బాలాసోర్‌ను గుర్తు చేసేలా చెన్నై రైలు ప్రమాదం

బాలాసోర్‌ను గుర్తు చేసేలా చెన్నై రైలు ప్రమాదం

తమిళనాడులో శుక్రవారం రాత్రి జరిగిన రైలు ప్రమాదం ఇటీవల జరిగిన అత్యంత భయానకమైన బాలాసోర్‌ (ఒడిశా) రైలు ప్రమాదాన్ని గుర్తు చేసింది. దీంతో రైల్వే ప్రయాణికుల భద్రత ప్రశ్నార్థకంగా మారిందన్న ప్రశ్న మరోసారి తెర మీదకు తెచ్చింది. తాజా ప్రమాదంలో మైసూర్‌- దర్భంగ భాగమతి ఎక్స్‌ప్రెస్‌ లూప్‌ లైన్‌లోకి దూసుకెళ్లి అక్కడున్న గూడ్స్‌ రైలును ఢీకొట్టడంతో 12 బోగీలు పట్టాలు తప్పాయి.

ఈ ఘటనలో 19 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. చెన్నైకి సమీపంలో కవరైపైట్టె రైల్వే స్టేషన్‌ వద్ద రాత్రి 8.30 గంటల సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. రైలు గమనం, రైల్వే సిగ్నల్స్‌పై ‘డాటా లాగర్‌’ పరికరం విడుదల చేసిన ‘సిమ్యులేషన్‌ వీడియో’ బయటకు వచ్చింది.  ఈ వీడియోను పరిశీలించిన రైల్వే అధికారులు, నిపుణులు ఇది 2023 జూన్‌ 2న నాటి బాలాసోర్‌ రైలు ప్రమాదాన్ని పోలి ఉందని చెప్పారు.

మెయిన్‌ లైన్‌లో వెళ్లేందుకే భాగమతి ఎక్స్‌ప్రెస్‌కు గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వగా, అది అనూహ్యంగా లూప్‌ లైన్‌లోకి వెళ్లి..దానిపై ఉన్న గూడ్స్‌ రైలును ఢీ కొట్టిందని రైల్వే బోర్డు తెలిపింది. రైలు ప్రమాదం వెనుక కుట్ర జరిగిందన్న అనుమానాలు వ్యక్తం కాగా, దీనిపై ‘ఎన్‌ఐఏ’ దర్యాప్తు చేపట్టింది. పెద్ద సుత్తి లాంటి పరికరంతో రైల్వే ట్రాక్‌ను దెబ్బ తీసినట్టు కొన్ని ఆధారాలు లభ్యమయ్యాయని, దెబ్బతిన్న ట్రాక్‌ వద్ద బోల్టులు, ఇతర భాగాలు లేకపోవటంపై ఎన్‌ఐఏ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

కాగా, ఈ ప్రమాదానికి సిగ్నల్‌, రూట్‌ మధ్య అసమతుల్యతే కారణమని భావిస్తున్నట్టు దక్షిణ రైల్వే జనరల్‌ మేనేజర్‌ చెప్పారు.  రైలు ప్రమాదాలే లక్ష్యంగా చోటు చేసుకుంటున్న కుట్రలపై ఆందోళన వ్యక్తమవుతున్నది. తాజాగా ఉత్తరాఖండ్‌లోని రూర్కీ సమీపంలోని రైల్వే ట్రాక్‌పై గ్యాస్‌ సిలిండర్‌ కనిపించటం తీవ్ర కలకలం రేపింది. గూడ్స్‌ రైల్‌ లోకో పైలట్‌ వెంటనే అప్రమత్తమవటంతో తృటిలో ప్రమాదం తప్పింది.

లలాండౌర్‌- ధంధేరా స్టేషన్ల మధ్య ఆదివారం ఉదయం 6.35 గంటలకు ఈ ఘటన జరిగింది. గూడ్స్‌ రైలు స్టేషన్‌ సమీపానికి వస్తుండగా.. పట్టాలపై గ్యాస్‌ సిలిండర్‌ పడి ఉండటాన్ని లోకో పైలట్‌ గమనించారు. వెంటనే అధికారులను అప్రమత్తం చేశారు. సిలిండర్‌ను ఘటనా స్థలానికి దూరంగా తీసుకెళ్లి పరిశీలించగా, అది ఖాళీదని తేలింది. స్థానిక పోలీసులు, జీఆర్పీ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.