
* భారత్ పై ఆంక్షల అవకాశం అంటున్న విదేశాంగ మంత్రి
భారత్, కెనడా మధ్య రోజు రోజుకు దౌత్య వివాదం ముదురుతోంది. ఖలిస్తానీ తీవ్రవాది నిజ్జర్ హత్య కేసులో ఎలాంటి ఆధారాలు ఇవ్వకుండా కెనడా నిరాధారమైన ఆరోపణలు చేస్తోందని భారత ప్రభుత్వం విమర్శించింది. ఈ కేసులో సాక్ష్యాధారాలను పంచుకున్నామంటూ కెనడా చేసిన వ్యాఖ్యలను తోసిపుచ్చింది. భారత ఏజెంట్లకు కెనడాలోని క్రిమినల్ గ్యాంగ్‌లకు ముడిపెడుతూ ట్రూడే ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను తీవ్రంగా విమర్శించింది.
కెనడా జాతీయులను లక్ష్యంగా చేసుకుని కోవర్ట్ కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ట్రూడే చేసిన ఆరోపణలను నిర్ద్వంద్వంగా తిరస్కరించింది. సిక్కు అతివాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసు నేపథ్యంలో ఇరుదేశాల మధ్య మొదలైన గొడవకు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మరింత ఆజ్యం పోశారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ భారత్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు.
‘కెనడా ప్రజలను లక్ష్యంగా చేసుకొని, వారి ఇల్లే వారికి అసురక్షితమైనదనే భావన కల్పించేలా హింసాత్మక చర్యలకు, హత్యకు సైతం దౌత్యవేత్తలను, వ్యవస్థీకృత నేరాలను భారత్ ఉపయోగించుకుంటున్నది. తద్వారా భారత్ తీవ్ర తప్పిదానికి పాల్పడిందని నమ్ముతున్నా’ అంటూ తీవ్రమైన ఆరోపణలు చేశారు. ‘కెనడా ప్రజల రక్షణ కోసం, ఇరు దేశాల సంబంధాలు దెబ్బతినకుండా గత వారం భద్రతా సంస్థలు, దౌత్యవేత్తలతో భారత ప్రభుత్వాన్ని సంప్రదించాం. కానీ, దురదృష్టవశాత్తు మాతో కలిసి పని చేయాలని భారత్ అనుకోలేదు. తిరస్కరించడంతో పాటు మా ప్రభుత్వంపై వ్యక్తిగత ఆరోపణలకు దిగింది. ఎన్నిసార్లు కోరినా మాకు సహకరించొద్దని భారత్ నిర్ణయించింది.’ అని ట్రూడో చెప్పుకొచ్చారు.
కాగా, కయ్యానికి కాలు దువ్వుతున్న కెనడా తాజాగా ఒక అడుగు ముందుకు వేసి భారత్‌పై ఆంక్షలు విధించే అవకాశాలు వున్నాయంటూ వ్యాఖ్యలు చేసింది.
ఆ దేశ విదేశాగ మంత్రి మెలనీ జోలీ విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ, భారత్‌పై ఆంక్షల విషయాన్ని పరిశీలిస్తున్నామని సూచనప్రాయంగా తెలిపారు. ప్రతీ అంశమూ చర్చకు వస్తోందని చెబుతూ నిజ్జర్ హత్య కేసులో భారత దౌత్యవేత్తలను బహిష్కరించాలన్న నిర్ణయానికి రాయల్ కెనడియన్ పోలీసులు సేకరించిన సాక్ష్యాధారాలే ప్రాతిపదిక అని చెప్పారు. ఇరు దేశాల పరస్పర ప్రయోజనాల కోసం ఈ దర్యాప్తులో సహకరించాలని కోరారు.
మరోవంక, బిష్ణోయ్ గ్యాంగ్‌తో భారత ప్రభుత్వ ఏజెంట్లకు సంబంధాలు ఉన్నాయని రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీస్(ఆర్సీఎంపీ) ఆరోపించింది. బిష్ణోయ్ గ్యాంగ్‌ను ఉపయోగించుకొని దక్షిణాసియాకు చెందిన వారిని, ప్రత్యేకించి కెనడాలోని ఖలిస్థానీ అనుకూల వ్యక్తులను భారత్ లక్ష్యంగా చేసుకున్నదని ఆర్సీఎంపీ కమిషనర్ మైక్ దుహెన్ ఆరోపించారు.
కెనడా హై కమిషనర్‌తో సహా ఆరుగురు సభ్యులను భారత ప్రభుత్వం బహిష్కరించిన గంటల వ్యవధిలోనే ఈ ఆరోపణలు చేశారు. అయితే, నిజ్జర్ హత్య కేసుకు సంబంధించి తాము ఈ ఆరోపణ చేయడం లేదని, కెనడాలో జరుగుతున్న నేరాల గురించి ప్రజలకు తెలియజేయాలని అనుకుంటున్నట్టు చెప్పారు. కెనడా ప్రధాని ట్రూడో ఆరోపణలను భారత్ తీవ్రంగా ఖండించింది. ‘ట్రూడో పాత కారణాలతో, అవే పాత విషయాలు చెప్పారు. నిజ్జర్ కేసుకు సంబంధించి భారత్‌కు విశ్వసనీయ ఆధారాలు ఇచ్చామని కెనడా చెబుతున్నది నిజం కాదు. మొదటి నుంచి కెనడా కేవలం అస్పష్ట ఆరోపణలు చేస్తున్నది’ అని భారత విదేశాంగ శాఖ పేర్కొన్నది.
ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న మాటల యుద్ధం, దిగజారుతున్న పరిస్థితుల పట్ల కెనడాలోని భారతీయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇరు దేశాల మధ్య అత్యంత సున్నితమైన అంశంపై నెలకొన్న వివాదంలో పార్లమెంట్ ఉభయ సభల ప్రతిపక్ష నేతలను, ఇతర పార్టీల నేతలను ప్రధాని మోడీ విశ్వాసంలోకి తీసుకోవాలని కాంగ్రెస్ కోరింది. ఈ మేరకు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ ఎక్స్‌లో పోస్టు పెట్టారు.
More Stories
శతాబ్ది సందర్భంగా `పంచ పరివర్తన్’పై ఆర్ఎస్ఎస్ దృష్టి
అక్టోబర్ 26 నుంచి భారత్- చైనాల మధ్య విమాన సర్వీసులు
విదేశీ విద్యార్థులపై ట్రంప్ కొత్త మెలిక