కళ్లు తెరిచిన న్యాయ దేవత.. విగ్రహంలో మార్పులు

కళ్లు తెరిచిన న్యాయ దేవత.. విగ్రహంలో మార్పులు

‘చట్టానికి కళ్లు లేవు’ అన్న అపవాదు నుంచి బయటపడటానికి దేశ సర్వోన్నత న్యాయస్థానం నడుం కట్టింది. మన దేశంలోని ప్రతీ కోర్టులో న్యాయ దేవత విగ్రహం ఉంటుంది. చిన్న స్థాయి కోర్టు నుంచి మొదలుకుని దేశ అత్యున్నత న్యాయస్థానం అయిన సుప్రీంకోర్టులో ఈ న్యాయ దేవత విగ్రహాన్ని ఉంచుతారు. అయితే ఎప్పటినుంచో ఆ న్యాయ దేవత విగ్రహం అనగానే మనకు కొన్ని గుర్తులు గుర్తుకు వస్తాయి.

ఎప్పుడూ న్యాయ దేవత కళ్లకు నల్లటి వస్త్రం కట్టి ఉంటుంది. ఇక ఎడమ చేతిలో ఒక కత్తి, కుడి చేతిలో ఒక త్రాసు కనిపిస్తూ ఉంటాయి. గత కొన్ని దశాబ్దాలుగా న్యాయ దేవత అంటే మనకు ఇవే గుర్తుకు వస్తాయి. కానీ ఇక నుంచి న్యాయ దేవత పూర్తిగా మారిపోయింది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ ఆదేశాలతో సుప్రీంకోర్టులో కొత్త న్యాయ దేవత విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.

అయితే ఇప్పటివరకు ఉన్న న్యాయ దేవతల విగ్రహాలకు, ఈ విగ్రహానికి చాలా తేడాలు ఉన్నాయి. సుప్రీంకోర్టులో కొత్తగా ఏర్పాటు చేసిన న్యాయ దేవత విగ్రహానికి కళ్లకు గంతలు తీసేశారు.  అంతేకాకుండా న్యాయ దేవత కుడి చేతిలో ఉండే త్రాసును అలాగే ఉంచగా, ఎడమ చేతిలో ఉండే పొడవైన కత్తిని తీసేసి ఆ స్థానంలో రాజ్యాంగాన్ని పెట్టారు. అంటే రాజ్యాంగం ప్రకారం అందరికీ సమానంగా న్యాయం జరుగుతుందని తెలియజేయడానికి దాన్ని అలా ఉంచారు.

న్యాయం గుడ్డికాదని, చట్టానికి కళ్లున్నాయ్ అని చెప్పే బలమైన ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది.  సుప్రీంకోర్టు జడ్జిల లైబ్రరీలో ఏర్పాటైన ఈ కొత్త న్యాయ దేవత విగ్రహానికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.ప్రధాన న్యాయమూర్తి కార్యాలయానికి సంబంధించిన ఉన్నత వర్గాల సమాచారం ప్రకారం, భారతదేశం బ్రిటిష్ వలస పాలన ఛాయల నుంచి ముందుకు సాగాలని, చట్టం ఎప్పుడూ గుడ్డిది కాదని, అది అందరినీ సమానంగా చూస్తుందని జస్టిస్ చంద్రచూడ్ అభిప్రాయపడ్డారని అంటున్నారు.

చట్టానికి కళ్లు ఉండవని, దానికి గుర్తుగానే కోర్టుల్లో ఉండే న్యాయ దేవత విగ్రహానికి ఉండే కళ్లను గంతలతో కడతారని మనం ఇప్పటివరకు విన్నాం. అంతేకాకుండా ఎన్నో సినిమాల్లో చూశాం. న్యాయ దేవతకు కళ్లు ఉండవని, చెవులు కూడా వినిపించవని పేర్కొంటారు. ఎందుకంటే డబ్బు, అధికారాన్ని బట్టి,నిందితులకు చట్టాలు, తీర్పులు ఉండవని, న్యాయ దేవత ముందు అందరూ సమానమేనని చెప్పేందుకే అలా ఉంచారు.

వివరంగా చెప్పాలంటే కేసులోని వాది, ప్రతివాదులు సంపద, అధికారం, కులం, మతం ఏవీ న్యాయదేవత చూడదు. అదే సమయంలో అన్యాయాన్ని, అధికారాన్ని శిక్షించే ఆయుధంగా కత్తిని సూచిస్తుంది. అయితే న్యాయదేవత కండ్లకు గంతలను కట్టడంపై చాలాకాలంగా విమర్శలు కూడా ఉన్నాయి. ఆమె నిజాన్ని చూడదని, గుడ్డిదని, చట్టానికి కళ్లు లేవని కొందరు పేర్కొనేవారు. ఈ అపవాదు నుంచి బయటపడటానికి సీజేవై చంద్రచూడ్‌ నడుం బిగించారు.

అయితే ఈ న్యాయ దేవత విగ్రహాన్ని బ్రిటీష్ కాలంలో ప్రవేశపెట్టగా ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా మార్పులు అవసరమని భావించి ఈ నిర్ణయం తీసుకున్నారు.  కత్తిలా ఉన్న వలసవాద యుగం నాటి భారతీయ ఇండియన్‌ పీనల్‌ కోడ్‌ లాంటి క్రిమినల్‌ చట్టాలను విడిచిపెట్టి భారతీయ న్యాయ సంహిత ద్వారా భర్తీ చేయడాన్ని ప్రతీకగా రాజ్యాంగాన్ని ఉంచారు.

బ్రిటిష్‌ వలసవాద చట్టాలకు స్వస్తి పలుకుతూ కొత్త చట్టాలను అమల్లోకి తెచ్చిన నేపథ్యంలో న్యాయ దేవత విగ్రహంలోనూ మార్పులు చేయాలని గతంలోనే జస్టిస్‌ చంద్రచూడ్‌ సూచించారు. ‘న్యాయదేవత కళ్లకు గంతలు అవసరం లేదు. చట్టం ఎప్పుడు గుడ్డిది కాదు. అది అందరినీ సమానంగా చూస్తుంది. కత్తి హింసకు ప్రతీకగా కనిపిస్తోంది. కానీ న్యాయస్థానాలు రాజ్యాంగ చట్టాల మేరకు న్యాయాన్ని అందజేస్తాయి’ అని తెలిపారు.

మనం కోర్టుల్లో చూసే న్యాయ దేవత జస్టియా అనే గ్రీకు దేవత. జస్టిస్ అనే పదం నుంచి జస్టియా అనే పేరు వచ్చింది. 17వ శతాబ్దంలో ఒక బ్రిటిష్ కోర్టు అధికారి ఈ జస్టియా విగ్రహాన్ని మొట్టమొదటిసారిగా మన దేశానికి తీసుకువచ్చారు. ఆ తర్వాత 18వ శతాబ్దంలో బ్రిటిష్ కాలంలో న్యాయ దేవత విగ్రహాన్ని కోర్టుల్లో ఉంచగా, స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత అదే విగ్రహం కొనసాగుతూ వచ్చింది.