బిజెపిలోకి సావిత్రి జిందాల్ తో సహా ముగ్గురు స్వతంత్రులు

బిజెపిలోకి సావిత్రి జిందాల్ తో సహా ముగ్గురు స్వతంత్రులు
హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ హ్యాట్రిక్‌ విజయం నమోదు చేసిన విషయం తెలిసిందే. ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలను తలకిందలు చేస్తూ మంగళవారం వెలువడిన ఎన్నికల ఫలితాల్లో జయకేతం ఎగురవేసింది.  90 అసెంబ్లీ స్థానాలకు గానూ 48 చోట్ల కమలం పార్టీ విజయం సాధించగాకాంగ్రెస్‌ కేవలం 37 సీట్లకే పరిమితమైంది.
దీంతో హర్యానాలో కమలం పార్టీ ముచ్చటగా మూడోసారి అధికారం చేపట్టబోతోంది.  ఈ నేపథ్యంలోనే తాజా ఎన్నికల్లో గెలిచిన స్వతంత్ర అభ్యర్థులు  బీజేపీకి మద్దతు ప్రకటించారు.  భారత్‌లోనే సంపన్న మహిళ, జిందాల్‌ గ్రూప్‌ చైర్‌పర్సన్‌, హర్యానా మాజీ మంత్రి సావిత్రి జిందాల్ సహా ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులు తాజా ఎన్నికల్లో గెలుపొందారు. 
అందులో ఇద్దరు ఇప్పటికే బీజేపీకి మద్దతు ప్రకటించారు. ఈ మేరకు దేవేందర్‌ కడ్యాన్‌, రాజేశ్‌ జూన్‌లు ఇవాళ బీజేపీ అధినాయకత్వంతో భేటీ అయ్యారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌ నివాసంలో ఆ రాష్ట్ర బీజేపీ చీఫ్‌ మోహన్‌ లాల్‌ బడోలీ సమక్షంలో వీరిద్దరూ కమలం పార్టీతో చేతులు కలిపారు. బీజేపీ రెబల్‌గా బరిలోకి దిగిన కడ్యాన గనౌర్‌ అసెంబ్లీ స్థానం నుంచి విజయం సాధించగా, రాజేశ్ బహదూర్‌ఝర్‌లో జేపీపీ అభ్యర్థిని ఓడించారు. ఇప్పుడు వీరిద్దరూ కమలం పార్టీతో చేతులు కలిపారు.
ఇక సావిత్రి జిందాల్‌ ఈ ఏడాది మార్చిలో కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. అయితే, పార్టీ అధిష్ఠానం ఆమెకు టికెట్‌ కేటాయించలేదు. దీంతో సావిత్రి జిందాల్‌ హిసార్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. ఇప్పుడు ఆమె కూడా బీజేపీకే మద్దతు ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.

మరోవైపు, హరియాణా సీఎం నాయబ్‌ సింగ్‌ సైనీ దిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీని బుధవారం కలిశారు. హరియాణాలో బీజేపీ విజయానికి మోదీ అమలు చేసిన విధానాలు, పథకాలే కారణమని సైనీ తెలిపారు. గత పదేళ్లలో పేదలు, రైతులు, మహిళలు, యువతతోపాటు సమాజంలోని అన్నివర్గాల కోసం ఎన్నో పథకాలు అమలు చేసినట్లు చెప్పారు.

ప్రజల మద్దతుతోనే మూడోసారి బీజేపీ గెలుపొందినట్లు సైనీ పేర్కొన్నారు. ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలు వ్యతిరేకంగా ఉన్నా ప్రజలు మాత్రం బీజేపీపై నమ్మకం ఉంచారని తెలిపారు. ఓడిపోయిన ప్రతిసారి ఈవీఎంలపై అనుమానం వ్యక్తం చేయటం కాంగ్రెస్‌కు పరిపాటిగా మారిందని ధ్వజమెత్తారు.

కాగా, సావిత్రి జిందాల్ గత కాంగ్రెస్‌ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. ఆమె 2005 జిందాల్ హిసార్ నియోజకవర్గం నుంచి హర్యానా విధానసభకు ఎన్నికయ్యారు. అంతకు ముందు ఆమె భర్త ఓం ప్రకాశ్‌ జిందాల్ చాలాకాలం పాటు హిసార్‌కు ప్రాతినిధ్యం వహించారు.  2009లో జరిగిన ఎన్నికల్లో గెలుపొందారు.

29 అక్టోబర్ 2013న హర్యానా ప్రభుత్వంలో క్యాబినెట్ మంత్రిగా నియామకమయ్యారు.  రెవెన్యూ, విపత్తు నిర్వహణ, గృహనిర్మాణం శాఖ బాధ్యతలు నిర్వర్తించారు. 2014 హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో హిసార్ నుంచి ఓడిపోయారు.

భారతదేశంలోని అత్యంత సంపన్న మహిళల జాబితాలో సావిత్రి జిందాల్ పేరు అగ్రస్థానంలో ఉంది. ఆమె వయస్సు 84 సంవత్సరాలు. జిందాల్ గ్రూప్ భారీ వ్యాపారాన్ని నిర్వహిస్తోంది. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం మార్చి 28, 2024 నాటికి, సావిత్రి జిందాల్ నికర విలువ 29.6 బిలియన్‌ డాలర్లు. భారత కరెన్సీలో దాదాపు రూ.2.47 లక్షల కోట్లు. ప్రపంచ బిలియనీర్ల జాబితాలో సావిత్రి జిందాల్ 56వ స్థానంలో ఉన్నారు.