ఎన్నికల బాండ్ల పథకం రాజ్యాంగ విరుద్ధమని కొట్టివేస్తూ రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పును తిరగదోడే ప్రసక్తే లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఆ తీర్పును సమీక్షించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్, జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ జె.బి.పార్దివాలా, జస్టిస్ బిఆర్ గవారు, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం శనివారం నిర్ద్వంద్వంగా తిరస్కరించింది.
న్యాయవాది మాథ్యూస్ నెడుంపరా, మరొకరు ఈ పిటిషన్లు వేశారు. ‘రివ్యూ పిటిషన్లను పరిశీలించిన మీదట రికార్డులో ఎలాంటి పొరపాటు లేదని కనిపిస్తుంది. సుప్రీం కోర్టు నియమావళి-2013లోని ఒకటో క్లాజ్‌లోని 47వ నిబంధన కింద తీర్పును సమీక్షించాల్సిన అవసరం లేదు. అందువల్ల రివ్యూ పిటిషన్లను తోసిపుచ్చుతున్నాం’ అని ధర్మాసనం పేర్కొంది.
అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ వర్సెస్ కేంద్ర ప్రభుత్వం కేసులో అజ్ఞాత ఎన్నికల బాండ్ల పథకానికి మార్గం సుగమం చేస్తూ ద్రవ్య చట్టం, ప్రజా ప్రాతినిధ్య చట్టం, కంపెనీల చట్టం, ఆదాయపన్ను చట్టాలకు చేసిన 2018 సవరణలు రాజ్యాంగ విరుద్ధమంటూ ఈ ఏడాది ఫిబ్రవరి 15న సుప్రీంకోర్టు కొట్టివేసింది.
రాజకీయ పార్టీలకు వచ్చే నిధులు, విరాళాలు ఎక్కడ నుండి వస్తున్నాయో తెలుసుకునే ప్రాథమిక హక్కు ఓటరుకు వుందని, ఈ పథకం ఆ హక్కును కాలరాస్తోందని కోర్టు వ్యాఖ్యానించింది. ఎన్నికల బాండ్లు జారీ చేసే భారతీయ స్టేట్‌బ్యాంక్ వెంటనే బాండ్ల కొనుగోలుదారులు, తీసుకున్నవారి వివరాలను వెల్లడించాలని కూడా కోర్టు ఆదేశించింది.
ఎన్నికల బాండ్ల పథకంను సవాల్ చేస్తూ సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరితో పాటు పలువురు సుప్రీం కోర్టును ఆనాడు ఆశ్రయించారు. దీనిపై విచారించిన సుప్రీంకోర్టు, రాజ్యాంగ ధర్మాసనానికి రిఫర్ చేసింది. రాజ్యాంగ ధర్మాసనం సుదీర్ఘంగా విచారించిన తర్వాత 2024 ఫిబ్రవరి 15న తీర్పు ఇచ్చింది.
ఎలక్టోరల్ బాండ్ల పథకం సమాచార హక్కును ఉల్లంఘించిందని, తద్వారా రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(ఎ) ప్రకారం స్వేచ్ఛగా మాట్లాడే, భావవ్యక్తీకరణ హక్కును దెబ్బతీస్తుందని కోర్టు పేర్కొంది. రాజకీయ పార్టీలకు విరాళాలు గోప్యంగా ఇవ్వడానికి అనుమతించడంతో పారదర్శకత లోపిస్తుందని స్పష్టం చేసింది. ఈ పథకాన్ని రద్దు చేస్తున్నట్లు తీర్పులో పేర్కొంది. అనంతరం తీర్పుపై సుప్రీం కోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలైంది. ఈ రివ్యూ పిటిషన్‌ను రాజ్యాంగ ధర్మాసనం కొట్టివేసింది.

More Stories
రష్యా చమురు కంపెనీలపై ట్రంప్ ఆంక్షలతో భారత్ కు ముప్పు?
త్రివిధ దళాలకు రూ.79 వేల కోట్ల రక్షణ కొనుగోళ్లు
మెహుల్ చోక్సీ అప్పగింతలో అడ్డంకులు లేవన్న బెల్జియం కోర్టు