యుద్ధ క్షేత్రాల్లో కాదు, ఉమ్మడి బలంలోనే మానవాళి విజయం

యుద్ధ క్షేత్రాల్లో కాదు, ఉమ్మడి బలంలోనే మానవాళి విజయం

మానవాళి విజయం అనేది యుద్ధక్షేత్రాల్లో కాదు, ఉమ్మడి బలంలోనే దాగి ఉందని భారత ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. సోమవారం ఐరాసలో ఆయన ప్రపంచ దేశాధినేతలను ఉద్దేశించి ప్రసంగిస్తూ ప్రపంచంలో ఆరోవంతు జనాభా (140 కోట్ల మంది) భారతదేశ ప్రజల తరఫున తాను వాణి వినిపిస్తున్నానని చెప్పారు. ప్రపంచ భవితవ్యంపై అంతర్జాతీయ సమాజమంతా చర్చిస్తున్న తరుణంలో, మానవ కేంద్రంగా విధానాల రూపకల్పనకే అత్యంత ప్రాధాన్యం లభించాలని మోదీ పేర్కొన్నారు.

సుస్థిరాభివృద్ధికి ప్రాధాన్యమిస్తూనే మానవ సంక్షేమం, ఆహారం, ఆరోగ్య భద్రతలను చూసుకోవాలని అభిప్రాయపడ్డారు. సుస్థిరాభివృద్ధి విజయవంతమవుతుందని ప్రపంచానికి చాటేలా భారత్‌లో 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తీసుకువచ్చామని చెప్పారు. ఈ అనుభవాన్ని యావత్‌ ప్రపంచంతో పంచుకునేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.

ప్రపంచ సంస్థలను సంస్కరించాల్సిన అవసరం గురించి ప్రధాని మోదీ మరోసారి ప్రస్తావించారు. శాంతి, అభివృద్ధిల సాధనకు ఇది అత్యావశ్యకమని చెప్పారు. ఒక సంస్థ ఔచిత్యాన్ని తేల్చడంలో సంస్కరణలు కీలకమని తెలిపారు. జీ-20కి భారత్‌ నేతృత్వం వహించినప్పుడు ఆఫ్రికన్‌ యూనియన్‌కు శాశ్వత సభ్యత్వం కల్పించిన విషయాన్ని గుర్తుచేశారు.

ఒకపక్క ఉగ్రవాదం బెడద; మరోపక్క సైబర్, సముద్రయానం, అంతరిక్ష రంగాల్లో ఎదురవుతున్న సరికొత్త సవాళ్ల నుంచి ప్రపంచం బయటపడేలా తగిన స్థాయిలో ప్రయత్నాలు జరగాలని సూచించారు. ప్రపంచ ఆకాంక్షల్ని నెరవేర్చేలా ఈ ప్రయత్నాలు ఉండాలని అభిప్రాయపడ్డారు. సాంకేతికతను వినియోగించడంలో ప్రపంచ స్థాయిలో సంతులన నియంత్రణ ఉండాలని తెలిపారు.

డిజిటల్‌ మౌలిక సదుపాయాలు ఒక అడ్డంకిగా కాకుండా, వారధిలా ఉండాలని చెప్పారు. ‘ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిత’ అనేదానికి భారతదేశం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఆరోగ్యం, సౌర విద్యుత్తు విషయాల్లోనూ తమ దృక్పథం ఇదేనని పేర్కొన్నారు. యావత్‌ మానవాళి హక్కుల పరిరక్షణకు, ప్రపంచ సుసంపన్నతకు మనసా, వాచా, కర్మణా పనిచేయడాన్ని భారత్‌ ఇకపైనా కొనసాగిస్తుందని ప్రధాని మోదీ చెప్పారు.

తన మూడు రోజుల అమెరికా పర్యటనను విజయవంతంగా ముగించుకుని ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం న్యూయార్క్‌ నుంచి ఢిల్లీకి బయలుదేరారు. మూడు రోజుల పర్యటన సందర్భంగా న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితిలో క్వాడ్ లీడర్స్ సమ్మిట్, సమ్మిట్ ఆన్ ది ఫ్యూచర్ లో మోదీ పాల్గొన్నారు. దీంతో పాటు ఆయన తన పర్యటనలో కొన్ని ముఖ్యమైన ద్వైపాక్షిక సమావేశాలకు కూడా హాజరయ్యారు.

వియత్నాం అధ్యక్షుడు తో లామ్‌తో సమావేశమైన ప్రధాని నరేంద్ర మోదీ, ఇరు దేశాల మధ్య సంబంధాలను పెంపొందించుకోవడంతోపాటు కనెక్టివిటీ, వాణిజ్యం, సంస్కృతి వంటి రంగాల్లో సహకారాన్ని పెంపొందించుకోవడంపై చర్చించారు.