హైదరాబాద్‌లో గనులశాఖ మాజీ డైరెక్టర్‌ వెంకటరెడ్డి అరెస్ట్

హైదరాబాద్‌లో గనులశాఖ మాజీ డైరెక్టర్‌ వెంకటరెడ్డి అరెస్ట్
వైఎస్సార్‌‌సీపీ ప్రభుత్వ హయాంలో గనులశాఖ డైరెక్టర్‌గా పనిచేసిన వెంకటరెడ్డిని ఏసీబీ అధికారులు  హైదరాబాద్‌లో గురువారం రాత్రి 9.30 గంటలకు అదుపులోకి తీసుకున్నారు. ఆయన్ను హైదరాబాద్ నుంచి విజయవాడకు తరలించారు.  ఈ నెల 11న గనుల శాఖాధికారుల ఫిర్యాదుతో వెంకటరెడ్డిపై ఏసీబీ కేసు నమోదు చేసింది.
అవినీతి నిరోధక చట్టం, మైన్స్‌ అండ్‌ మినరల్స్‌ చట్టంలోని సెక్షన్లతో పాటు ఐపీసీలోని నేరపూరిత మోసం,నేరపూరిత కుట్ర తదితర సెక్షన్ల కింద అభియోగాలు ఉన్నాయి.  వెంకట రెడ్డి చర్యలు వలన ప్రభుత్వానికి  రూ. 2,566 కోట్ల మేర ఆదాయానికి గండి పండిందని అధికారులు పేర్కొన్నారు. కడప జిల్లాకు చెందిన వెంకటరెడ్డి ఇండియన్‌ కోస్ట్‌గార్డ్‌లో సీనియర్‌ సివిలియన్‌ స్టాఫ్‌ ఆఫీసర్ కాగా రాష్ట్రంలో 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఇక్కడ అడుగు పెట్టారు. 
 
పంచభూతాల్లో ఒకటైన ఇసుక, మైనింగ్‌ జగన్‌ అనుయాయులకు దోచిపెట్టారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇసుక టెండర్లు పాడుకున్న జేపీ వెంచర్స్‌తో కుమ్మక్కై రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు రూ. 800కోట్లు ప్రత్యక్షంగా నష్టం చేకూర్చారని ప్రభుత్వం ట్లేచింది. బయటికి కనిపించకుండా వేలకోట్ల రూపాయల సంపద దోపిడీకి సహకరించారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
 
ఇప్పటికే ప్రభుత్వం ఆయనను సస్పెండ్ చేసింది. ప్రభుత్వం మారినప్పటి నుండి కనిపించక పోయిన ఆయన కోసం కడప, తిరుపతి, విజయవాడలతోపాటు పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు ప్రాంతాల్లో ఎసిబి బృందాలు గాలించాయి.  ప్రభుత్వం మారగానే విదేశాలకు పారిపోయినట్లు వార్తలు రావడంతో ఆదిశగా ఏసీబీ నిఘా పెట్టింది. 
 
ఇదే సమయంలో వెంకట రెడ్డి ముందస్తు బెయిల్‌ కోసం ప్రయత్నించగా అప్రమత్తమైన ఏసీబీ ఆయనకు బెయిల్‌ రాకుండా అడ్డుపడింది. దిక్కుతోచని వెంకట రెడ్డి మధ్యవర్తుల ద్వారా ఏసీబీ అధికారులను సంప్రదించినట్లు సమాచారం. 
 
 కాగా మాజీ సీఎం జగన్ అండతో గనులశాఖను సొంత సామ్రాజ్యంగా మలుచుకున్న అప్పటి డైరెక్టర్ వెంకట్ రెడ్డిపై కుట్ర, అవినీతి, దోపిడీ కేసులో తొలి నిందితుడు ఏ1గా వెంకట్ రెడ్డి పేరును చేర్చింది. మరో ముగ్గిరిపై కూడా కేసు నమోదైంది. వారిలో గనులశాఖలో మరో కీలక అధికారి పేరు ఉన్నట్లు సమాచారం.