జమ్ముకశ్మీర్‌ తదుపరి సీఎంగా ఒమర్‌ అబ్దుల్లా

జమ్ముకశ్మీర్‌ తదుపరి సీఎంగా ఒమర్‌ అబ్దుల్లా
జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్న నేషనల్ కాన్ఫరెన్స్‌ పార్టీకి జమ్మూ కశ్మీర్ ఓటరు అధికారాన్ని కట్టబెట్టాడు. నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రిగా పార్టీ ఉపాధ్యక్షుడు, తన కుమారుడు ఒమర్ అబ్దుల్లానే అని  ప్రకటించారు. కూటమికి 49 సీట్లు, బిజెపికి 29, పిసీడీపీకి 3 సీట్లు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
 
 దశాబ్దం తర్వాత జరిగిన ఎన్నికల్లో రాష్ట్ర ఓటర్లు కచ్చితమైన తీర్పు ఇచ్చారని ఆయన పేర్కొన్నారు. అల్లా సైతం తమ ప్రార్థనలను ఆలకించారని ఈ సందర్భంగా తెలిపారు. తమ ప్రభుత్వం ఏర్పాటు కాగానే జైల్లో ఉన్న అమాయక ప్రజలను బయటకు తీసుకు వస్తామని వెల్లడించాయిరు. అలాగే మీడియాకు సైతం స్వేచ్ఛ లభించినట్లు అయిందని చెప్పారు. 
 
హిందువులు, ముస్లింల మధ్య బంధాన్ని మరింత దృఢపరిచేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇక జమ్మూ కశ్మీర్‌కు రాష్ట్ర హోదా తీసుకు వచ్చేందుకు ఇండియా కూటమిలోని భాగస్వామ్య పక్షాలతో కలిసి పోరాటం చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఇక హరియాణాలో కాంగ్రెస్ పార్టీ ఓటమిపై సైతం ఫరూక్ అబ్దుల్లా స్పందిస్తూ ఆ రాష్ట్రంలోని కాంగ్రెస్‌లో నెలకొన్న అంతర్గత కలహాలే ఆ పార్టీ ఒటమికి కారణమని తెలిపారు.
 
కాగా, గెలుపొందిన నేషనల్ కాన్ఫరెన్స్- కాంగ్రెస్ కూటమిని పిడిపి అధ్యక్షురాలు, మాజీ ముఖ్యమంత్రి మెహబూబ్ ముప్తి అభినందించారు. ప్రజలు సుస్థిరతకు తీర్పు ఇచ్చారని ఆమె చెప్పారు. ఈ ఫలితాలు కేంద్ర ప్రభుత్వంకు ఓ గుణపాఠం కావాలని చెబుతూ కొత్తగా ప్రభుత్వం ఏర్పాటు చేయబోయే నేషనల్ కాన్ఫరెన్స్- కాంగ్రెస్ కూటమి వ్యవహారాలలో తలదూర్చవద్దని ఆమె హితవు చెప్పారు.
 
రాష్ట్రంలో బలమైన ప్రభుత్వం చాలా అవసరమని చెబుతూ గతంలో హంగ్ అసెంబ్లీ ఏర్పడటంతో కలిగిన ఇబ్బందులను చూసిన ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారని ఆమె కొనియాడారు. పరోక్షంగా పూర్తి మెజారిటీ లేకపోవడంతో తన ప్రభుత్వంకు ఎదురైనా ఇబ్బందులను ప్రస్తావించారు.
మొత్తం 90 స్థానాలున్న జమ్మూ కశ్మీర్ అసెంబ్లీకి మూడు విడతలుగా సెప్టెంబర్ 18, 25, అక్టోబర్ 01వ తేదీన ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్‌‌తో కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకుంది. ఇక బీజేపీ, పీపుల్స్ డెమెక్రటిక్ పార్టీ (పీడీపీ)లు వేర్వేరుగా పోటీ చేశాయి.  మరోవైపు జమ్మూ కశ్మీర్‌లో హంగ్ ఏర్పడుతుందంటూ ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తప్పయ్యాయి.

కాగా, జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో ‘ఆమ్ ఆద్మీ పార్టీ’  గెలుపు ఖాతా తెరిచింది. దోడా అసెంబ్లీ నియోజకవర్గంలో ‘ఆప్’ అభ్యర్థి మేహరాజ్ మాలిక్ గెలుపొందారు. తన సమీప బీజేపీ ప్రత్యర్థి గజయ్ సింగ్ రాణాపై ఆయన 4,770 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. మాలిక్ గెలుపుతో ఢిల్లీ, పంజాబ్, గుజరాత్ తర్వాత మరో రాష్ట్రంలో ‘ఆప్’ ఖాతా తెరిచినట్టు అయింది.

జమ్మూ కశ్మీర్‌లో దాదాపు దశాబ్దం అనంతరం అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. అది కూడా ఆర్టికల్ 370 రద్దు తర్వాత జరిగిన తొలి ఎన్నికలు ఇవి. ఈ ఎన్నికల్లో ఏ పార్టీకి రాష్ట్ర ఓటరు పట్టం కడతాడంటూ సర్వత్ర ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఓటరు మాత్రం నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీకి స్పష్టమైన మెజార్టీ కట్టబెట్టినట్లు అయింది.