
కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన మేరకు, మంత్రివర్గ సమావేశంలో దీనిపై తీర్మానం చేసి కేంద్రానికి పంపనున్నట్లు వెల్లడించారు.
న్యాయశాఖపై సమీక్ష జరుపుతూ రాజధాని అమరావతిలో 100 ఎకరాల విస్తీర్ణంలో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ట్రస్ట్ ద్వారా ఇంటర్నేషన్ లా స్కూల్ ఏర్పాటును ముందుకు తీసుకువెళ్లాలని చంద్రబాబు అధికారులకు సూచించారు. బెంగుళూరుకు చెందిన నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ, గోవాలోని ఇండియా ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ లీగల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ లాంటి ప్రతిష్టాత్మక సంస్థల తరహాలో ఉండాలని చెప్పారు.
అలాంటి అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన అత్యుత్తమ ఇనిస్టిట్యూట్‌ను అమరావతిలో ఏర్పాటు చేసే ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను చంద్రబాబు ఆదేశించారు. జూనియర్ న్యాయవాదులకు గౌరవ వేతనం కింద నెలకు రూ.10 వేలు అందిస్తామని చెప్పారు. తమ మేనిఫెస్టోలో ఇచ్చిన ఈ హామీని అమలుచేసే ప్రక్రియను ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు.
జూనియర్ న్యాయవాదులకు శిక్షణ కేంద్రం కోసం అకాడమీ ఏర్పాటు అంశంపైనా కసరత్తు చేయాలని సూచనలు చేశారు. అనంతరం ప్రాసిక్యూషన్ విభాగంపై అధికారులు ముఖ్యమంత్రి ప్రజెంటేషన్ ఇచ్చారు. నమోదైన కేసులు, రుజువైన నేరాల అంశంలో శిక్షపడే శాతం పెరగాలని, దర్యాప్తు వేగవంతంగా పూర్తిచేసే పద్ధతులను అవలంబించాలని చంద్రబాబు సూచించారు.
తప్పుచేసినవారికి శిక్షపడుతుందనే నమ్మకం కలిగేలా ప్రాసిక్యూషన్ ఉండాలని చెబుతూ న్యాయశాఖపై మరింత సమగ్రంగా సమీక్ష చేయాలని, మరిన్ని వివరాలతో రావాలని అధికారులను ఆదేశించారు.
More Stories
ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు ప్రారంభం
జీఎస్టీ సంస్కరణలకు ప్రధాని మోదీకి సీఎం చంద్రబాబు అభినందనలు
సూర్యలంకలో నిర్వహించే బీచ్ ఫెస్టివల్ కు వినూత్న ప్రచారం