ఇజ్రాయిల్‌కు అమెరికా థాడ్ యాంటీ మిస్సైల్ సిస్ట‌మ్‌

ఇజ్రాయిల్‌కు అమెరికా థాడ్ యాంటీ మిస్సైల్ సిస్ట‌మ్‌
ఇజ్రాయిల్‌కు అత్యంత శ‌క్తివంత‌మైన థాడ్ మిస్సైల్‌ను అమెరికా ఇవ్వ‌నున్న‌ది. ఈ విష‌యాన్ని అమెరికా ర‌క్ష‌ణ కార్యాల‌యం పెంట‌గాన్ ద్రువీక‌రించింది. ట‌ర్మిన‌ల్ హై ఆల్టిట్యూడ్ ఏరియా డిఫెన్స్‌(థాడ్‌) బ్యాట‌రీ ద్వారా ఇజ్రాయిల్ ఆయుధ శ‌క్తి పెర‌గ‌నున్న‌ది.  తాజాగా ఇరాన్ త‌న మిస్సైళ్ల‌తో ఇజ్రాయిల్‌పై దాడి చేస్తున్న నేప‌థ్యంలో అమెరికా త‌న థాడ్ క్షిప‌ణి వ్య‌వ‌స్థ‌ను ఇచ్చేందుకు రెఢీ అయ్యింది.
అమెరికా ర‌క్ష‌ణ ద‌ళాలు మాత్ర‌మే ఆ మిస్సైల్‌ను ఆప‌రేట్ చేయ‌గ‌ల‌వు. ఇజ్రాయిల్‌ను కాపాడుకునేందుకు ఇవ్వ‌డం త‌ప్ప‌డం లేద‌ని అమెరికా అధ్య‌క్షుడు బైడెన్ తెలిపారు.  అక్టోబ‌ర్ ఒక‌టో తేదీన ఇజ్రాయిల్‌పై సుమారు 180 క్షిప‌ణుల‌ను ఇరాన్ వ‌దిలిన విష‌యం తెలిసిందే. అయితే ఆ దాడికి ప్ర‌తీకారం తీర్చుకునే ఆలోచ‌న‌లో ఇజ్రాయిల్ ఉన్న‌ది. అయితే అదునైన స‌మ‌యం కోసం ఆ దేశం ఎదురుచూస్తున్న‌ది.
ఇజ్రాయిల్ వైమానిక ద‌ళాల్లో ఉన్న లోపాల‌ను క‌ప్పేందుకు థాడ్ మిస్సైల్ వ్య‌వ‌స్థ‌ను తీసుకువ‌స్తున్న‌ట్లు తెలుస్తోంది. ఇరాన్ అణు కేంద్రాల‌పై దాడి చేయ‌వ‌ద్దు అని ఇప్ప‌టికే అధ్య‌క్షుడు బైడెన్ ఆదేశించారు. ఇరాన్ వ‌ద్ద ఉన్న ఫ‌తాహ‌1 లాంటి బాలిస్టిక్ మిస్సైళ్లను ఎదుర్కొవ‌డంలో థాడ్ క్షిప‌ణి వ్య‌వ‌స్థ ప‌టిష్టంగా ప‌నిచేయ‌నున్న‌ది. బాలిస్టిక్ క్షిప‌ణులపై అత్యంత ప్ర‌భావంతంగా థాడ్ ప‌నిచేస్తుంద‌ని ఉత్ప‌త్తి కంపెనీ లాక్‌హీడ్ మార్టిన్ పేర్కొన్న‌ది.
అయితే థాడ్‌కు చెందిన అడ్వాన్స్‌డ్ రేడార్‌ను అమెరికా కంపెనీ రేతియాన్ డెవ‌ల‌ప్ చేస్తున్న‌ది. థాడ్ క్షిప‌ణి వ్య‌వ‌స్థ‌లో ఆరు ట్ర‌క్కుల‌తో కూడిన లాంచ‌ర్లు ఉంటాయి. ఒక్కొక్క లాంచ‌ర్‌పై 8 ఇంట‌ర్‌సెప్టార్లు ఉంటాయి. ఆ క్షిప‌ణి ఖ‌రీదు సుమారు వంద కోట్ల డాల‌ర్లు ఉంటుంది.  దాన్ని ఆప‌రేట్ చేసేందుకు క‌నీసం వంద మంది సిబ్బంది అవ‌స‌రం ఉంటుంది. ర‌ష్యాపై యుద్ధం చేస్తున్న ఉక్రెయిన్ కూడా ఆ మిస్సైల్ వ్య‌వ‌స్థ కోసం ప‌డిగాపులు కాస్తున్న‌ది. థాడ్ క్షిప‌ణి వ్య‌వ‌స్థ‌ కోసం సౌదీ ఆరేబియా ఆర్డ‌ర్ కూడా చేసింది.