
మహారాష్ట్రలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. మహారాష్ట్ర సచివాలయం పైనుంచి అధికార కూటమి శాసనసభ్యులు కిందకు దూకడం కలకలం రేపింది. గిరిజన తెగకు సంబంధించి రిజర్వేషన్ విషయంలో నిరసన తెలుపుతూ అజిత్ పవార్ వర్గానికి చెందిన డిప్యూటీ స్పీకర్ నరహరి ఝిర్వాల్ సహా పలువురు ఎమ్మెల్యేలు భవనంపై నుంచి శుక్రవారం మధ్యాహ్నం ఒక్కసారిగా కిందకు దూకేశారు.
అయితే ఇలాంటి ఘటనలను అడ్డుకునేందుకు ఇప్పటికే అధికారులు ఏర్పాటు చేసిన సేఫ్టీ నెట్లో పడి వారు చిక్కుకుపోయారు. వారందరినీ పోలీసులు సురక్షితంగా కిందకు తీసుకొచ్చారు. ఈ పరిణామాలతో సచివాలయ ప్రాంగణంలో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
గిరిజన తెగ అయిన ధంగర్ కమ్యూనిటీని షెడ్యూల్డ్ తెగ (ఎస్టీ) రిజర్వేషన్ కేటగిరీలోకి చేరుస్తూ షిండే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే, ప్రభుత్వ నిర్ణయాన్ని గిరిజన ప్రజాప్రతినిధులు సహా పలువురు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇందుకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నారు. ఈ రిజర్వేషన్ విషయంలో నిరసన తెలుపుతూ నరహరి ఈ చర్యకు పాల్పడినట్లు సచివాలయం వర్గాలు వెల్లడించాయి.
దీన్ని వ్యతిరేకిస్తూ ఆదివాసీ వర్గానికి చెందిన ఎన్సీపీ ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్ నరహరి ఝిర్వాల్‌తో పాటు బీజేపీ ఎంపీ హేమంత్ సావ్రా, ఎమ్మెల్యేలు కిరణ్ లహమాటే, హిరామన్ ఖోస్కర్, రాజేష్ పాటిల్ నిరసన చేపట్టారు. సచివాలయంలోని మూడో అంతస్తు నుంచి ఒక్కసారిగా కిందకు దూకారు. అనంతరం ఎమ్మెల్యేలు అంతా సచివాలయం ముందు బైఠాయించి ఆందోళన కొనసాగించారు.
ధన్‌గఢ్ కమ్యూనిటీ సభ్యుల అభివృద్ధికి ప్రభుత్వం వివిధ పథకాలను ప్రకటించడంలో తమకు ఎలాంటి సమస్యలు లేవని, అయితే వారిని ఎస్టీ జాబితాలో చేర్చడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని ఝిర్వాల్ తెలిపారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకునే వరకు మంత్రాలయం (సచివాలయం) వద్దే ధర్నా కొనసాగిస్తామని చెప్పారు.
పంచాయతీల (ఎక్స్‌టెన్షన్ టు షెడ్యూల్డ్ ఏరియాస్-పీఈఎస్ఏ) చట్టం 1996 కింద గిరిజనులను ప్రభుత్వ ఉద్యోగాల్లో నియమించాలని గిరిజన ఎమ్మెల్యేలు నిరసన తెలుపుతున్నారు. పీఈఎస్ఏలో రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలో అక్టోబర్ 2023 నుంచి 17 వివిధ కేటగిరీల్లో గిరిజనుల రిక్రూట్‌మెంట్ ప్రక్రియను నిలిపి వేశారని వారు తెలిపారు.
రెవెన్యూ, ఆరోగ్య శాఖ సహా పలు శాఖల్లో టీచర్లు, ఫారెస్ట్ గార్డు, ఇతర పోస్టులకు రిక్రూట్‌మెంట్ జరుపుతున్నారని, గిరిజనేతరులు ఉద్యోగాల్లో చేరడం, నియామక పత్రాలు అందుకోవడం జరిగినా, పీఈఎస్‌లో రిజర్వ్‌డ్ పోస్టులను ఇంతవరకూ రిక్రూట్ చేయలేదని వారన్నారు. పీఈసీఏ కింద షెడ్యూల్డ్ ట్రైబ్ అభ్యర్థులను నియామకాల సస్పెండ్‌కు వ్యతిరేకంగా, ఎస్సీ జాబితాలో ధాంగర్స్‌ను చేర్చడాన్ని నిరసిస్తూ వీరంతా ఆందోళనకు దిగారు.
More Stories
హిందుస్తానీ సంగీతకారుడు పండిట్ చన్నులాల్ మిశ్రా మృతి
గాంధీజీ శాంతి, సహనం, సత్యం సందేశం మానవాళికి ప్రేరణ
సుంకాల యుద్ధం మధ్య స్వదేశీ, స్వావలంబనలకై భగవత్ పిలుపు