హెచ్‌సీఏలో రూ. 20 కోట్ల మోసం.. అజారుద్దీన్‌కు ఈడీ స‌మ‌న్లు

హెచ్‌సీఏలో రూ. 20 కోట్ల మోసం.. అజారుద్దీన్‌కు ఈడీ స‌మ‌న్లు
హైద‌రాబాద్ క్రికెట్ సంఘంతో లింకున్న మ‌నీల్యాండ‌రింగ్ కేసులో మాజీ క్రికెట‌ర్ అజారుద్దీన్‌ కు గురువారం ఈడీ నోటీసులు జారీ చేసింది. 2020 నుంచి 2023 వరకు హెచ్‌సీఏలో జరిగిన అక్రమాలపై ఉప్పల్ పోలీస్ స్టేషన్ లో పలు ఫిర్యాదులు ఉన్నాయి. ఆ స‌మ‌యంలో హెచ్‌సీఏ అధ్య‌క్షుడిగా అజార్ ప‌నిచేశారు. 
క్రికెట్ బాల్స్, బకెట్ చైర్స్, జిమ్ పరికరాలకు కొనుగోళ్లలో అక్రమాలు జ‌రిగిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఉప్పల్లో నమోదైన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈసీఆర్ నమోదు చేసింది ఈడి.
ఈ విషయమై గత నవంబర్ లో అజారుద్దీన్ బెయిల్ పొందారు. అయితే తాజాగా విచారణ చేపట్టాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేసింది.  భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ కెప్టెన్, మాజీ ఎంపీ, ప్ర‌స్తుత తెలంగాణ కాంగ్రెస్ క‌మిటీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ అయిన అజారుద్దీన్‌ గురువారం ఈడీ ముందు హాజ‌రుకావాల‌ని ఆదేశాలు జారీ చేశారు. హెచ్‌సీఏలో రూ. 20 కోట్ల మోసం జ‌రిగిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఆ కేసులో ఈడీ విచార‌ణ చేప‌డుతున్న‌ది.
ఇదే కేసులో మాజీ క్రికెట‌ర్లు అర్ష‌ద్ అయూబ్‌, శివ‌లాల్ యాద‌వ్‌ల‌ను గ‌త డిసెంబ‌ర్‌లో విచారించారు. హెచ్‌సీఏ కేసులో మాజీ మంత్రి, హెచ్‌సీఏ మాజీ అధ్య‌క్షుడు జీ వినోద్‌ను కూడా ఈడీ ప్ర‌శ్నించింది. గ‌త ఏడాది న‌వంబ‌ర్‌లో వినోద్‌, శివ‌లాల్ యాద‌వ్‌, అర్ష‌ద్ అయూబ్ ఇండ్ల‌ల్లో ఈడీ సోదాలు కూడా చేప‌ట్టింది. మ‌నీల్యాండ‌రింగ్ చ‌ట్టం కింద 9 ప్ర‌దేశాల్లో త‌నిఖీలు జ‌రిగాయి.

నిధుల మళ్లింపు జరిగిందని భావించిన హెచ్‌సీఏ విచారణకు ఆదేశించింది. ఈ మేరకు ఫోరెన్సిక్ ఆడిట్ మార్చి 2020 నుంచి ఫిబ్రవరి 2023 వరకు దర్యాప్తు చేపట్టింది. నిధుల దుర్వినియోగం, ప్రైవేట్ ఏజెన్సీలకు నగదు మళ్లింపు జరిగినట్లు గుర్తించింది. దర్యాప్తు అనంతరం హెచ్‌సీఏ సీఈవో సునీల్ కాంటే బోస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఏసీబీ న‌మోదు చేసిన మూడు ఎఫ్ఐఆర్‌ల ఆధారంగా ఈడీ విచార‌ణ మొద‌లుపెట్టింది. ఉప్ప‌ల్ స్టేడియం కోసం డీజీ సెట్లు, ఫైర్‌ఫైటింగ్ సిస్ట‌మ్స్‌, కెనోపీల ఖ‌రీదులో అక్ర‌మాలు జ‌రిగిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. గ‌త ఏడాది అక్టోబ‌ర్‌లో అజారుద్దీన్‌పై నాలుగు క్రిమిన‌ల్ కేసులు న‌మోదు అయ్యాయి. సుమారు రూ. 3.85 కోట్ల నిధుల్ని దుర్వినియోగం చేసిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఉప్ప‌ల్ పోలీసు స్టేష‌న్‌లో ఆ కేసులు బుక్ చేశారు. చీటింగ్‌, ఫోర్జ‌రీ, నేర‌పూరిత కుట్ర కింద అజార్‌పై కేసులు పెట్టారు. 

హెచ్‌సీఏకు చెందిన నాలుగు కేసుల్లోనూ గ‌తంలో సిటీ కోర్టు అజార్‌కు బెయిల్ మంజూరీ చేసింది. 2019లో హెచ్‌సీఏ అధ్య‌క్షుడిగా అజార్ ఎన్నిక‌య్యారు. ఆయ‌న 2023 ఫిబ్ర‌వ‌రి వ‌ర‌కు ఆ బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించారు. కాగా, తనపై నమోదైన కేసును రాజకీయ ప్రేరేపిత కుట్రగా అజారుద్దీన్ అభివర్ణించారు. తన ప్రతిష్టను దెబ్బతీయడానికి ప్రత్యర్థులు కుట్రపన్నారని ఆరోపించారు. దీనిపై న్యాయపోరాటం చేస్తానని తెలిపారు.