
సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. రిమాండ్‌లో ఉన్న వైసీపీ కార్యకర్తలను చూసేందుకు స్థానిక సబ్ జైలుకి వెళ్లారు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి. కేతిరెడ్డి రాకను తెలుసుకున్న టీడీపీ, బీజేపీ, జనసేన కార్యకర్తలు పెద్ద సంఖ్యలో సబ్ జైలు వద్దకు చేరుకున్నారు. దీంతో కాసేపు వైసీపీ, కూటమి కార్యకర్తలపై మధ్య తోపులాట జరిగింది.
కూటమి పార్టీల కార్యకర్తలు కేతిరెడ్డి వాహనాన్ని అడ్డగించారు. ఈ క్రమంలో బీజేపీ కార్యకర్త ఒకరు కారు పైకి ఎక్కారు. బీజేపీ కార్యకర్త వాహనంపై ఉండగానే కారును వేగంగా నడపడంతో… కార్యకర్త కింద పడిపోయాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాము వస్తున్న సమయంలో కేతిరెడ్డి వర్గీయులు తమ కార్లను అడ్డుగా పెట్టారని బీజేపీ నేత హరీష్ వర్గీయులు ఆరోపిస్తున్నారు.
ఉద్రిక్తతలు తలెత్తడంతో పోలీసులు అక్కడకు చేరుకుని ఇరు వర్గాలకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయితే ఈ ఘటన జరిగిన సమయంలో కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి సబ్ జైలు లోపల ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై మంత్రి సత్యకుమార్ యాదవ్ స్పందిస్తూ ఇదీ ధర్మవరం కేతిరెడ్డి నిజస్వరూపం అంటూ ట్వీట్ చేశారు. ఓటమితో మైండ్ బ్లాక్ అయ్యి ప్రజల పైకి తన వాహనాన్ని నడిపి, గుద్దుకుంటూ వెళ్లిపోయిన వైనం అంటూ వీడియోను ట్విట్టర్ లో పోస్టు చేశారు.
గతంలో చేసిన తప్పులకు కబ్జాలకు దౌర్జన్యాలకు ప్రజలు గుణపాఠం నేర్పినా వైసీపీ నేతలకు బుద్ధి రాలేదని విమర్శించారు. జైలు జీవితం గడపాలని కోరికగా ఉంటే త్వరలోనే తీరుస్తామని హెచ్చరించారు. కానీ ధర్మవరం ప్రజలకు చిన్న కీడు చేపట్టినా సహించమని, పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని గుర్తు పెట్టుకోవాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ హెచ్చరించారు.
“గుడ్ మార్నింగ్ అంటూ దొంగ డ్రామాలు ఆడిన కేతిరెడ్డి అసలు స్వరూపం ఇది. ప్రజలపై ఎంతో ప్రేమ ఉన్నట్లు దొంగ నాటకాలు ఆడిన ఆయన అసలు రూపం ఇది. ప్రాణాలను తీసేలా వాహనాన్ని వేగంగా నడిపిన ఇతను నాయకుడా? ప్రజలు గడ్డి పెట్టినా బుద్ధి మారలేదా కేతిరెడ్డి.? ప్రజా పాలనలో ఇలాంటి దౌర్జన్యాలు సాగవని గుర్తుపెట్టుకో”అంటూ టిడిపి నేత పరిటాల శ్రీరామ్ హెచ్చరించారు.
More Stories
ప్రధాని మోదీ రూ. 13,430 కోట్ల ప్రాజెక్టులకు కర్నూల్ లో శ్రీకారం రేపే
విశాఖలో రూ.88 వేల కోట్లతో దేశంలో తొలి గూగుల్ ఎఐ హబ్
వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్‌రెడ్డి నివాసాల్లో సిట్ సోదాలు