ఖైదీలలో కుల‌వివ‌క్ష పట్ల సుప్రీంకోర్టు ఆగ్రహం

ఖైదీలలో కుల‌వివ‌క్ష పట్ల సుప్రీంకోర్టు ఆగ్రహం
జైళ్ల‌లో జ‌రుగుతున్న కుల వివ‌క్ష ప‌ట్ల సుప్రీంకోర్టు ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. ఖైదీల‌ను కుల‌వివ‌క్ష ఆధారంగా వేరుగా చూడ‌రాద‌ని కోర్టు చెప్పింది. అన్ని కులాల‌కు చెందిన ఖైదీల‌ను మాన‌వ‌త్వంతో, స‌మానంగా చూడాల‌ని కోర్టు తెలిపింది.  కొన్ని రాష్ట్రాల్లో కులం ఆధారంగా ఖైదీలకు పనుల అప్పగింత, జైలులో గదుల కేటాయింపునకు సంబంధించిన నిబంధనలను తప్పుబట్టింది.
అభ్యంతరకరంగా ఉన్న నిబంధనలను మూడు నెలల్లో మార్చాలని పలు రాష్ట్రాలకు సూచించింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ సారథ్యంలోని ధర్మాసనం గురువారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.  కులం ఆధారంగా ఊడ్చడం, శుభ్రం చేయడం వంటి పనులను అట్టడుగు వర్గాలకు అప్పగించడం, వంట చేయడం లాంటి పనులను అగ్ర వర్ణాలకు అప్పగించడం అంటే అది ఆర్టికల్‌ 15ను అతిక్రమించడమేనని వ్యాఖ్యానించింది సుప్రీంకోర్టు. అలాంటి పనులు విభజనకు దారి తీస్తాయని పేర్కొంది. అందరికీ పని విషయంలో సమాన హక్కు కల్పించాలని పేర్కొంది. 
 
ప్రమాదకరంగా ఉన్న మురుగునీటి ట్యాంకులను శుభ్రం చేసే పనులకు ఖైదీలను అనుమతించకూడదని సూచించింది. ఓ ప్రత్యేక కులం వారిని స్వీపర్లుగా ఎంపిక చేయటం సమానత్వ హక్కుకు వ్యతిరేకమని ధర్మాసనం స్పష్టం చేసింది. జైళ్లలో కుల ఆధారిత వివక్ష, విభజన ఉందని ఆరోపిస్తూ మహారాష్ట్రలోని కల్యాణ్​కు చెందిన సుకన్య శాంత సుప్రీం కోర్టులో పిటిషన్​ దాఖలు చేశారు. 
 
దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం ఈ ఏడాది జనవరిలోనే కేంద్రంతో పాటు ఉత్తర్​ప్రదేశ్​, బంగాల్​ సహా 11 రాష్ట్రాలకు నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు స్పందించిన ఆయా రాష్ట్రాలు ఖైదీలకు కులం ఆధారంగానే పనులు ఇవ్వడం, జైలులో గదులను కేటాయిస్తున్నట్లు పేర్కొన్నాయి. దీనిపై స్పందించిన సుప్రీం కోర్టు ఇలా చేయడం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంది. జైలు మాన్యువల్స్​లో ఉన్న ఇలాంటి అభ్యంతరకర నిబంధలను సవరించాలని ఆయా రాష్ట్రాలను ఆదేశించింది.