సీబీఐకి ఇచ్చిన సమ్మతి కర్ణాటక ఉపసంహరణ

సీబీఐకి ఇచ్చిన సమ్మతి కర్ణాటక ఉపసంహరణ
సిద్ధరామయ్య నేతృత్వంలోని కర్ణాటక సర్కారు సీబీఐ దర్యాప్తునకు ఇచ్చిన సమ్మతిని సర్కారు ఉపసంహరించుకున్నది. ఈ విషయాన్ని రాష్ట్ర న్యాయశాఖ మంత్రి హెచ్‌కే పాటిల్‌ వెల్లడించారు. ఇకపై రాష్ట్ర ప్రభుత్వం అనుమతి లేకుండా విచారణ జరిపేందుకు సీబీఐ అవకాశం ఉండదు. సీబీఐకి ఇచ్చిన సమ్మతిని వెనక్కి తీసుకున్నట్లు పాటిల్‌ ప్రటించారు.

రాష్ట్రంలో సీబీఐ దుర్వినియోగంపై ఆందోళన వ్యక్తం చేశారు. అన్ని కేసులను సీబీఐకి రిఫర్ చేశామని, ఛార్జిషీట్లు దాఖలు చేయడం లేదని ఆరోపించారు. చాలా కేసులు పెండింగ్‌లో ఉన్నాయనిచెబుతూ  తాము పంపిన చాలా కేసులను విచారించేందుకు సైతం సీబీఐ నిరాకరించిందనితెలిపా రు. ఇందుకు లెక్కలేనన్ని ఉదాహారణలు ఉన్నాయని పేర్కొన్నారు.

సీబీఐ పక్షపాతంతో వ్యవహరిస్తుందని, దాంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని స్పష్టంచేశారు. ముడా స్కామ్ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోలేదని, తప్పుదారి పట్టకుండా కాపాడేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ఢిల్లీ పోలీస్‌ ఎస్టాబ్లిస్‌మెంట్‌ చట్టం 1946లోని సెక్షన్‌-6 ప్రకారం సీబీఐ దర్యాప్తు చేసేందుకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాల అనుమతి అవసరం ఉంటుంది. 

డీఎస్‌ఈపీ చట్టంలోని సెక్షన్‌-6 ప్రకారమే సీబీఐ ఏర్పాటైంది. దాంతో రాష్ట్రాల అనుమతి లేకుండా సీబీఐ విచారణ చేపట్టలేదు. వాస్తవానికి కాంగ్రెస్‌ సహా పలు పార్టీలు కేంద్ర దర్యాప్తు సంస్థలపై ఇప్పటికే విమర్శలు గుప్పిస్తున్నాయి. సీబీఐ, ఈడీ, ఆదాయపు పన్నులశాఖల పనితీరుపై ప్రతిపక్షాలు సందేహాలు లేవనెత్తాయి.

కేంద్రంలోని అధికార బీజేపీ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తోందని ఆరోపిస్తున్నాయి. ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలను వేధించేందుకే దర్యాప్తు సంస్థలను ప్రయోగిస్తున్నారని పార్టీలు మండిపడుతున్నాయి. పంజాబ్‌, జార్ఖండ్‌, కేరళ, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌, పశ్చిమ బెంగాల్‌, మిజోరాం, తెలంగాణ, మేఘాలయ, తమిళనాడు రాష్ట్రాలు సీబీఐకి ఇచ్చిన అనుమతిని ఉపసంహరించుకున్నాయి. 

ఈ విషయాన్ని కేంద్ర సహాయశాఖ మంత్రి జితేంద్ర సింగ్‌ లోక్‌సభలో ఓ ప్రశ్నకు లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. ప్రస్తుతం మైసూర్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ కుంభకోణంలో సీఎం సిద్ధరామయ్య తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. 

ఆరోపణలపై విచారణ జరిపేందుకు గవర్నర్‌ తావర్‌చంద్‌ గెహ్లాట్‌ అనుమతి ఇవ్వగా, దీన్ని సవాల్‌ చేస్తూ సీఎం దాఖలు చేసిన పిటిషన్‌ హైకోర్టు కొట్టివేసింది. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్‌ 17ఎ కింద దర్యాప్తునకు అనుమతి ఇస్తూ బీఎన్‌ఎస్‌ఎస్ 2023లోని సెక్షన్‌ 218 ప్రకారం ప్రాసిక్యూషన్‌కు గవర్నర్‌ అనుమతి ఇవ్వడాన్ని సవాల్‌ చేశారు.