హిందువుల మీద దాడి జరిగితే మాత్రమే మాట్లాడకూడదా?

హిందువుల మీద దాడి జరిగితే మాత్రమే మాట్లాడకూడదా?
 
* తిరుపతి నెయ్యి వివాదంపై ప్రకాష్ రాజ్ వాఖ్యలపై పవన్ ఆగ్రహం
 
తిరుమల నెయ్య వివాదంపై నటుడు ప్రకాష్‌ రాజ్‌ వ్యాఖ్యలపై జనసేన అధ్యక్షుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడ దుర్గగుడిలో ప్రాయశ్చిత్త పూజలు నిర్వహించిన పవన్ కళ్యాణ్‌ హిందువుల మీద దాడి జరిగితే మాత్రమే మాట్లాడకూడదా? అంటూ ప్రశ్నించారు. నెయ్యి వివాదంలో ఇటీవల ప్రకాష్‌ రాజ్ మాట్లాడారని చెబుతూ తాను హిందువుల విషయం గురించి మాట్లాడితే నటుడు ప్రకాష్‌రాజ్‌ అభ్యంతరం ఏమిటని విస్మయం వ్యక్తం చేశారు. తాను ఏ మతాన్ని తాను నిందించలేదని, దీనిని కూడా తాను గోల చేస్తున్నానని అనడం ఏమిటని ఆయన నిలదీశారు.

దేవతా విగ్రహాలు శిరచ్ఛేదం చేస్తే మాట్లాడకూడదా? అని ప్రశ్నించారు. ప్రకాష్‌ రాజ్‌ అంటే తనకు గౌరవం ఉందని, అయితే, సెక్యులరిజం అంటే రెండు విధాలని ఆయన గుర్తించాలని అంటూ హిందువుల మీద దాడి జరిగితే మాత్రమే మాట్లాడకూడదా? అని ప్రశ్నించారు. ముస్లింలు, మదర్సాల మీద తనకు ఎప్పడూ గౌరవం ఉందని, వాటికి లక్షల కొద్ది విరాళాలు ఇచ్చానని గుర్తు చేశారు.

మిషనరీ స్కూల్లోనే చదువుకున్నానని, వారి మీద తనకు ఎప్పుడు గౌరవం ఉంటుందని చెబుతూ తనను తాను తగ్గించకున్న వాడు హెచ్చింపబడతారనే దానిని నమ్ముతానని, అయితే తాను పాటించే ధర్మానికి అన్యాయం జరిగితే తాను మాట్లాడటంలో తప్పేమితో ప్రకాష్‌ రాజ్‌ తెలుసుకోవాలని ఆయన హితవు చెప్పారు.

ప్రకాష్‌ రాజ్‌ మాత్రమే కాదు సెక్యులరిజం గురించి మాట్లాడే వాళ్లంతా తెలుసుకోవాలని పవన్ కళ్యాణ్ తెలిపారు. హిందువులుగా తాము తీవ్రంగా ఆవేదనలో ఉన్నామని మర్చిపోవద్దని అంటూ మాట్లాడేముందు వంద సార్లు ఆలోచించుకోవాలని సూచంచారు. అయ్యప్ప స్వామి, సరస్వతి దేవిలపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారని.. అల్లా మీద, మహ్మద్ ప్రవక్త మీద, జీసస్ మీద మాట్లాడగలరా? అని ప్రశ్నించారు.

తమ దేవుళ్లపై మాట్లాడితే మా మనోభావాలు దెబ్బతినవా? అని నిలదీశారు. ప్రతి సగటు హిందువు తాలుకా ధర్మమని, ఇదే ఇస్లాం మీద దాడి జరిగితే ఏమి చేస్తారని పవన్ కళ్యాణ్‌ ప్రశ్నించారు. ధర్మాన్ని పరిరక్షించడం తన ఒక్కడి బాధ్యత కాదని అన్ని పార్టీల్లో ఉన్న వారు సనాతన ధర్మ పరిరక్షణకు కట్టుబడి ఉండాలని స్పష్టం చేశారు.

కాగా, తిరుమల లడ్డూలో కల్తీ నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్ష కొనసాగుతోంది. దీనిలో భాగంగా విజయవాడ ఇంద్రకీలాద్రిలో  దుర్గమ్మ సన్నిధిలో మెట్లను పవన్‌ కల్యాణ్‌ శుభ్రం చేశారు. ఆ తర్వాత మెట్లకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య మెట్ల పూజ చేశారు.