కల్తీ లడ్డు నెయ్యి వెనుక పళని ట్రస్ట్ బోర్డు సభ్యుడు!

కల్తీ లడ్డు నెయ్యి వెనుక పళని ట్రస్ట్ బోర్డు సభ్యుడు!
* విశ్వహిందూ పరిషత్ సంచలన ఆరోపణ .. తిరుమలలో శాంతి హోమం
 
ఇప్పుడు దేశ వ్యాప్తంగా ఆందోళనకు గురిచేస్తున్న తిరుపతి లడ్డు తయారీకి పందికొవ్వు, చేపనూనెలతో కల్తీ చేసిన నెయ్యిని ఉపయోగించడం వెనుక పళని ఆలయ ట్రస్ట్ బోర్డు సభ్యుడు ఒకరు ఉన్నారని విశ్వహిందూ పరిషత్ సంచలన ఆరోపణ చేస్తుంది.  రాజ్ మిల్క్’ బ్రాండ్‌ను కలిగి ఉన్న ఏఆర్  డైరీ ఫుడ్ (ప్రైవేట్) లిమిటెడ్ బీఫ్ టాకో, పంది పందికొవ్వు, చేప నూనెలతో కల్తీ చేసిన నెయ్యిని సరఫరా చేసినట్లు భావిస్తున్నారు.
ఏఆర్ డైరీ యజమాని రాజశేఖర్ పళని ఆలయ ట్రస్ట్ బోర్డు బోర్డు సభ్యుడు.  పళని దేవస్థానం బోర్డు 1.05 లక్షల కంటైనర్ల ‘పంచామృతం’ ప్రసాదాన్ని గడువు తేదీ ముగిసిన ఒక నెల తర్వాత విక్రయించడానికి ఓటీవ;ఆ ప్రయత్నించింది. ఏఆర్ డైరీ పంచామృతం ప్రసాదం కోసం నెయ్యిని సరఫరా చేసింది. అందుకోసం ఆలయం రూ. 99 లక్షలు చెల్లించాల్సి ఉంది.  ఈ విషయాన్ని విశ్వహిందూ పరిషత్ బహిరంగ పరచింది. 
 
దానితో రాజశేఖర్ తన కంపెనీ సరఫరా చేసిన దానైకి కొన్ని రసాయనాలను జోడించిన తర్వాత గడువు ముగిసిన ప్రసాదాన్ని తిరిగి ప్యాక్ చేయడానికి ప్యాకింగ్ యూనిట్ సిబ్బందికి పురమాయించాడు. దీన్ని కూడా వి హెచ్ పి  కార్యకర్తలు కూడా పట్టుకున్నారు. దానితో గత్యంతరం లేక రాజశేఖర్ గడువు ముగిసిన పంచామృతం ప్రసాదాన్ని పారవేయాల్సి వచ్చింది. 
 
దానితో ఆగ్రహంతో కల్తీ చేసిన వ్యక్తిని వదిలివేసి ఆలయ బోర్డు విశ్వహిందూ పరిషత్  కార్యకర్తలపై తప్పుడు ఫిర్యాదులు చేసింది. హిందూ వ్యతిరేక డిఎంకె ప్రభుత్వం పళని ఆలయ బోర్డు సభ్యులపై కేసులు నమోదు చేయకుండా పరిషత్ కార్యకర్తలను వెంబడించింది.  ఇదిలాఉంచితే, తిరుపతి ఆలయ దేవస్థానంతో రాజశేఖర్‌కు తోటి పళని ఆలయ బోర్డు సభ్యుడు, తిరుప్పూర్‌కు చెందిన మణి (డాలర్ బ్రాండ్ బనియన్ వేర్ యజమాని) ద్వారా అనుబంధం ఏర్పడింది. అతని దగ్గరి బంధువు టిటిడి సభ్యుడు.
 
ఈ అనుబంధం ద్వారా వారు రాజశేఖర్ నందిని డైరీ (కర్ణాటక ప్రభుత్వ పాల సమాఖ్య)తో టీటీడీ నెయ్యి టెండర్‌ను రద్దు చేయించి, ఏఆర్ డైరీకి ఇప్పించారని తెలుస్తున్నది.  ప్రస్తుతం తిరుపతి లడ్డూ ప్రసాదంపై తలెత్తిన వివాదంకు పళని దేవాలయంలో జరిగిన ఘటన  బాసటగా నిలుస్తుంది.
ఇలా ఉండగా, తిరుమల లడ్డూ ప్రసాదాలు, ఇతర నైవేద్యాల పవిత్రత, దైవత్వాన్ని పునరుద్ధరింపజేసేందుకు సోమవారం ఉదయం తిరుమల శ్రీవారి ఆలయంలోని బంగారు బావి వద్ద గల యాగశాలలో వైఖానస ఆగమోక్తంగా శుద్ధి, శాంతి హోమాలను టీటీడీ నిర్వహించింది. ఆహార పదార్థాలు, నైవేద్యాలు, ప్రసాదాలకు, వాటిని త‌యారీ చేసే యంత్రాల‌కు తీర్థం చ‌ల్లి, శుద్ధి చేశారు.
 
శ్రీవారి ఆలయంలో ఉదయం 6 నుండి 10 గంటల వరకు రుత్వికులు వాస్తు శుద్ధి, కుంభజాల సంప్రోక్షణ నిర్వహించారు. ఈ శాంతి హోమం ద్వారా భక్తులు లడ్డూ ప్రసాదం, నైవేద్యం నాణ్యతపై తమకున్న భయాలను, అపోహలను పక్కన పెట్టవచ్చని స్పష్టం చేశారు.  ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు, ఆగమ సలహాదారు మోహనరంగాచార్యులు మాట్లాడుతూ.. యాగశాలలో సంకల్పం, విశ్వక్సేన ఆరాధన, పుణ్యహవచనం, వాస్తు హోమం, కుంభప్రతిష్ట, పంచగవ్య ఆరాధన తదితర వైదిక కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు.
పూర్ణాహుతి అనంతరం కుంభ ప్రోక్షణ నిర్వహించి విశేష నైవేద్యం కూడా సమర్పించినట్లు పండితులు చెప్పారు. ఇక నుంచి లడ్డూ ప్రసాదాలు, నైవేద్యాలకు ఎలాంటి దోషాలు ఉండవని, భక్తులు సంతోషంగా స్వీకరించవచ్చని తెలిపారు.  కాగా, సాయంత్రం 6 గంటలకు శ్రీవారి భక్తులు తమ ఇంటిలో దీపారాధన చేసే సమయంలో, క్షమా మంత్రాలైన…. ”ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో వేంకటేశాయ” లను  పఠించి శ్రీవారి అనుగ్రహం పొందగలరని సూచించారు.