6 పంటలకు కనీస మద్దతు ధర పెంపు

6 పంటలకు కనీస మద్దతు ధర పెంపు
* కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 3 శాతం డీఏ పెంపు
దేశంలోని రైతులకు కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం రైతుల ఆదాయాన్ని పెంచడంలో భాగంగా వారు పండించిన పంటలకు మద్దతు ధర పెంచుతూ నిర్ణయం తీసుకుంది. తాజాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన భేటీ అయిన కేంద్ర మంత్రి వర్గం పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది.  ఇందులో భాగంగానే రబీ సీజన్‌లో పండించే 6 పంటలకు కనీస మద్దతు ధర పెంచుతున్నట్లు వెల్లడించింది. ఈ రబీ పంటల ఎంఎస్పీ పెంపు కోసం రూ.87,657 కోట్లు కేంద్ర ప్రభుత్వం వెచ్చించనుంది.
 అదే సమయంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి సందర్భంగా 3 శాతం డీఏను పెంచుతూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం మూలవేతనంలో 50 శాతం ఉన్న డీఎం 53 శాతానికి చేరుతుంది. ఈ ఏడాది జూలై 1వ తేదీ నుంచి దీన్ని అమలు చేయనున్నారు. ప్రభుత్వ నిర్ణయంతో 10 లక్షల మంది ఉద్యోగులు, పెన్షనర్లకు లబ్ధి చేకూరనుంది.

మొత్తం 6 రబీ పంటల ఎంఎస్పీని కేంద్రం పెంచింది. గోధుమ, ఆవాలు, పెసర్లు, బార్లీ, శనగలు, సన్‌ఫ్లవర్ పంటలకు ఎంఎస్పీని పెంచుతూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. 2025-26 మార్కెటింగ్ సీజన్‌కు గానీ ఈ రబీ పంటల కనీస మద్దతు ధర పెంపు ఉండనున్నట్లు కేంద్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలను కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు.

గోధుమలపై క్వింటాల్‌కు ఎంఎస్పీ రూ. 150 పెంచడంతో గతంలో క్వింటాల్‌ గోధుమ ధర రూ.2275 ఉండగా.. అది కాస్తా రూ.2425కి పెరిగింది. క్వింటాల్‌ ఆవాలుకు ఎంఎస్పీ రూ.300 పెంచగా.. గతంలో ఉన్న రూ.5,650 నుంచి రూ.5,950 కి పెరిగింది.  ఇక క్వింటాల్ పెసర్లకు రూ.275 ఎంఎస్పీ పెంచగా.. రూ. 6,425 నుంచి రూ.6,700 కి పెరిగింది.
ఇక బార్లీ పంట క్వింటాల్‌కు రూ.130 ఎంఎస్పీ పెంచడంతో.. రూ.1,850 నుంచి రూ.1,980కు పెరిగింది. శనగల ఎంఎస్పీ రూ.210 పెంచగా.. అది కాస్తా.. రూ.5,440 నుంచి రూ.5,650కి పెరిగింది. సన్‌ఫ్లవర్‌ పంటకు ఎంఎస్పీ రూ.140 పెంచడంతో.. రూ.5,800 నుంచి రూ.5,940కి పెరిగింది. ఎంఎస్పీ పెంచడమే కాకుండా రైతులకు మరిన్ని శుభవార్తలను కేంద్ర ప్రభుత్వం అందించింది.
రైతుల ఆదాయాన్ని మరింత పెంచడమే లక్ష్యంగా పీఎం అన్నదాత ఆయ్‌ సంరక్షణ్‌ అభియాన్‌ (పీఎం ఆశా) పథకానికి రూ.35 వేల కోట్లు ఇచ్చేందుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక అదే సమయంలో రబీ పంట సీజన్‌కు సంబంధించి నాన్‌-యూరియా ఎరువుల సబ్సిడీకి రూ.24,475 కోట్లు ఇచ్చేందుకు ఆమోదం తెలిపింది.  ఇక ఉత్తర్‌ప్రదేశ్‌లోని వారణాసిలో గంగా నదిపై కొత్త రైల్వే కమ్‌ రోడ్డు బ్రిడ్జిని నిర్మించేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. ఈ రైల్వే కమ్ రోడ్డు ప్రాజెక్టు కోసం రూ.2,642 కోట్లు ఖర్చు చేయనున్నారు.