ముంబై వెళ్లే కార్లు, ఎస్‌యూవీలకు టోల్ ఛార్జీ లేదు

ముంబై వెళ్లే కార్లు, ఎస్‌యూవీలకు టోల్ ఛార్జీ లేదు
అసెంబ్లీ ఎన్నికలకు ముందు మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముంబైకి వెళ్లే మార్గంలోని ఐదు టోల్‌ బూత్‌ల వద్ద లైట్‌ మోటార్‌ వాహనాలకు టోల్‌ ఫీజు రద్దు  చేసింది. ఈ మేరకు ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండే ప్రకటించారు. సోమవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.  టోల్‌ మినహాయింపు సోమవారం అర్ధరాత్రి నుంచే అమల్లోకి రానున్నట్లు తెలిపారు.
ఇక ఈ ఏడాది చివర్లో మహారాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఎన్నికల షెడ్యూల్‌ విడుదలకు ముందు ఈ నిర్ణయాన్ని ప్రకటించడం గమనార్హం. ముంబైలోకి ప్రవేశించే తేలికపాటి వాహనాలకు మొత్తం ఐదు టోల్‌ గేట్ల వద్ద ఫీజును రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దహిసర్‌, ములుంద్‌‌, ఐరోలి, తిన్హంత్‌, వాషి.. ఈ ఐదు టోల్‌ బూత్‌ల వద్ద లైట్‌ మోటార్‌ వాహనదారులు టోల్‌ కట్టాల్సిన అవసరం లేదు. టోల్‌ కట్టకుండానే వీటి గుండా ముంబైలోకి ప్రవేశించొచ్చు.

 ‘ప్రస్తుతం టోల్​ ఫీజుగా రూ.45, రూ.75 వసూలు చేస్తున్నాం. దాదాపు 3.5 లక్షల వాహనాలు ఈ మార్గంలో ప్రవేశిస్తాయి. వాటిలో 70 వేల హైవీ వాహనాలు కాగా, 2.80 లక్షలు చిన్నవి ఉన్నాయి. ఈ నిర్ణయం సోమవారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి రానుంది. దీంతో ప్రజలు క్యూలలో ఉండే సమయం ఆదా అవుతుంది. ప్రభుత్వం చాలా కాలంగా చర్చించిన తర్వాతే ఈ విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది’ అని  దాదాజీ దగదు భూసే చెప్పారు.

ప్రభుత్వ నిర్ణయంతో మహారాష్ట్రలోని ఇతర నగరాలు, ప్రాంతాల నుంచి ముంబైకి వెళ్లే ప్రజలకు ఇది ప్రయోజనకరంగా ఉండనుంది. తేలికపాటి మోటారు వాహనాలు అంటే కార్లు, ఎస్‌యూవీ వాహనాలు. బస్సులు, లారీలు, పెద్ద పెద్ద ట్రక్కులకు ఈ నిర్ణయం వర్తించదు. రోజూ 6 లక్షలకు పైగా వాహనాలు ముంబైకి రాకపోకలు సాగిస్తుండగ, అందులో 80 శాతం తేలికపాటి మోటారు వాహనాలే.

కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ గతంలో మహారాష్ట్రలో మంత్రిగా ఉన్న సమయంలో మహారాష్ట్ర స్టేట్‌ రోడ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ముంబైలో 55 ఫ్లైఓవర్‌లను నిర్మించింది. ఈ ఫ్లైఓవర్లకు అయిన ఖర్చును రికవరీ చేసేందుకు మొదటగా నగర ప్రవేశాల వద్ద టోల్‌ బూత్‌లను ఏర్పాటు చేశారు. వంతెనల నిర్మాణం తుది దశకు చేరుకోగానే టోల్‌ బూత్‌ల నిర్మాణానికి 1999లో టెండర్లు వేశారు.

2002లో మొత్తం ఐదు టోల్‌ బూత్‌లను ప్రారంభించారు. అప్పటి నుంచి ముంబైలోకి ప్రవేశించే వాహనాలకు ఈ ఐదు టోల్‌ బూత్‌ల ద్వారా ఫీజు వసూలు చేస్తున్నారు. అయితే, ఈ నిర్వహణ డబ్బు మొత్తం 10 ఏళ్ల క్రితమే రికవరీ అయ్యింది. అయినా  ప్రభుత్వం మాత్రం టోల్‌ వసూలు చేస్తూనే ఉంది.

గతేడాది మహారాష్ట్ర ప్రభుత్వం టోల్‌ ట్యాక్స్‌ రికవరీని మరో మూడేళ్లపాటు అంటే 2027 వరకూ పొడిగించింది. దీని ద్వారా మహా ప్రభుత్వం రూ.11 వేల కోట్లు ఆశించింది. అయితే, మహారాష్ట్ర నవనిర్మాణ సేన, శివసేనకు చెందిన కొందరు నాయకులు అన్ని ముంబై బూత్‌లలో టోల్ మాఫీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. శివసేన (యుబిటి) నేత, మాజీ మంత్రి ఆదిత్య థాక్రే కూడా ముంబైలోని అన్ని ఎంట్రీ పాయింట్ల వద్ద టోల్ మినహాయింపునకు డిమాండ్ చేశారు.