కాంగ్రెస్‌ అర్బన్ నక్సల్స్ నడుపుతున్న పార్టీ

కాంగ్రెస్‌ అర్బన్ నక్సల్స్ నడుపుతున్న పార్టీ

కాంగ్రెస్‌ పార్టీని అర్బన్ నక్సల్స్ ముఠా నడుపుతోందని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ప్రమాదకరమైన ఎజెండాను ఓడించేందుకు ప్రజలు ఏకం కావాలని ఆయన కోరారు. మహారాష్ట్ర వాషిమ్ జిల్లాలో వివిధ ప్రాజెక్ట్‌లు ప్రారంభించిన మోదీ, అనంతరం నిర్వహించిన ర్యాలీలో మాట్లాడుతూ కాంగ్రెస్‌పై విమర్శల వర్షం కురిపించారు.

“మనమంతా ఏకమైతే, దేశాన్ని విభజించాలనే వారి ఎజెండా విఫలమవుతుందని కాంగ్రెస్ భయపడుతోంది. భారతదేశం పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి లేని వ్యక్తులతో కాంగ్రెస్ ఎంత సన్నిహితంగా ఉంటోందో ప్రజలు అందరూ చూడగలరు” అని మోదీ పేర్కొన్నారు.

‘ఇటీవల డిల్లీలో వేల కోట్ల రూపాయల విలువైన మాదక ద్రవ్యాలు (డ్రగ్స్‌) పట్టుబడ్డాయి. ఇవి ఓ కాంగ్రెస్ నేతవి అని అనుమానిస్తున్నారు. యువతను డ్రగ్స్‌ వైపు మళ్లించి, ఆ డబ్బుతో ఎన్నికల్లో పోటీ చేయాలని కాంగ్రెస్ భావిస్తోంది’ అని ప్రధాని మోదీ ఆరోపించారు. కాంగ్రెస్ ఆలోచనలు విదేశీ వలసపాలకుల మాదిరిగానే ఉన్నాయని మోదీ ధ్వజమెత్తారు.

‘బ్రిటీష్ పాలన మాదిరిగానే కాంగ్రెస్‌ కుటుంబం కూడా దళితులు, గిరిజనులు, వెనుకబడిన వర్గాల వారిని ఇతరులతో సమానంగా చూడదని ఆరోపించారు. భారతదేశాన్ని కేవలం ఒక కుటుంబం మాత్రమే పాలించాలని కాంగ్రెస్ భావిస్తోంది. అందుకే బంజారా వర్గాన్ని కించపరిచే వైఖరిని వాళ్లు ఎప్పుడూ కొనసాగిస్తూ వస్తున్నారు’ అని మోదీ తెలిపారు.

వ్యవసాయం, పశుసంవర్ధక రంగాలకు సంబంధించి రూ.23,000 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రధాని మోదీ వాషిమ్‌లో ప్రారంభించారు. అంతకు ముందు బంజారా ప్రజల గొప్ప వారసత్వాన్ని తెలిపే, బంజారా విరాసత్ మ్యూజియంను ఆరంభించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో కిసాన్‌ సమ్మాన్‌ నిధి 18వ విడతలో భాగంగా రూ.20వేల కోట్లను దాదాపు 9.4 కోట్ల మంది రైతులకు పంపిణీ చేశారు. నమో షెత్కారీ మహాసమ్మాన్ నిధి యోజన 5 విడతలో భాగంగా రూ.2000 కోట్లను పంపిణీ చేశారు.

అగ్రికల్చర్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఫండ్ (ఏఐఎఫ్‌) కింద రూ.1,920 కోట్ల విలువైన 7500కు పైగా ప్రాజెక్ట్‌లను ప్రధాని మోదీ ప్రారంభించారు. వీటిలో కస్టమ్ హైరింగ్ సెంటర్లు, ప్రైమరీ ప్రాసెసింగ్ యూనిట్లు, గిడ్డంగులు, సార్టింగ్ అండ్ గ్రేడింగ్ యూనిట్లు, కోల్డ్ స్టోరేజ్ ప్రాజెక్ట్‌లు, పోస్ట్‌-హార్వెస్ట్ మేనేజ్‌మెంట్ ప్రాజెక్టులు ఉన్నాయి. 

అలాగే దాదాపు రూ.1300 కోట్ల టర్నోవర్‌ సామర్థ్యం కలిగిన 9200 ఫార్మర్‌ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ (ఎఫ్‌పీఓ)లను కూడా ప్రధాని మోదీ ప్రారంభించారు. ముఖ్యమంత్రి సౌర్ కృషి వాహిని యోజన 2.0 కింద మహారాష్ట్ర వ్యాప్తంగా 19 మెగావాట్ల సామర్థ్యం కలిగిన 5 సోలార్‌ పార్క్‌లను ప్రధాని ఆరంభించారు.