఈ విషయమై ఎంపీలు అడిగిన ప్రశ్నలకు పౌర విమానయాన శాఖ కార్యదర్శి వుమ్లున్మాంగ్ వుల్నమ్ స్పందిస్తూ.. నిందితులను గుర్తించే పనిలో ఉన్నట్లు తెలిపారు. ఏజెన్సీలు చర్యలు తీసుకుంటున్నాయని, అధికారులు కొంత సమాచారాన్ని సేకరించాయని పేర్కొన్నారు. ఫేక్ మెసేజ్‌లపై కేసులు నమోదు చేస్తున్నారన్నారు. ఈ విషయంపై విచారణ కొనసాగుతున్నందున.. సమాచారం సున్నితత్వాన్ని దృష్టిలో పెట్టుకొని వివరాలను చెప్పేందుకు ఆ అధికారి నిరాకరించారు.

ఎయిర్‌ మార్షల్స్‌ తీవ్రవాద, హైజాకింగ్‌ నిరోధక చర్యల్లో పాల్గొంటారు. నేషనల్‌ సెక్యూరిటీ గార్డ్స్‌లోని విభాగం. స్కై మార్షల్‌ ప్రధానంగా అంతర్జాతీయ మార్గాలు, కొన్ని సున్నితమైన మార్గాల్లో మోహరిస్తుంటారు. స్కై మార్షల్స్‌ సాధారణ దుస్తుల్లో ప్రయాణికులతో కలిసి ప్రయాణిస్తుంటారు. కాందహార్‌లో ఎయిర్‌ ఇండియాకు చెందిన ఐసీ814 విమానాన్ని హైజాక్‌ చేసిన అనంతరం.. భవిష్యత్‌లో మరోసారి హైజాక్‌ జరుగకుండా ఉండేందుకు 1999లో భారత్‌ తొలిసారిగా స్కై మార్షల్స్‌ని ప్రవేశపెట్టింది. స్కై మార్షల్‌ని ఫ్లై సెక్యూరిటీ ఆఫీసర్‌ అని కూడా పిలుస్తారు.