కెనడాలో వెయిటర్‌ ఉద్యోగాలకై వేల మంది భారతీయుల క్యూ

కెనడాలో వెయిటర్‌ ఉద్యోగాలకై వేల మంది భారతీయుల క్యూ

విదేశాలకు వెళ్తున్న మనవాళ్లంతా సుఖపడిపోతున్నారని, రాజభోగాలు అనుభవిస్తున్నారని అనుకుంటే అంతకంటే మూర్ఖత్వం మరోటి ఉండదని తాజాగా రుజువైంది. కెనడాలోని బ్రాంప్టన్‌లో ఉన్న తందూరి ఫ్లేమ్‌ రెస్టారెంట్‌లో వెయిటర్‌, సర్వర్‌ ఉద్యోగాలకు 3 వేల మంది భారతీయ విద్యార్థులు క్యూ కట్టడం అక్కడి దారుణ పరిస్థితులను కండ్లకు కడుతున్నది. కిలోమీటరు పొడవున్న లైనులో ఉద్యోగార్థులు నిలబడి ఉన్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి.

ఇటీవలి కాలంలో విదేశాల్లో చదువు కోసం వెళుతున్న భారతీయుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. అయితే చదువు తర్వాత సరైన ఉద్యోగ అవకాశాలు లేక చాలా మంది ఇబ్బందిపడుతున్నారు. కెనడాలో చదువుకోవాలని లేదా పనిచేయాలని ఆలోచిస్తున్న వారిని ఇది భయాందోళనకు గురిచేస్తోంది!

‘మేఘ్‌ అప్‌డేట్స్‌’ ఎక్స్‌ ఖాతాలో షేర్‌ చేసిన ఈ వీడియో.. కెనడాలో చదువు, ఉద్యోగాలు కోరుకునే యువతకు ఈ వీడియో కనువిప్పు కలిగిస్తుందన్న చర్చ మొదలైంది. కొత్తగా ప్రారంభించబోయే రెస్టారెంట్‌ వెయిటర్‌, సర్వెంట్‌ జాబ్స్‌కు వేసిన అడ్వైర్టెజ్‌మెంట్‌కు వచ్చిన రెస్పాన్స్‌ ఇదని అందులో పేర్కొన్నారు. ఎన్నో కలలతో కెనడాకు వెళ్లే భారతీయ విద్యార్థులు ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరాన్ని ఈ వీడియో నొక్కి చెప్తున్నది. మాంద్యం తరుముకొస్తున్న వేళ విదేశాలకు వెళ్లకపోవడమే బెటరని కొందరు సలహా ఇస్తున్నారు.

కెనడా బ్రాంప్టన్​లోని తందూరీ ఫ్లేమ్​ రెస్టారెంట్ ​లో ఈ ఘటన జరిగింది. క్యూలో వేచి ఉన్న విద్యార్థుల్లో ఒకరైన అగమ్వీర్ సింగ్ తన నిరాశను వ్యక్తం చేశాడు. “నేను మధ్యాహ్నం 12 గంటలకు ఇక్కడకు వచ్చాను. లైన్ చాలా పెద్దగా ఉంది. అప్లికేషన్​ని ఇంటర్నెట్​లో పెట్టాము. ఇంటర్వ్యూ తీసుకుంటామని చెప్పారు. కానీ అలాంటిదేమీ జరగలేదు. ప్రజలు ఇప్పుడిప్పుడే ఇక్కడికి వస్తున్నారు. ఇక్కడ ఉద్యోగాలకు అవకాశం ఉందని నేను నమ్మడం లేదు. ఇది చాలా కష్టం,” అని అన్నాడు.

“ఇది చాలా తీవ్రమైన విషం; ప్రతి ఒక్కరూ ఉద్యోగం కోసం చూస్తున్నారు.  ఎవరికీ సరైన ఉద్యోగం లభించడం లేదు. నా స్నేహితుల్లో చాలా మందికి ప్రస్తుతం ఉద్యోగం లేదు. వారు 2-3 సంవత్సరాలుగా ఇక్కడే ఉంటున్నారు,” అని క్యూలో నిలపడిన మరొక వ్యక్తి చెప్పుకొచ్చాడు.  వాస్తవానికి కెనడా ఆస్ట్రేలియా, అమెరికా, యూకేతో పాటు ఇతర దేశాల్లో పరిస్థితులు ఇంచుమించు ఇదే విధంగా ఉన్నాయి. స్టూడెంట్​ వీసా సులభంగా దొరుకుతోంది, కానీ చదువు పూర్తి చేసిన తర్వాత ఉద్యోగం దొరకడం చాలా కష్టంగా మారింది. పార్ట్​-టైమ్​ ఉద్యోగాలు కూడా కష్టంగానే దొరుకుతున్నాయి.