
సనాతన ధర్మ పరిరక్షణకు ఒక బలమైన చట్టం అవసరం అని, దేశమంతా అమలయ్యేలా వెంటనే ఒక చట్టం తేవాలని చెబుతూ చట్టం అమలుకు సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేయాలని జనసేన అధినేత, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిలుపిచ్చారు. సనాతన ధర్మ పరిరక్షణ బోర్డుకు ఏటా నిధులు కేటాయించాలని కోరారు.
తిరుపతి బాలాజీ కాలనీలోని జ్యోతిరావు పూలే కూడలి వద్ద పవన్ కల్యాణ్ వారాహి బహిరంగ సభలో వారాహి డిక్లరేషన్ అంశాలని గురువారం సాయంత్రం వెల్లడిస్తూ సనాతన ధర్మానికి హాని తలపెట్టేవారు జాగ్రత్తగా ఉండాలని పవన్ హెచ్చరించారు. సనాతన ధర్మం పేరుతో మనం జీవం కోల్పోయామని చెబుతూ ధైర్యం, వీరత్వమే సమాజ వికాసానికి మూలమని పేర్కొన్నారు.
సెక్యులరిజం అనే పేరుతో హిందువుల నోరు నొక్కేస్తున్నారన్న పవన్, సనాతన ధర్మాన్ని సూడో సెక్యులరిస్టులు విమర్శిస్తున్నారని మండిపడ్డారు. సనాతన ధర్మం, హిందూ దేవుళ్లను విమర్శించేవారు ఎక్కువయ్యారని, ఇస్లాం దేశాల మాటలు సూడో సెక్యులరిస్టులకు వినపడవని ధ్వజమెత్తారు. బంగ్లాదేశ్ ఇస్లాం రాజ్యంగా ప్రకటించుకున్నా ఎవరూ మాట్లాడరని, మనం పళ్ల బిగువున బాధను భరించాలా అని ధ్వజమెత్తారు.
మన సమాజంలో ఐక్యత లేకపోవడమే దీనికి కారణమన్న పవన్, హిందూ సమాజాన్ని కులాలు, ప్రాంతాల వారీగా విభజించారనితెలిపారు. హిందువులంతా ఏకమయ్యే సమయం వచ్చిందన్న పవన్, మన మతం గురించి మాట్లాడుకోవాలంటేనే భయపడే పరిస్థితికి వచ్చామని ఆవేదన వ్యక్తం చేశారు. సనాతన ధర్మానికి రంగు, వివక్ష లేదని, మెకాలే తీసుకువచ్చిన వివక్ష ఇదంతా అని పేర్కొన్నారు.
ప్రసాదాల్లో వాడే వస్తువుల నాణ్యతను ధ్రువీకరించే విధానం తేవాలని చెబుతూ మన దేవాలయాలు విద్య, కళలు, ఆర్థిక కేంద్రాలుగా విలసిల్లాయని, మన ఆలయాలు పర్యావరణ పరిరక్షణ, సంక్షేమ కేంద్రాలుగా మారాలని పవన్ తెలిపారు. హిందువుగా సనాతన ధర్మాన్ని తాను ఆరాధిస్తానని, మిగతా మతాలను గౌరవిస్తానని స్పష్టం చేశారు.
భిన్నత్వంలో ఏకత్వం చూపేది, ఇతర మతాలను గౌరవించేది సనాతన ధర్మమని పవన్ తెలిపారు. సనాతన ధర్మం మనుషులు ఒక్కరే సుఖంగా ఉండాలని మాత్రమే కోరుకోలేదని, ప్రకృతిలో ఉన్న ప్రతి జీవి సుఖంగా ఉండాలని కోరుకుంటుందని వెల్లడించారు. ధర్మానికి ప్రతిరూపం శ్రీరాముడు అని, కలియుగంలో ధర్మానికి ప్రతిరూపం వేంకటేశ్వరస్వామి పేర్కొన్నారు.
సనాతన ధర్మంపై దాడి జరిగితే ఒక్కరూ మాట్లాడరని, మిగతా మతాలపై దాడి జరిగితే ప్రముఖులంతా మాట్లాడతారని మండిపడ్డారు. హిందూ సమాజంపై దాడి తప్పని తెలిసి కూడా మాట్లాడరని, తప్పులు జరుగుతుంటే ఎన్నాళ్లు ఊరుకుంటామని ధ్వజమెత్తారు.
సనాతన ధర్మంపై దాడి జరిగితే మౌనంగా ఊరుకోవాలా అని ప్రశ్నించారు. అన్ని మతాలు పరస్పరం గౌరవించుకోవడమే లౌకికవాదానికి అసలైన అర్థమని, మా ఆవేదన, బాధ, ఇబ్బందులు మాత్రమే చెబుతున్నామని తెలిపారు. ఆలయాలపై దాడులు చేసిన వారిపై మీరు తీసుకున్న చర్యలు ఏమిటని వైఎస్సార్సీని ప్రశ్నించారు.
సనాతన ధర్మాన్ని ముట్టుకున్నవారు ఎవరైనా మాడి మసైపోతారని పవన్ హెచ్చరించారు. సనాతన ధర్మాన్ని నాశనం చేయడం ఎప్పటికీ సాధ్యం కాదని, సనాతన ధర్మాన్ని నాశనం చేయడం హిమాద్రిని తుపాకీతో పేల్చడం లాంటిదని తెలిపారు. ఎందరు రాక్షసులు అడ్డుపడినా సనాతన ధర్మానికి ఏమీకాదని గుర్తు చేశారు.
సనాతన ధర్మాన్ని మనమే రక్షించుకుందామని పిలుపునిచ్చారు. ఇతర మతాలను గౌరవిద్దామని, సనాతన ధర్మంపై దాడి జరిగినా, అపహాస్యం చేసినా తిరగబడదామని స్పష్టం చేశారు. సనాతన ధర్మాన్ని దూషిస్తే ప్రాణాలు ఒడ్డయినా రక్షించుకుందామని పేర్కొన్నారు.
More Stories
ఢిల్లీ యూనివర్సిటీ ఎన్నికల్లో ఎబివిపి ఘన విజయం
బీహార్ లో ఎన్డీఏ – మహాఘట్ బంధన్ నువ్వా నేనా?
హిండెన్‌బర్గ్ ఆరోపణలపై అదానీకి సెబీ క్లీన్చిట్