మణిపూర్‌లో భారీగా ఆయుధాలు లభ్యం

మణిపూర్‌లో భారీగా ఆయుధాలు లభ్యం
మైతీ, కుకీ జాతుల మధ్య ఘర్షణలతో అల్లాడుతున్న మణిపూర్‌లో భారీగా ఆయుధాలు లభించాయి. కక్చింగ్ జిల్లాలో మణిపూర్ పోలీసులు సెర్చ్‌ ఆపరేషన్‌ చేపట్టారు. భారీగా ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయాన్ని సోమవారం వెల్లడించారు. అక్టోబరు 5న మణిపూర్‌లోని కొండ, లోయ జిల్లాల్లోని అలజడుల ప్రాంతాల్లో భద్రతా దళాలు తనిఖీలు చేపట్టినట్లు తెలిపారు.
 
యుద్ధ తరహా ఆయుధ నిల్వలను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. మూడు కార్బైన్ విత్ మ్యాగజైన్, ఒక ఎయిర్ గన్ రైఫిల్, రెండు సింగిల్ బ్యారెల్స్‌, ఒక 9 ఎంఎం పిస్టల్‌, మ్యాగజైన్, డిటోనేటర్ లేని 36 హెచ్‌ఈ గ్రెనేడ్లు 14, 4.75 కేజీల ఐఈడీ పేలుడు పదార్థం, నాలుగు డిటోనేటర్లు, ఆరు స్మోక్ షెల్స్‌, రెండు రబ్బరు బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.

కాగా, ఆ ఆయుధాల్లో స్ట్రింగర్ కాట్రిడ్జ్, రెండు ట్యూబ్ లాంచింగ్‌లు, మూడు ఆర్మింగ్ రింగ్‌లు, 34 లైవ్ మందుగుండు సామగ్రి, 25 పేలుడు కాట్రిడ్జ్, 18 7.62 ఎంఎం ఫైర్డ్ కేస్, 10 ఫైర్డ్ ఎక్స్‌ప్లోజివ్ కాట్రిడ్జ్, ఒక బావోఫెంగ్ సెట్‌తో కూడిన ఛార్జర్, హెల్మెట్, రెండు బీపీ కవర్లు, ప్లేట్లు, ఒక జత జంగిల్ బూట్లు కూడా ఉన్నాయని మణిపూర్‌ పోలీసులు తెలిపారు.

 వాబగై నటేఖోంగ్, తురాన్మెన్, కక్చింగ్ జిల్లాలో ఈ ఆయుధాలు లభించినట్లు చెప్పారు. అలాగే అక్టోబర్‌ 5న మణిపూర్ పోలీసులు, అస్సాం రైఫిల్స్ సంయుక్తంగా చురచంద్‌పూర్ జిల్లాలోని ఖెంగ్మోల్ హిల్‌లో సెర్చ్‌ చేసి మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.