
భారత వైమానిక దళం 92వ వార్షికోత్సవ వేడుకలలో భాగంగా తమిళనాడులోని చెన్నై మెరీనా బీచ్ వద్ద తోక్కిసలాట జరిగింది. భారత వైమానిక దళం ఆధ్వర్యంలో ఆదివారం ప్రారంభించిన ‘మెగా ఎయిర్ షో’ ను వీక్షించేందుకు లక్షలాది సందర్శకులు పోటెత్తారు. తిరుగు ప్రయాణంలో ఎక్కడికక్కడ రద్దీ ఏర్పడటంతో వారంతా తీవ్ర ఇక్కట్లకు గురయ్యారు. ఉక్కపోత, ఎండవేడిమి తాళలేక నలుగురు సొమ్మసిల్లి ప్రాణాలు విడిచారు. మరొకరు గుండెపోటుతో మృతి చెందారు.
మరో ఇద్దరు తీవ్ర అస్వస్థతకు గురికావడంతో ఐసియులో చికిత్స అందిస్తున్నారు. దాదాపు 230 మందిని చెన్నైలోని 3 ఆసుపత్రులకు తరలించారు. వీరిలో ఎక్కువ మందిని చికిత్స అనంతరం ఇంటికి పంపారు. ఎయిర్ షోకు దాదాపు 15 లక్షల మందికి పైగా సందర్శకులు హాజరైనట్లు అంచనా. మధ్యాహ్నం ఒంటిగంటకే ప్రదర్శన ముగిసినప్పటికీ సాయంత్రం వరకు ట్రాఫిక్ కొనసాగింది. క్షతగాత్రులను అంబులెన్స్‌ల ద్వారా ఆస్పత్రులకు తరలించేందుకూ ఇబ్బంది ఎదురైంది.
చెన్నైనుంచే కాకుండా పరిసర ప్రాంతాల ప్రజలు భారీగా తరలివచ్చారు.. దీంతో మెరీనా బీచ్ సమీపంలోని లైట్‌హౌస్ మెట్రో స్టేషన్, వెళచ్చేరి వద్ద ఉన్న ఎంఆర్‌టీఎస్ రైల్వేస్టేషన్‌లు కిక్కిరిసిపో యాయి. షో ముగిసిన అనంతరం తిరుగుప్రయాణం కోసం వేలాది మంది ఒక్కసారిగా స్టేషన్‌లకు చేరుకోవడంతో.. ప్లాట్‌ఫాంలపై నిలబడేందుకూ వీల్లేని పరిస్థితి ఏర్పడింది. అన్నా స్క్వేర్‌లోని బస్‌స్టాప్‌కు సందర్శకులు పోటెత్తారు.
ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో ప్రజలు హాజరైన వైమానిక కార్యక్రమంగా ఇది లిమ్కా బుక్ రికార్డులలో స్థానం సంపాదించుకుంది. ఇరవై ఒక్క సంవత్సరాల తర్వాత జరిగిన వైమానిక సాహసాలను తిలకించేందుకు ప్రజలు కోవళం నుండి ఎన్నూరు వరకూ తూర్పు తీర రహదారి పైన, ఎత్తయిన భవనాల పైన చేరారు.
గరుడ్ కమాండో బృందం చేపట్టిన బందీల విడుదల ఆపరేషన్‌తో ఎయిర్ షో మొదలైంది.
స్క్వాడ్రన్ నాయకులు భావనా కాంత్, అవని చతుర్వేది సుఖోరు-30 ఎంకేఐని నడిపి మహిళా శక్తిని చాటారు. స్క్వాడ్రన్ లీడర్ మోహన సింగ్ హెచ్‌ఏఎల్ తేజస్ ఫైటర్ జెట్‌ను నడిపారు. శివాంగి సింగ్ రఫేల్ విమానాన్ని, ఇతర మహిళా అధికారులు మిగ్-29ను నడిపారు. నెమ్మదిగా కదిలే హెలికాప్టర్ల నుండి సూపర్ సోనిక్ ఫైటర్ జెట్ల వరకూ వివిధ రకాల విమానాలు విన్యాసాలలో పాల్గొన్నాయి. రఫేల్ సూపర్ సోనిక్ జెట్ నుండి గగనతలంలో బాణసంచా పేల్చారు.
More Stories
అస్సాం రైఫిల్స్ వాహనంపై కాల్పులు.. ఇద్దరు జవాన్లు మృతి
వాతావరణ మార్పుల ప్రభావం.. ఇక ఏటా కుండపోత వర్షాలే!
అహ్మదాబాద్‌లో విమాన ప్రమాదంపై అమెరికాలో దావా